Thursday, May 9, 2024

కమ్యూనిస్టు ప్రజాస్వామ్య నేత

- Advertisement -
- Advertisement -

Communist democratic leader

కమ్యూనిస్టు సమాజంలో పౌరుల భావవ్యక్తీకరణకు, ప్రజాస్వామ్య విలువలకు ఏమాత్రం పొసగదు. అయితే నాడు ప్రపంచంలో స్వేచ్ఛా మార్కెట్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు పార్టీ ‘నిరంకుశ పాలన’ను కొనసాగిస్తూనే ప్రజాస్వామ్యం కోసం ఆరాటపడటం తర్వాత 20వ శతాబ్దంలో ప్రపంచ చరిత్రనే మలుపు తిప్పిన గొప్ప సాహసి, సంస్కరణాభిలాషి మిఖాయిల్ గోర్బచేవ్. తాను కోరుకోనప్పటికీ తన చర్యల కారణంగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవుతున్నా, ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ పాలన అంతమవుతున్నా, తన అధికార పీఠం కదులుతున్నా ఏమాత్రం చలించకుండా తాను విశ్వసించిన విలువల కోసం నిలబడ్డ ధీరుడు. తమ సువిశాల సామ్రాజ్యాన్ని కూల్చివేశారనే ఆగ్రహం ఇంకా రష్యా ప్రజలలో ఆయన పట్ల ఉండవచ్చు.

అయితే ఆకలితో, పేదరికంతో మగ్గిపోకుండా రష్యా నేడు అమెరికాకు పోటీపడే రీతిలో ఓ సంపన్న దేశంగా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైన రీతిలో మనగలుగుతున్నదంటే ఆయన దూరదృష్టి, దృఢమైన సంకల్పమే అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఆగస్టు 31 రాత్రి ఆయన 91 ఏళ్ళ వయస్సులో మృతి చెందడంతో ఒక శకం ముగిసినదనే చెప్పాలి. ప్రచ్ఛన్న యుద్ధానికి తెర దించడం ద్వారా ప్రపంచంలో మరోసారి రెండో ప్రపంచ యుద్ధం నాటి భయంకర మారణవధకు ఆస్కారం లేకుండా కాపాడిన యోధుడు. నేటికీ అనేక కమ్యూనిస్టు దేశాలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియా వంటి మినహాయింపులు తప్పా చైనా తో సహా అన్ని దేశాలు భిన్నమైన ఆర్ధిక విధానాలు అవలంబిస్తూ, కొంతమేరకు పౌరులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆర్ధికంగా దేశ ప్రగతికి కృషి చేయడం ఆయనతోనే ప్రారంభమైంది.

ఓ సామూహిక వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే సాధారణ కార్మికుడిగా, పేదరికంతో జీవితం ప్రారంభించి, మొత్తం దేశపు అభివృద్ధి నమూనానే మార్చివేసేందుకు దృఢసంకల్పంతో కృషి చేయడం ద్వారా అసామాన్యమైన విజయాలు సాధించారు. అందుకు ఆయన చూపిన చొరవ, ప్రదర్శించిన దూరదృష్టి, వ్యక్తపరచిన నాయకత్వ నమూనా చూసినట్లయితే 20వ శతాబ్దంలో అటువంటి మరో నేత కనిపించరని చెప్పాలి. 1917 విప్లవం తర్వాత జన్మించిన మొదటి రష్యా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన పూర్వ నేతలవలే తమ అధికారాన్ని శాశ్వతం చేసుకొనే ప్రయత్నం చేయకుండా భవిష్యత్ తరాల బతుకుల గురించి ఆరాటపడిన గొప్ప నేత. రేషన్ కోసం భారీ క్యూలు, సాధారణ ప్రజల జీవన పరిస్థితులు అధ్వానంగా ఉండడం వంటి పరిస్థితులను మార్చడం కోసం వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు.

