Wednesday, May 8, 2024

జీవితాన్ని వస్త్రగాలం పట్టిన కథలు

- Advertisement -
- Advertisement -

పుట్టినాక లోకానితో సంఘర్షణ పడతాం, పోయేటపు డు మనలో మనం సంఘర్షిస్తూ పోతాము. సంఘర్ష ణ లేకుండా పుట్టుక లేదు, చావు లేదు. బతుకు లేదు’తెలంగాణ నేల మీదే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా గత నాలుగు దశాబ్దాలుగా మనిషి జీవితం అత్యంత సంఘర్షితంగా తయారయింది. బహుజన జీవితాలు మరింత సంఘర్షణాయుతంగా మారిపోయాయి. అందుకే రచయితలు, సినిమాలు అట్టడుగు వర్గాల జీవితాలను మునుపటి కంటే ఎక్కువగా పట్టించుకొని అక్షరాలకు అందని కోణాలను బలంగా చిత్రీకరిస్తున్నారు. బహుజన వర్గాల నుంచి ఎదిగి వచ్చిన కథకులు ఈ పనిని మరింత జాగ్రత్తగా చేస్తున్నారు. సాధారణంగా కవిత్వంలో ఇమడని జీవితపు పార్శ్వాలు కథల్లో బాగా ప్రతిఫలిస్తాయి. అలాంటి బహుజన సోయితోటి, మానవీయ స్పర్శతోటి కథలు రాస్తున్న Emerging Writer శీలం భద్రయ్య.

2021లోనే ‘లొట్టపీసు పూలు’ అనే తన తొలి కథా సంపుటితో తెలుగు కథా సాహిత్యంలో ఒక సంచలనం సృష్టించిన శీలం భద్రయ్య వెలువరిస్తున్న మరో కథా సంపుటి ‘గంగెద్దు’.1956లోనే డా. పల్లా దుర్గయ్య ‘గంగిరెద్దు’ అనే పద్య కావ్యాన్ని వెలువరించారు. అందులో గంగిరెద్దుల ఆటను ఆడించి జీవనం పోసుకునే వారి జీవితం, గంగిరెద్దు విన్యాసాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు శీలం భద్రయ్య ప్రపంచితం చేస్తోన్న ఈ ‘గంగెద్దు’ కథా సంపుటి స్వరూపంలోను, స్వభావంలోనూ అందుకు భిన్నమైనది. పల్లా దుర్గయ్య ‘గంగిరెద్దు’ ముప్పాతిక మువ్వీసం సాధు స్వభావం గలది. కాని శీలం భద్రయ్య ‘గంగెద్దు’ ధిక్కార భాస్వరాన్ని మండించేది. ఆధిపత్య వర్గాల వారు ఏది చెప్పితే దానికి తలూపే రకం కాదు ఈ ‘గంగెద్దు’. తన యజమాని కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే రకం.

ఎంతటి వాన్నైనా ఎదిరించి ఊరు, ఇల్లులేని గంగెద్దుల వాళ్లకు ఒక ఆదరువు చూపే కొత్త చూపున్నది. నిచ్చెన మెట్ల సమాజంలో అడుగునున్న వాళ్ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది.ప్రజల జీవితాన్ని అత్యంత దగ్గరి నుంచి పరిశీలిస్తున్న రచయిత శీలం భద్రయ్య. అందుకే ప్రజ ల వైపు నిలబడి, ప్రజా దృక్పథంతో ప్రతి కథలో ప్రజలనే విజేతలుగా చూపెట్టాడు. ఏ కథలో కూడా ఓడిపోయిన జీవితం లేదు. అన్నీ జీవితాన్ని గెల్చుకున్న కథ లే. ‘కాగడా’ అనే కథ తప్ప మిగతా ఏ కథ కూడా మరణంతో ముగియలేదు. ఇందులోని కథలన్నీ చావడాని కి ముందు బ్రతుకును ప్రేమించమని బోధించే కథలే.పారిశ్రామికీకరణను అందిపుచ్చుకోవడం, అనుకోని సంఘటన జరిగితే జీవితం అక్కడితో ఆగిపోకూడదని తెల్పడం, తరాలు మారినా సంసారాన్ని ఈదడానికి ‘పాకీజ’ పని మినహా మరో పని దొరకని దుర్భరస్థితి, అధికార దాహం, తన ‘తావు’ను తాను కాపాడుకోవడం కోసం చివరి క్షణం వరకు పోరాడాలని సూచించడం,

