Saturday, July 27, 2024

బిఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చింతకాని : అబద్ధాల పునాదులపై బిఆర్‌ఎస్ పుట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సిపిఎం, సిపిఐ బలపరుస్తున్న కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డితో కలిసి బోనకల్, చింతకాని మండలాల మండల కేంద్రాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధుపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కాకిలా అరుస్తున్నారని ఘాటుగా విమర్శలు వర్షం కురిపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లాలో కలిశారని, మరో పార్టీ అభ్యర్థికి ఇక్కడ స్థానం లేదన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతవుతుందని, ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. ఆ పార్టీ ఎంపి అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలిస్తే కేంద్ర మంత్రి ఎలా అవుతారో కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో అంచనాలను రూ.25 వేల కోట్లకు పెంచి ఖమ్మం జిల్లాకు చుక్క నీరు ఇవ్వని దు ర్మార్గుడు కెసిఆర్ అని నిప్పులు చెరిగారు. పదేళ్లు పాలించిన మీరు ఏనాడైనా మొ దటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేశారా అని ఆయన కెఆర్‌ను ప్రశ్నించారు.

ఖమ్మం జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండేదని, ఇవాళ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐతో పాటు కూటమికి తెలుగు తమ్ముళ్లు సైతం మద్దతు ఇస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతయిందని, కారు గ్యారేజ్‌కి వెళ్ళిందని, స్టీరింగ్ ఒకరు, టైర్లు ఒకరు ఊడ తీసుకొని వెళ్ళిపోయారని, ఇక ఈ రాష్ట్రంలో కారు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఎక్కడో గేట్లు ఎత్తితే కృష్ణమ్మ ఖమ్మం జిల్లా భూములను తడుపుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారానే ఇది సాధ్యమైందని అన్నారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ఆధ్వర్యంలో రాజీవ్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి ఖమ్మం జిల్లా రైతుల కాళ్లు కడుగుతామన్నారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు గాను ఇప్పటివరకు 65 లక్షల మందికి రైతుబంధు నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ రోజు కూడా కొంతమంది రైతులకు జమ అయ్యాయన్నారు. ‘మీరు రైతుబంధు మొదలుపెట్టి తొమ్మిది నెలల పాటు వేశారు, మేం ఐదు నెలలలోపే పూర్తి చేశాం’ అని బిఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పైసా వృధా పోనివ్వకుండా రాష్ట్రంలోని ప్రజలకు పంచుతామని, అందుకే ఆరు గ్యారెంటీలు ప్రకటించామని, వాటిని అమలు చేస్తున్నామని అన్నారు.

అయోధ్య రాముడు పేరుతో మోడీ రాజకీయాలు….రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి
అయోధ్య రాముడు పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయాలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. బిజెపి మరొకసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు మొత్తాన్ని తొలగిస్తారని, దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ధనిక రాష్ట్రాన్ని కెసిఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని, ఒక లక్షా 50 వేల కోట్ల రాష్ట్ర సంపదను కెసిఆర్ దోచుకున్నాడని విమర్శించారు. కెసిఆర్‌కి సిగ్గు, బుద్ధి లేదన్నారు. వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలని హితవు పలికారు.
అధికారం పోగానే కర్ర పట్టుకుని తిరుగుతున్న కెసిఆర్..
అధికార దాహం కలిగిన కెసిఆర్‌కి అధికారం పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండి కర్ర పట్టుకొని తిరుగుతున్నాడని కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విమర్శించారు. అధికారం ఉన్నంతకాలం అహంకారంతో ఎవరినీ లెక్క చేయలేదన్నారు. కెసిఆర్ 3650 రోజుల పాటు పరిపాలన చేశారని కానీ తాను ఇచ్చిన ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కానీ రేవంత్ రెడ్డి కేవలం 140 రోజుల పరిపాలన చేశారని అన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి..
వామపక్షాల ఇండియా కూటమి అభ్యర్థుల విజయం కోసం వామపక్షాలు తన శక్తి మేరకు కృషి చేస్తాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భాగం హేమంతరావు అన్నారు. ఖమ్మం జిల్లాలో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి విజయం ఖాయమన్నారు. కేంద్రంలో మతతత్వ బిజెపిని ఓడించడమే వామపక్షాల లక్ష్యం అన్నారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దర్గాప్రసాద్, మాజీ ఎంఎల్‌సి బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News