Sunday, September 15, 2024

‘నేతన్నకు చేయూత’కు రూ.90 కోట్లు

- Advertisement -
- Advertisement -

చేనేత కార్మికులలో పొదుపు భద్రతా భావాన్ని పెంపొందించుటకు ప్రవేశపెట్టిన నేతన్నకు చేయూత పథకానికి సంబంధించి గత ప్రభుత్వం బకాయి పెట్టిన నిధులతో పాటు ఎలాంటి బకాయిలు లేకుండా ముఖ్యమంత్రి చొరవతో ఏకమొత్తంగా రూ.90 కోట్లను నేతన్నకు చేయూత కింద విడుదల చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రి గురువారం నాడు ఒక ప్రకటనలో నేతన్నల చేయూత నిధుల వివరాలను వెల్లడించారు. ఈ పథకం సెప్టెంబర్ 2021 నాడు మొదలై ఆగస్టు 2024 న ముగియనుందని, ఈ నిధుల విడుదల ద్వారా 36,133 మంది చేనేత కార్మికులు లబ్ధిపొందుతారని తెలిపారు. ఈ పథకంలో చేనేత కార్మికులు ,అనుబంధ కార్మికులు తమ నెలసరి వేతనంలో 8 శాతం వాటా జమచేసినట్లైతే ప్రభుత్వం తమ వాటాగా 16 శాతంను పొదుపుఖాతాలో జమచేయడం జరుగుతుందని, ఈ మొత్తాలను వడ్డీతో సహా 3 సంవత్సరాల గడువు కాలం పూర్తికాగానే లబ్ధిదారులకు చెల్లించడం జరుగుతుందని మంత్రి తెలిపారు .

దీనివలన ఒక్కొక్క చేనేత కార్మికుల 3 సంవత్సరాల గడువు కాలం పూర్తికాగానే వడ్డీతో సహా సుమారుగా రూ. 60,000 నుండి 1,29,000 వరకు లబ్ధిపొందనున్నారని మంత్రి తెలపారు. గత ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోకుండా బకాయిపెట్టి వారి నోట మట్టికొట్టిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకం ముగిసే సమయానికి ముందే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలతో పాటు ఎలాంటి బకాయిలు లేకుండా నేతన్నలకు సామాజిక భద్రత కలిగించాలనే ఉద్ధేశ్యంతో నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడు కట్టుబడి ఉందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అని మంత్రి పేర్కొన్నారు. చేనేత కార్మికులు పడే కష్టానికి ఎలాంటి నష్టం కలగకుండా వారికి సరైన ప్రతిఫలం అందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించి, తద్వారా చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News