Sunday, May 12, 2024

ద్వేష దేశం!

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession    రామనవమి కూడా ఇంతగా రక్తసిక్తమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. భక్తుల కోలాహలంతో, విశాలమైన పందిళ్ల కింద, పానకాలు పప్పు బెల్లాలు సేవిస్తూ ప్రశాంతంగా జరుపుకునే శ్రీరామ నవమి ఈ ఏడాది అనేక రాష్ట్రాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలకు, మతపరమైన ద్వేషకావేషపూరిత కల్లోలాలకు దారి తీయడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం. ఇప్పటికే కర్నాటక హిజాబ్ వంటి వరుస మత విద్వేష ఘటనలతో హిందూత్వ హింసాకాండకు పరాకాష్ఠగా మారింది. అదే మాదిరిగా వివిధ రాష్ట్రాల్లో హిందూ ఓటును పెంచుకోడానికి మత కల్లోలాలను రెచ్చగొట్టే శక్తులు పెచ్చరిల్లుతున్నాయి. ఆదివారం శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, గుజరాత్‌లలో చెలరేగిన మత ఘర్షణలు ఇద్దరిని బలి తీసుకున్నాయి. అనేక మంది గాయపడ్డారు. ఢిల్లీ గాలిలో కాలుష్యం గరిష్ఠ స్థాయిలో గూడుకట్టుకున్న విధంగానే దేశ వాతావరణంలో ద్వేషభావం దట్టంగా అలముకున్నదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

పలు రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు కల్లోలాలకు కారణమైనవారిని విడిచిపెట్టబోమని భీషణ ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాస్తవంలో చట్టబద్ధంగా జరగవలసిన దర్యాప్తులు, తీసుకోవలసిన న్యాయపరమైన విధ్యుక్త చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రధాని వంటి పెద్దలు ఇటువంటప్పుడు నోరు తెరిచి జాతి సమైక్యతను దెబ్బ తీసే శక్తులను క్షమించే ప్రసక్తి లేదని గట్టిగా హెచ్చరించిన సందర్భమూ చోటు చేసుకోడం లేదు. అటువంటి పెద్దల మౌనాన్ని అరాచక శక్తులకు అండ, ఆమోద ముద్రగానే భావించాలి. భారత రాజ్యాంగం ప్రధాన లక్షమే భిన్నత్వంలో ఏకత్వ సాధన. అంటే వివిధ, విభిన్న మతాల, భాషల, ప్రాంతాల, కులాల తదితర వర్గాల ప్రజల మధ్య సమైక్యతను కాపాడడమే. కాని గత ఏడెనిమిది సంవత్సరాలుగా అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి దేశంలో నెలకొని రోజురోజుకీ తీవ్ర రూపం ధరిస్తున్నది. రామనవమి నాడు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనేలో రెండు వర్గాల మధ్య ఘర్షణ అల్లర్లకు దారి తీసింది. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర పోలీసులు 84 మందిని అరెస్టు చేశారు. అంత వరకు బాగానే వుంది.

కాని అల్లర్లకు కారకులని భావిస్తున్న వారి ఆస్తులను ప్రభుత్వ యంత్రాంగమే ధ్వంసం చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఖర్గోనేలో సోమవారం నాడు 45 మంది ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఇండోర్ డివిజనల్ కమిషనర్ పవన్ శర్మ స్వయంగా ప్రకటించారు. కోర్టుల్లో కేసులు దాఖలు చేసి అక్కడ వెలువడే తీర్పుల మేరకు నిందితులపై చర్య తీసుకోడం అనే పద్ధతిని ఎందుకు అతిక్రమించారని అడగగా ఆర్థికంగా దెబ్బ తింటామనే భయాన్ని దుండగుల్లో కల్పించడమే తమ ఉద్దేశమని అందుకోసమే వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నామని ఆయన సెలవిచ్చారు. అంటే దేశంలో అమలులో వున్న న్యాయ ప్రక్రియను ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తున్నదని వెల్లడవుతున్నది. ఈ విషయంలో మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం యుపిలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్నదని అనుకోవలసి వుంది. చట్టవ్యతిరేకులను శిక్షించే క్రమంలో తాము కూడా చట్టాన్ని అతిక్రమించడం, శాసనాల మూలంలో వున్న రాజ్యాంగాన్ని అవమానపరచడాన్ని అధికారంలో వున్నవారే అలవర్చుకోడం బాధాకరం. మత కల్లోలాల బాధ్యుల ఆస్తులను ధ్వంసం చేయడమనే విధానం ఇందులోకే వస్తుంది. దేశాన్ని ఎప్పుడూ ఏదో ఒక నెపంతో నిరంతరం పేలుతున్న మందుపాతరలా వుంచి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మెజారిటీ మతస్థుల ఓటును జనహితం ప్రాతిపదికగా కాకుండా మత ప్రాతిపదికగా వ్యవహరించే విధంగా మలచడమనే ఒక పెద్ద వ్యూహం అమలవుతున్నదని స్పష్టపడుతున్నది.

ఇది స్వాతంత్య్రానంతరం దేశ నాయకత్వం, ప్రజలు కలిసి చెప్పుకున్న మతసఖ్యతతో కూడిన సెక్యులర్ సంకల్పానికి పూర్తి విరుద్ధమైనది. శ్రీరామ నవమి నాడే సుప్రసిద్ధ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) లో ఒక వర్గీయులు మాంసాహారం వండడంపై తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీయడం, బిజెపికి చెందిన అఖిల భారతీయ విద్యార్థి సంఘం (ఎబివిపి) అభ్యంతరం తెలిపి కయ్యానికి కాలుదువ్వడం మరింత దారుణమైన పరిణామం. ఇతరుల ఆహారంపైన, ఆహార్యంపైన దాడులు చేయడం, రాజ్యవ్యవస్థ తన ముష్కర బలాన్ని ప్రజల వంటిళ్లపై ప్రయోగించడం అంతిమంగా దేశంలోని భిన్నత్వాన్ని మూర్ఖత్వంతో, మృగత్వంతో నాశనం చేయాలనుకోడం అభ్యుదయ సమాజం వర్ధిల్లడానికి తీవ్రమైన ఆటంకాన్ని కలుగజేసి ఇక్కడ ఇంత కాలం పడిన ప్రగతిశీల అడుగులను వెనుకకు మళ్లించడానికే దారి తీస్తుంది. ఇది చెప్పనలవికాని జాతీయ విషాదానికి చిహ్నం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News