దాదాపు పతనావస్థలో ఉన్న సోవియట్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం తన ముందున్న మొదటి కర్తవ్యంగా గుర్తించారు. తన ఆర్థిక సంస్కరణలు సఫలమవ్వాలంటే కమ్యూనిస్టు పార్టీలోనే సమూల సంస్కరణలు అవసరమని అర్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా గోర్బచేవ్ ఉపయోగించిన రెండు రష్యన్ పదాలను సాధారణ వాడుకలోకి తెచ్చింది. దేశానికి పెరెస్ట్రోయికా లేదా పునర్నిర్మాణం అవసరమని, దానితో వ్యవహరించడానికి తన సాధనం గ్లాస్నోస్ట్ – ఓపెన్‌నెస్ అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. 1991లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌గా పేరు మార్చబడిన లెనిన్‌గ్రాడ్‌లోని కమ్యూనిస్టు అధినేతలతో మీరు మిగిలిన ఆర్థిక వ్యవస్థల కంటే వెనుకబడి ఉన్నారు అని గుర్తు చేశారు. మీ నాసిరకం వస్తువులు అవమానకరం అంటూ నిర్మోహమాటంగా స్పష్టం చేశారు.

అయితే ప్రభుత్వ నియంత్రణను స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థతో భర్తీ చేయడం తన ఉద్దేశం కాదని 1985లో పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన స్పష్టం చేశారు. మీలో కొందరు మీ ఆర్థిక వ్యవస్థలకు మార్కెట్‌ను లైఫ్ సేవర్‌గా చూస్తారు. కానీ, కామ్రేడ్స్, మీరు లైఫ్‌సేవర్‌ల గురించి కాకుండా ఓడ గురించి ఆలోచించాలి. ఓడ సోషలిజం అంటూ సామ్యవాదం పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించారు. వ్యవస్థలోని స్తబ్దతను ఎదుర్కోవటానికి ఆయన ఉపయోగించిన మరొక ఆయుధం ‘ప్రజాస్వామ్యం’. ప్రజాప్రతినిధుల కాంగ్రెస్‌కు తొలిసారిగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి. సుదీర్ఘకాలం అణచివేత పాలనలోని వ్యవస్థలో ఈ సడలింపు విస్తృతమైన సోవియట్ యూనియన్‌లోని అనేక విభిన్న జాతీయులలో ప్రకంపనలు సృష్టించింది. డిసెంబరు 1986లో కజకిస్తాన్‌లో జరిగిన అల్లర్లు అశాంతి కాలానికి నాంది పలికాయి. గోర్బచేవ్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించాలని కోరుకున్నారు. ఇంటర్మీడియట్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం ద్వారా మొత్తం తరగతి ఆయుధాలను రద్దు చేయడం కోసం అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌తో విజయవంతంగా చర్చలు జరిపారు. పైగా, సోవియట్ సాంప్రదాయ దళాలలో ఏకపక్ష కోతలను ప్రకటించారు. చివరకు అఫ్ఘానిస్తాన్ లో అవమానకరమైన, రక్తపాత ఆక్రమణను ముగించారు. కానీ ఆయనకు కష్టతరమైన పరీక్ష సోవియట్ యూనియన్‌లో ఇష్టపూర్వకంగా చేర్చుకున్న దేశాల నుండి వచ్చింది. ఇక్కడ నిష్కాపట్యత, ప్రజాస్వామ్యం స్వాతంత్య్రం కోసం ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో గోర్బచేవ్ వాటిని బలవంతంగా అణిచి వేశారు.

అయితే, యుఎస్‌ఎస్‌ఆర్ విచ్ఛిన్నం ఉత్తరాన బాల్టిక్ రిపబ్లిక్లలో ప్రారంభమైంది.లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియాలు మాస్కో నుండి విముక్తి పొందాయి. రష్యా వార్సా ఒప్పందం మిత్రదేశాలకు వ్యాపించే రోలర్ కోస్టర్‌ను ప్రారంభించాయి. 9 నవంబర్ 1989 న, సామూహిక ప్రదర్శనల తర్వాత, సోవియట్ ఉపగ్రహాలలో అత్యంత కఠినమైన రేఖ అయిన తూర్పు జర్మనీ పౌరులు స్వేచ్ఛగా పశ్చిమ బెర్లిన్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబడినప్పుడు అది పరాకాష్ఠకు చేరుకుంది. ఎటువంటి సమస్య ఎదురైనా ట్యాంకులను పంపి అణచివేసే కఠోరమైన సాంప్రదాయ సోవియట్ ప్రతిస్పందనకు గోర్బచేవ్ భిన్నంగా వ్యవహరించారు. ఇతర కమ్యూనిస్టు పాలకుల వలె ఆయన అణచివేత విధానాలు అవలంబిస్తే సోవియట్ యూనియన్ మనుగడను కాపాడి ఉండేవారేమో, ఆయన కూడా సుదీర్ఘకాలం దేశాధినేతగా కొనసాగేవారేమో. అయితే ఆయన ఎటువంటి పరిస్థితులలో కూడా తాను నమ్మిన విధానాలను విడనాడలేదు.