ఏ పని చేసినా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందని అది మనల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ హెచ్చరిస్తుందని తెలియజేయడం, ఒక్క ‘యాక్సిడెంట్’ ఎన్ని జీవితాలను మారుస్తుందో చూపెట్టడం, కరోనా నేపథ్యంలో ‘భయం’ వాకిట నిలబడ్డ మానవాళి ధైన్యస్థితిని చిత్రించడం, మలి వయసులో ఎండుటాకులా రాలిపోకుండా మోడువారిన జీవితపు కొమ్మకు కొత్త చివుళ్ళు తొడగడం, ‘బ్యాడ్ టచ్’ ఏదో, గుడ్ టచ్ ఏదో గుర్తించే విచక్షణను, నైపుణ్యాన్ని పాఠశాలలో చదువుతున్న బాలికలకు నేర్పడం, మనిషి లోలోపల ఉండే ‘ఆశ’ చుట్టూ తిరిగి దీపం చుట్టు తిరిగే పురుగులా మాడిపోవడం, జీవిత సంఘర్షణను కాచి వడబోయడం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాంలో పల్లెలు ఎంతగా నలిగిపోయాయో చిందిన నెత్తురు సాక్షిగా రాయడం ఇలా శీలం భద్రయ్య వస్తు వైవిధ్యం అపారమైంది.
ఆధునిక కథ ప్రత్యేకత ఏమిటంటే కథలో ఏమి చెప్పామన్నదానితో పాటు ఎలా చెప్పామన్నది చాలా ముఖ్యమైనది. వాక్యానికి వాక్యానికి మధ్య (Between the lines) ఏమి చెప్పామన్నదానితో పాటు చెప్పకుండా వదిలి వేసిన దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కవిత్వంలోనే కాదు కథల్లో కూడా ధ్వని ఉంటుందని నిరూపించిన కథలు శీలం భద్రయ్య కథలు. ప్రతి కథలో వాక్య విన్యాసంతో పాటు ఆకట్టుకునే కథనం పాఠకుడిని ఆకర్షిస్తుంది. ‘అద్దం’, ‘కుర్చీ’ లాంటి కథల్లో చూపిన శిల్ప చాతుర్యం నూతన కథకులకు కొత్త తోవలు చూపిస్తుంది. తెలంగాణ కథలు శిల్పలేమితో బాధ పడుతున్నాయని వాపోయే వారికి ఈ కథలు ఒక చెంపపెట్టు.

సాధారణంగా కథలు Flashback Technic తోనో, Chronological Orderలోనో, Present Tense లోనో సాగిపోతుంటాయి. శీలం భద్రయ్య వీటన్నింటినీ దాటి Slide Technic తో కథ చెప్పడం వల్ల కథకు కొత్త శిల్ప పరిమళాన్ని అద్దినట్టుగా తోస్తుంది. వస్తు నవ్యతతో పాటు కొత్తగా చెప్పాలనే తాపత్రయం ఈ కథల్లో తొంగిచూస్తుంది.
కథ విలుకాని బాణంలాగా నేరుగా లక్ష్యా న్ని చేరడంలో ఆసక్తి ఉండదు. కొన్ని ఊహించని మలుపులు తిరిగి కొస మెరుపుతో, కొత్త వెలుతురుతో అంచనాకు అందకుండా ముగిసిపోవడంలో ఉండే ఉత్సుకత వేరు. అలా ఊహించని విధంగా మలుపులు తిరిగి పెద్ద సస్పెన్స్‌తో కొనసాగి చివరికి ఎక్కడో ముగిసిపోతాయి ఇందులోని కథలు. ఇది కథకుడు అభ్యాసం చేసి సాధించిన నైపుణ్యంలాగా కనబడుతుంది.
సాధారణ చదువరి కథా వస్తువునే గమనిస్తాడు. కాని తెలివైన పాఠకుడు కథనం, శిల్పం, భాష, వాక్చాతుర్యం, పాత్రపోషణ, సన్నివేశ కల్పన, వాతావరణ చిత్రణ ఇలా అన్నింటినీ లోతుగా పరిశీలిస్తాడు. అలాంటి తెలివైన పాఠకులకు ఈ ‘గంగెద్దు’ కథలు ఒ క విధంగా గొప్ప మేధో ఆహారం.‘పరువు’, ‘ఆశ’, ‘సంఘర్షణ’ లాంటి కథలు ఇందుకు మచ్చు తునకలు.
మనుషులుగా జీవిస్తున్నవారెవరైనా కళ్ళ ముందు జరుగుతున్న విషాద సందర్భాలకు దు:ఖించకుండా ఉండలేరు. కథకులైతే మరింత తాదాత్మ్యం చెంది లోలోపలే కుమిలిపోతారు.

