Friday, May 17, 2024

కొత్త ఒరవడి సృష్టించా

- Advertisement -
- Advertisement -

Chief Justice NV Ramana farewell speech

టెక్నాలజీ వాడకంపై మరింత దృష్టి
మార్పు నిరంతర ప్రక్రియ
ఒక్కరితో ఆరంభం కాదు
ఒక్కరితో ముగియదు

న్యూఢిల్లీ : పెండింగ్ కేసులు దేశ న్యాయవ్యవస్థకు పెను సవాలుగా మారాయని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ చెప్పారు. శుక్రవారం ఆయన పదవి బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తిగా తన అనుభవాల క్రమంలో న్యాయవ్యవస్థ, న్యాయస్థానాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. దీర్ఘకాలం వ్యాజ్యాలు విచారణకు నోచుకోకపోవడం ప్రధాన సమస్యఅయిందన్నారు. తన పదవీకాలంలో ఈ సమస్య పరిష్కారానికి ఎక్కువగా దృష్టి కేంద్రీకృతం చేయలేకపోయినందుకు చింతిస్తున్నానని తెలిపారు. పెండింగ్ కేసుల సమస్యల పరిష్కారానికి అధునాతన టెక్నాలజీని విరివిగా వాడుకోవచ్చు. సంబంధిత టూల్స్‌ను విరివిగా వాడకానికి తీసుకురావాలి. ఇక పెండింగ్ కేసుల పరిష్కారానికి కృత్రిమ మేధను కూడా వాడుకునేందుకు యత్నించాల్సి ఉందన్నారు. టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి అనేక విధాలుగా యత్నించామని అయితే ప్రతికూలతలు , భద్రతా కారణాలతో ఈ దిశలో ఎక్కువగా ముందుకు వెళ్లలేకపొయ్యామని వివరించారు. కొవిడ్ దశలో దాదాపు రెండేళ్ల పాటు కోర్టుల నిర్వహణనే ప్రధాన అంశం అయింది. వాణిజ్య సంస్థల మాదిరిగా టెక్నాలజీ సాధనాసంపత్తిని న్యాయస్థానాలు నేరుగా మార్కెట్‌నుంచి సేకరించుకోలేకపొయ్యాయని తెలిపారు.

కేసుల లిస్టింగ్ పోస్టింగ్‌లపై తాను ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వలేకపోయానని వివరించారు. ఏ రోజుకు ఆరోజు విచారణలు సంబంధిత ప్రక్రియలతోనే రోజులు గడిచినట్లు, ఈ క్రమంలో పెండింగ్ కేసుల పరిష్కారం ప్రాధాన్యతక్రమంలోకి రాలేదని తెలిపారు. యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి జస్టిస్ ఎన్‌వి రమణ ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో వారి కేసులు విచారణకు వచ్చేలా చేయడంలో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. న్యాయవ్యవస్థకు ఉన్న సమస్యలు విభిన్నమైనవని, ఇతర రంగాల మాదిరిగా ఉండేవి కావని అన్నారు. న్యాయవ్యవస్థ సమగ్రతకు పలు కీలక మార్పులు జరగాల్సి ఉంది. అయితే న్యాయవాదులు, న్యాయవాదుల సంఘాలు (బార్ అసోసియేషన్) నుంచి సంపూర్ణ మనస్ఫూర్తి లేకపోతే ఈ మార్పులు తీసుకురావడం అసాధ్యం అవుతుందన్నారు. న్యాయవాద వృత్తిని ఎంచుకున్న జూనియర్లు సీనియర్లను ఆదర్శంగా తీసుకుని వ్యవహరించాలి. వారి విజయాలను పట్టుదలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇదే దశలో సీనియర్లు కూడా వారిని సరైన విధంగా నడిపించాలని కోరారు. భారతీయ న్యాయవ్యవస్థ కాలానుగుణంగా సాగుతూ వెళ్లుతోంది. కాలగమనాన్ని సంతరించుకుంది. ఏదో ఒక రూలింగ్ లేదా ఒక్క తీర్పుతో మన న్యాయవ్యవస్థను నిర్వచించలేమని, ఖరారు చేయలేమని తెలిపారు. సామాన్యుడికి సత్వర, తక్కువ వ్యయప్రయాసలతో కూడిన సముచిత న్యాయం దక్కేందుకు మన మంతా కలిసిపనిచేయాల్సి ఉంది. ఈ దిశలో సమగ్ర చర్చలు సంప్రదింపులు అవసరమే అన్నారు.

ఈ వ్యవస్థ పరిణతి లేదా ప్రగతికి పాటుపడే ప్రధమ లేదా చివరి వ్యక్తిని తానే అని తాను చెప్పడం లేదని , ఈ క్రమంలో ఇదో నిరంతర ప్రక్రియగా ఉంటుందని అన్నారు. వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, సంస్థ ప్రధానం అని తేల్చిచెప్పారు. తన సహచరులు, న్యాయవాదులు అందించిన మద్దతు సహకారానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని , విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తున్నందుకు బాధగానే ఉందన్నారు. తన వీడ్కోలు ప్రసంగాన్ని థాంక్యూతో ముగించారు. గత ఏడాది ఎప్రిల్ 4న దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఎన్‌వి రమణ 16 నెలల పదవీకాలం తరువాత శుక్రవారం బాధ్యతల నుంచి వైదొలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News