అందుకనే జర్మనీ పునరేకీకరణ అంతర్గత జర్మన్ వ్యవహారం అని ప్రకటించడం ద్వారా పరోక్షంగా సానుకూలత వ్యక్తం చేశారు. బలప్రదర్శన’కు దిగకపోవడానికి కారణాలను ఆ తర్వాత ఆయనే చెప్పారు. సోవియట్ యూనియన్‌లోని పలు ప్రాంతాలలో అణ్వాయుధాలు ఉండడంతో, అంతర్గత యుద్ధం సంభవిస్తే అణ్వాయుధాల ప్రయోగంకు దారితీసి అనూహ్యమైన మారణహోమం సంభవించే ప్రమాదం ఉందని, అందుకనే తాను ఎంతో సంయమనంతో వ్యవహరింప వలసి వచ్చిందని చెప్పారు. 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడానికి దారితీసిన ప్రజాభిప్రాయ సేకరణను గోర్బచేవ్ సమర్థించారు. క్రిమియా గతంలో సోవియట్ చట్టాల ఆధారంగా ఉక్రెయిన్‌లో చేరింది. అంటే పార్టీ చట్టాలు, ప్రజలను అడగకుండానే. ఇప్పుడు ప్రజలు ఆ తప్పును సరిదిద్దాలని నిర్ణయించుకున్నారు అని ప్రకటించడం ద్వారా సోవియట్ యూనియన్ పతనాన్ని ఆయన కోరుకోలేదని స్పష్టం అవుతుంది.

1990లో గోర్బచేవ్ తూర్పు- పశ్చిమ సంబంధాలలో సమూల మార్పులలో ప్రధాన పాత్ర పోషించినందుకు నోబెల్ శాంతి బహుమతిని పొందారు. కానీ ఆగస్టు 1991 నాటికి మాస్కోలోని కమ్యూనిస్టు పాత గార్డులు సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డారు. గోర్బచేవ్ నల్ల సముద్రంలో సెలవులో ఉన్నప్పుడు అరెస్టు చేశారు.

మాస్కో పార్టీ అధినేత బోరిస్ యెల్ట్సిన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుగుబాటును ముగించాడు. ప్రదర్శనకారులను అరెస్టు చేశాడు.గోర్బచేవ్‌కు స్వేచ్ఛగా వదిలినందుకు ప్రతిఫలంగా రాజకీయ అధికారం నుండి దాదాపుగా తొలగించాడు. ఆరు నెలల తర్వాత గోర్బచేవ్ వెళ్ళిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీని చట్టవిరుద్ధంగా ప్రకటించి, రష్యా కొత్త, అనిశ్చిత, భవిష్యత్తును ప్రారంభించింది. మిఖాయిల్ గోర్బాచేవ్ రష్యా, అంతర్జాతీయ వ్యవహారాలలో పాల్గొనడం కొనసాగించినా ఆయన పట్ల స్వదేశంలో కంటే ఎక్కువగా ఇతర దేశాలలో గౌరవం ప్రదర్శిస్తుండేవారు. 1996లో రష్యా అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు 5% కంటే తక్కువ ఓట్లు రావడం గమనిస్తే రష్యా ప్రజలలో ఆయన పట్ల ఎటువంటి విముఖత కొనసాగుతుందో వెల్లడవుతుంది. 1999లో భార్య రైసా లుకేమియాతో మరణించడంతో ఆయన వ్యక్తిగతంగా దెబ్బ తిన్నారు. ఆయన వైపు ఆమె నిరంతరం ఉండటం ఆయన రాజకీయ సంస్కరణలకు మానవీయ స్పర్శను అందించింది. ఆయన రాజకీయ వ్యవహారాలలో ప్రధానమైన స్ఫూర్తిగా ఆమె నిలిచారు.

* చలసాని నరేంద్ర- 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News