Saturday, April 27, 2024

లొట్టపీసు పూలు తెలంగాణ బతుకు చిత్రం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ నేలలోని ప్రతి అణువణువులోనూ ఓ స్ఫూర్తి, పోరాట పటిమ, మేధస్సు మిళితమై అసంఖ్యాక శక్తి యుక్తులు దాగి ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే సాహిత్యానిది ఒక ప్రత్యేక స్థానం. నేటి సాహిత్య ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కథలు చదువుతున్నప్పుడు పాఠకుడు తనకు తెలియకుండానే కథలోని పాత్రలో లీనమై గొప్ప అనుభూతిని పొందుతాడు. కొన్ని కథలు చదువుతున్నపుడు రచయిత మన పక్కనే కూర్చుని కథ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. పాఠకులకు చదవాలని అనురక్తి కలిగించే కథలు ఉత్తమమైనవి. అలాంటి ఆసక్తికరమైన కథల్లో ‘శీలం భద్రయ్య‘ రాసిన ‘లొట్టపీసు పూలు‘ ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గది.ఆయన వెలువరించిన కథ కథను పరిశీలించగా అందులో ఒక్కో కథను నడిపించిన తీరు వర్ణనాతీతం అనిపిస్తుంది. ఒక్కో కథ చదువుతున్నప్పుడు శీలం భద్రయ్య స్వయంగా కథ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. పాఠకులను మంత్రముగ్దులను చేసే ఛలోక్తులు కథలలో రాయడమంటే అది శీలం భద్రయ్యకే సాధ్యం అనే భావం ఏర్పడుతుంది.

ఈ కథల్లో తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను పాఠకుల హృదయాలను హత్తుకునే విధంగా వివరించారు. అట్టడుగు వర్గాలు, సామాన్యుల భాషను, కథా వస్తువులుగా ఎంచుకుని తెలంగాణ భాష ఖ్యాతిని విస్తృతం చేసే కృషి చేసారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలు, ప్రజల తిరుగుబాట్లు ఈ కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, సహజత్వాన్ని ఈ కథల్లో చిత్రించిన తీరు అభినందనీయం. కొన్ని కథలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులను రచయిత హృద్యంగా వివరించారు. ఈ పుస్తకంలోని పదిహేను కథలు అచ్చమైన తెలంగాణ భాష మాండలికంలో సామాన్య పాఠకులకు కథలపై ఆసక్తి కలిగించే విధంగా వ్రాయబడ్డాయి.
‘ఇసపురుగు‘ కథను పరిశీలిస్తే ఆనాటి అణగారిన వర్గాల జీవన విధానాన్ని విశ్లేషిస్తూ, దొంగతనం నేరం మీద జైలు కి వెళ్లిన భర్తను విడిపించడానికి అప్పు కొరకు నారాయణ పటేల్ దొర దగ్గరికి వెళ్తే దొర అనే అహంకారంతో నిమ్నజాతి మహిళపై అకృత్యానికి పాల్పడిన సందర్భంలో నర్సమ్మ పెద్దయ్య చెప్పిన సలహాను పాటించి చాకచక్యంగా తప్పించుకున్న తీరును అద్భుతంగా విశ్లేషించిన తీరును గమనించవచ్చు.

