Tuesday, May 7, 2024

జైలు కాదు, బెయిల్

- Advertisement -
- Advertisement -

Supreme Court Grants interim Bail to Teesta Setalvad పాము నోట్లోని కప్పనైనా విడిపించవచ్చు గాని ప్రభుత్వాలు పగబట్టిన వ్యక్తులకు మోక్షం కలిగించడం సులభ సాధ్యం కాదు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో దొంగ పత్రాలు దాఖలు చేసి ఫోర్జరీకి పాల్పడ్డారన్న అభియోగంపై ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ప్రముఖ హక్కుల కార్యకర్త, సిటిజన్స్ ఫర్ జస్టిస్, పీస్ (సిజెపి) కార్యదర్శి తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడం ఊహించని ఒక మంచి పరిణామమే. బలవంతులైన పాలకులను ఎదిరించి మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడే వ్యక్తులకు, సంస్థలకు ఈ పరిణామం ప్రోత్సాహకారి అవుతుంది. తగిన కారణాలు లేకుండా బెయిల్ మంజూరును వీలైనంత ఆలస్యం చేయడం కొంతవరకైనా తగ్గుతుంది. తీస్తాకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంలో ఇటీవలనే బాధ్యతలు స్వీకరించిన భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ పోషించిన పాత్ర ప్రశంసించిందగినది. ఒక మహిళను ఆమె బెయిల్ అభ్యర్ధనపై అనవసర కాలయాపన చేస్తూ జైల్లో నిరవధికంగా నిర్భంధిడం తగదని భావించి జస్టిస్ లలిత్ సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీస్తా సెతల్వాడ్‌కు ఈ బెయిల్ మంజూరు చేసింది.

గోధ్రా అనంతర గుజరాత్ అల్లర్ల వెనుక అప్పటి ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ హస్తమున్నదని, పోలీసులు సకాలంలో రంగప్రవేశం చేయకుండా ఆయనే అడ్డుకున్నాడనే ఆరోపణలతో అల్లర్ల బాధితురాలు జకియా జాఫ్రితో కలిసి వేసిన నేరస్థ కుట్ర కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత జూన్ 25న గుజరాత్ పోలీస్ టెర్రరిజం స్క్వాడ్ తీస్తాను అరెస్టు చేసింది. ఈ కేసులోని కొన్ని వివరాలు అస్పష్టంగా ఉన్నాయని భావించిన ధర్మాసనం నిందితురాలిని రెండు మాసాలుగా జైల్లో ఉంచి ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేయకపోడాన్ని తప్పు పట్టింది. సెతల్వాడ్ పెట్టుకొన్న బెయిల్ పిటిషన్‌పై విచారణను గుజరాత్ హైకోర్టు ఆరు వారాల సుదీర్ఘ కాలం వాయిదా వేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించింది. బెయిల్ పిటిషన్‌పై అంతిమ నిర్ణయం తీసుకొనే బాధ్యతను గుజరాత్ హైకోర్టుకు వదిలివేస్తూనే తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

జకియా జాఫ్రి, తీస్తా సెతల్వాడ్ల నేరస్థ కుట్ర పిటిషన్‌ను గత జూన్‌లో కొట్టి వేస్తూ జాఫ్రి భావోద్వేగాలను వాడుకొని సెతల్వాడ్ ఆ కేసు వేయించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దానిని ఆసరా చేసుకొని గుజరాత్ ప్రభుత్వం ఈ కేసును ఆమెపై వేసింది. బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు పరిశీలించడాన్ని మేము ప్రశ్నించడం లేదు. పరిశీలన జరిగే సమయంలో నిందితులను కస్టడీలో ఉంచడం అవసరమా అనే కోణంలోనే మేము ఈ వ్యవహారాన్ని చూస్తున్నాము అని ధర్మాసనం పేర్కొన్నదంటే అవసరం లేకున్నా ఆమెను జైల్లో ఉంచారని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడినట్టు స్పష్టపడుతున్నది. ఈ కేసులో తీస్తా సెతల్వాడ్‌పై చేసిన ఆరోపణలు హత్యానేరం, గాయపరచడం వంటి నేరాలకు సంభవించినవి కావని ధర్మాసనం తీర్పులో పేర్కొన్నది. బెయిల్ మంజూరును అడ్డుకొనే నేరారోపణలేవీ లేవని స్పష్టం చేసింది. బెయిల్ మంజూరును ప్రోత్సహించడానికి అనేక ఆదేశాలు జారీ అయినప్పటికీ కింది కోర్టులు అందుకు విముఖతను ప్రదర్శించడం ఆందోళన చెందవలసిన విషయమని సుప్రీంకోర్టు గత డిసెంబర్‌లో స్పష్టంగా పేర్కొన్నది. కింది కోర్టుల ఆలోచనా విధానం, వ్యవహరించే తీరు మారాలని అన్నది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ముఖ్యమైన రాజ్యాంగ ఆశయమని, నిందితులు విచారణకు సహకరిస్తున్నప్పుడు అలవాటైన పద్ధతిలో అరెస్టులకు పాల్పడడం తగదని కూడా న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఎమ్‌ఎమ్ సుందరేశ్‌ల ధర్మాసనం పేర్కొన్నది.

నిందితులను అరెస్టుచేసి తన ముందు ఉంచలేదన్న కారణంపై ట్రయల్ కోర్టులు ఛార్జ్ షీట్‌ను ఆమోదించకుండా ఉండరాదని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రతి కేసులోనూ ప్రతి ఒక్కరినీ జైల్లో తోయడం సరికాదని అంటూ జైలు కాదు బెయిల్ అని ప్రకటించింది. ఈ సందేశాన్ని కింది కోర్టులే కాదు, హైకోర్టులు కూడా పట్టించుకోడం లేదని తీస్తా సెతల్వాడ్ కేసులో వెల్లడవుతున్నది. యోగ్యమైన కేసుల్లో కింది కోర్టులు బెయిల్ తిరస్కరిస్తున్నందు వల్ల ఆ భారం సుప్రీంకోర్టు మీద పడుతున్నది. ఆలోగా జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. వ్యక్తి స్వేచ్ఛ నిరవధిక బందీ అయిపోతున్నది. ఛీటింగ్ కేసులో 2012లో అరెస్టు అయిన ఒక మహిళపై చీఫ్‌మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆరోపణలను నిర్ధారించకపోడంతో ఆమె తొమ్మిదేళ్లు జైల్లో మగ్గిన ఉదంతం ఢిల్లీలో చోటు చేసుకుంది. దేశంలోని ఖైదీలలో 75 శాతం విచారణలోని వారే. వారిలో అర్హులకు బెయిల్ మంజూరు చేస్తే జైళ్లు ఖాళీ అవుతాయి, కిక్కిరిసిపోడం ఆగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News