Friday, September 13, 2024

వరుణుడి ప్రకోపం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జలవిలయం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరద నీటి ఉధృతితో కాలనీల్లోని పలు ఇళ్లు నీట మునిగాయి. ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. రైళ్లు రద్దు కావడంతోపాటు ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. మహబాబూబాద్ శివారులో రైలుపట్టాలపై భారీగా వరదనీరు ప్రవహించడంతో మచిలీపట్నం, సింహపురి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో వాటిని ఆపేశారు.తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌కు వరద తాకింది. దీంతో పందిళ్లపల్లి వద్ద 4 గంటలపాటు మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. విజయవాడ-కాజీపేట మార్గంలో ట్రాక్ పైకి వరద చేరికతో 24 రైళ్లను నిలిపేశారు.

సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది. వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను శనివారం కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. వరంగల్ వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇప్పటికే రైళ్లు నిలిచిపోయాయి. అటు రైళ్లలో వెళ్లే మార్గం లేక, ఇటు బస్సులు కూడా నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు కూడా నిలిచిపోగా ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు విజయవాడ బస్టాండ్ లో ఇబ్బందులు పడుతున్నారు.

వరంగల్ జిల్లాలో ఐదుగురు మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వర్షానికి ఐదుగురు వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఐదుగురు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో మందపల్లికి చెందిన వృద్ధురాలు మరణించింది. మలుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పశువులను మోతకు తీసుకెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పరకాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయ్యి చివరికి శవంగా బయటకువచ్చాడు.

చిమిర్యాల వాగు ఉధృతి
చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఏపీ-తెలంగాణ సరిహద్దులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉగ్రరూపం దాల్చింది. కోదాడ దిగువన చిమిర్యాల వాగు, పాలేరు భీకరంగా ప్రవహిస్తున్నాయి. కోదాడ నుంచి దిగువకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. దాంతో చిమిర్యాల వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తెలంగాణ, విజయవాడ మధ్య రైళ్లు రద్దు
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కేసముద్రం- ఇంటికన్నె మార్గంలోని రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. కేసముద్రం రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికులకు పోలీసులు అల్పాహారం, నీరు అందించారు. ఈ రైల్వే ట్రాక్ పూర్తిస్థాయిలో దెబ్బతింది. రైల్వే ట్రాక్ కింద ఉండే కంకర మొత్తం వరదకు కొట్టుకుపోయింది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు 24 రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. రైల్వే అధికారులు కేసముద్రం- ఇంటికన్నె మార్గంలోని రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నారు. రైల్వేకు సంబంధించిన ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. కాజీపేట, రాయనపాడులో ట్రాక్‌లు తెగిపోవడం రైళ్లు నిలిపివేశారు. 80 రైళ్లు రద్దు, మరో 48 రైళ్లను దారి మళ్లించారు. హైదరాబాద్ -విజయవాడ రూట్‌లోనే అత్యధిక రైళ్లు రద్దయ్యాయి. పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఏపీలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్.. 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
కుండపోత వర్షాలతో ఏపీ అతలాకుతలం అయింది. మరో 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు, విజయవాడలోని సింగ్ నగర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. వరద దాటే ప్రయత్నం చేసిన ఓ మహిళ నీటిని దాటుతూ గుండెపోటుతో మృతి చెందింది. మృతదేహాన్ని తరలించలేక స్థానికులు కారుపై పెట్టారు. ఈ విషాదకర ఘటన గంగానమ్మ గుడి ఎదురుగా మసీదు రోడ్డులో చోటుచేసుకుంది. మొత్తం జలమయం కావడంతో సింగ్ నగర్ లో జనజీవనం స్తంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News