ఒక విధమైన చింత న, పరివేదన ఆవరించుకున్నప్పుడు కథలు రాస్తారు. అలాంటి కథలు కళ్ల నిండా కన్నీళ్లను, మనసు నిండా భావోద్వేగాలను నింపుతాయి. కఠోరమైన కాలాన్ని తొల్చుకుని వచ్చి కథలుగా రాస్తే అవి ‘గంట’, ‘పాకీజ’, ‘కాగడా’ కథలుగా పురుడుపోసుకుంటాయి. శీలం భద్రయ్య తనలోకి తాను తొంగిచూసుకొని, సమాజంలోకి తొంగిచూసి రాసిన ఆర్ద్రమైన కథలివి.
గుండె కొట్టుకుంటున్నంత సేపు అలజడికి గురవుతూనే ఉంటాము. గాయపడుతూనే ఉంటాము. వాటికి వెంట వెంనే కథారూపం ఇవ్వడం శీలం భద్రయ్య లాంటి Mercury Writers కే సాధ్యమవుతుంది. మన చుట్టూత ఎన్నో కథా శకలాలు కొట్టుకుపోతుంటాయి. వాటిని ఒడుపుగా పట్టుకొని కథల్లో పొదగడం ఒక మంచి నేర్పు. ‘సిగ్గు’, ‘బ్యాడ్ టచ్’, ‘సంఘర్షణ’ కథలు ఇందుకు మంచి ఉదాహరణలు.

ఈ కథా సంపుటిలోకెల్లా విలక్షణమైన కథ ‘కాగడా’. దీనికి నేపథ్యం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటం జరిగి 75 ఏళ్లు అయిపోయిన సందర్భంగా నేటి తరాలకు అప్పటి సాయుధ పోరాట వారసత్వాన్ని తెలియజేయడానికి కథకుడు చేసిన మంచి ప్రయత్నం. కథ వర్ణణతో మొదలై సంభాషణతో కొనసాగి చివరికి మైబెల్లి మరణంతో ముగుస్తుంది. కథ చదివాక చాలా రోజుల పాటు మైబెల్లి పాత్ర వెంటాడుతుంది.కథకులు ఉపయోగించే భాష, సందర్భోచితంగా వాడే సామెతలు, పాత్రలు, వాటి స్వభావాలు, పాత్రల పేర్లు ఇలా కథలోని ఎన్నో అంశాలు కథకుడిని ప్రజా రచయితగా నిలబెడుతాయి. ఈ సం పుటిలోని కథలన్నీ శీలం భద్రయ్యను ఒక ప్రజా కథకుడిగా ఆవిష్కరించాయి.

ఏ కథలకైనా పాఠకులు త మ హృదయాల్లో కాసింత చోటు ఇవ్వాలంటే Huma Touch, Readability అనే రెండు సుగుణాలుండాలి. ఈ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్న కథా సంపుటి ఇది. ఆలోచింపజేయడం, జీవితపు తడిని అంతే వాస్తవికంగా కథల్లోకి తీసుకురావడం కథలకు ఉండాల్సిన మౌళిక లక్షణాలు. శీలం భద్రయ్య వీటిని సమర్థవంతంగా సాధించాడని చెప్పవచ్చు. వ్యవహారం నుండి జారిపోయిన ‘ఇబ్రీకం’, ‘నామర్దా’, ‘రోసిన’, ‘తబేదు’ లాంటి పదాలను కథకుడు ఒడుపుగా వాడడం గమనించవచ్చు. నిఘంటువుల్లో చేరని ఇలాంటి అనేక పదాలను ఈ కథల ద్వారా సేకరించవచ్చు. భాషా పరిశోధకులకు ఇదొక ఆకరగ్రంథం.
ఈ కథలు చదివిన తరువాత మనుషులు మరింత మానవీయతా గంధాన్ని పులుముకుంటారని కచ్చితంగా చెప్పవచ్చు. రచయిత మనుషుల మనస్తత్వాన్ని, స్వభావాన్ని, తెలంగాణ జీవితాన్ని పట్టుకోవడంలో పరిపూర్ణంగా విజయం సాధించాడు. ఈ 14 కథలు రెండు ఇంద్రధనస్సుల్లాంటి జీవితాలను పరిచయం చేస్తాయి.

డా॥ వెల్దండి శ్రీధర్
9866977741

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News