ఎందరో ఆడబిడ్డలను బలిమి చేసి, వాళ్ళ చావుకి కారణమైన దొర మరణంతో గ్రామ ప్రజలు సంతోషించిన తీరు పాఠకులకు కథల పట్ల ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది.‘కేంపు చెరువు‘ కథను పరిశీలిస్తే తెలంగాణ పల్లెల్లో పంట చేతికొచ్చిన తరువాత కోతపెట్టుకొవడమనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయంగా విశ్లేషిస్తూ, ఆడవాళ్ళు వడ్లు దంచే సమయంలో పాడుకునే పాట ఇప్పటి తరం వారికి తెలియజేయడం మరియు ఆ పాటను కథ రూపంలోకి తీసుకు రావడం శీలం భద్రయ్య పడిన తపన చెప్పకనే చెబుతుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. రజాకార్ల కాలం నాటి భయంకర సంఘటనలు కళ్లముందు చూసినట్టుగా కథను రాయడం,అంతేకాకుండా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల భూములు జలాశయం (రిజర్వాయర్) నిర్మాణానికి తక్కువకు విక్రయించేందుకు గ్రామ ప్రజల నుంచి సంతకాలు తీసుకుని ఊరు వదిలి వెళ్లాలని దొర హుకుం జారీ చేయడం, ఆ తర్వాత ఊరి జనం చేసేదేమీలేక ఊరు విడిచి వెళ్తున్న విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై ఊరి జనానికి అసలు విషయం చెప్పి ఆయుధాలతో దొర పై యుద్దానికి తెరలేపి దొర గడి పై దండయాత్ర చేసి దొరనే ఊరినుండి వెళ్లగొట్టిన తీరును ఎంతో ఓర్పుతో కథకు జీవం పోశారు శీలం భద్రయ్య.

మూసీనది చరిత్రను ఈతరం వారికి తెలియజేసే క్రమంలో తన కథలను ప్రత్యేకమైన శైలితో, చమత్కారమైన సూక్తులతో కొత్త రూపును ఇచ్చారు రచయిత.‘బంచెర్రాయి‘ కథలో రజాకార్లు కాసోళ్లగూడెం సమీపాన బంచెర్రాయి దగ్గర ఎలాంటి అకృత్యాలకు, దారుణాలకు పాల్పడ్డారో విపులంగా వివరించారు. రాజారెడ్డి బిడ్డ పెళ్లి సంబరాలలో రజాకార్లు గ్రామం మీద దాడి చేసి ఉద్యమకారులను, వారి కుటుంబ సభ్యులను, బంచెర్రాయి దగ్గర కొత్తగా ప్ళ్ళైన రాజారెడ్డి బిడ్డ లచ్చువమ్మను రాజిరెడ్డి కళ్ళ ఎదుటే రజాకారులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీసి బంచెర్రాయి వల్లకాడుగా మార్చిన తీరును పాఠకుల హృదయాలు కలుక్కుమనేలా శీలం భద్రయ్య ఎంతో చక్కగా రాశారు. అర్ధరాత్రి కాసోళ్లగూడెంపై రజాకార్లు దాడి చేస్తున్నారని రాజిరెడ్డికి సమాచారం అందించడంతో రాజిరెడ్డి కండ్లు నిప్పులు కక్కినై. దుఃఖం కట్టలు తెంచుకుని ఊరి ప్రజలకు ధైర్యంతో పాటు కాక పుట్టించి జనం తిరుగుబాటుతో రాజిరెడ్డి కన్న బిడ్డను చంపిన చోటే రజాకార్లను చంపి పాతిపెట్టిన ఘటనను అద్భుతంగా వివరించారు.

రజాకార్లపై పోరాటం చేసి, వారిని తరిమికొట్టిన కాసోళ్లగూడెం పేరుని పాఠకులకు గుర్తుండేలా చేశారు. బంచెర్రాయి కథలో భద్రయ్య రాసిన కొన్ని చమత్కారమైన మాటలు ఈ కథకు కొత్త రూపాన్నిచ్చాయి. పావురంగా సాదుకున్న బిడ్డ లచ్చువమ్మ అసువులు బాసినై. రాజిరెడ్డి నవ్వులూ బాసినై అని రాశారు. పాఠకుడు ఈ కథ చదువుతున్నంత సేపు ఆ సంఘటన తమ కళ్లముందు జరుగుతున్నట్లు భావించేలా రాయడం రచయిత పరిణతికి అద్దం పడుతుంది.‘కర్తవ్యం‘ కథలో, అప్పటి రోజుల్లో ఆదివారం రోజు పిల్లలు ఆటలాడుకునే తీరుని వివరిస్తూ, రాముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి ఎంకమ్మ ఎక్కెక్కి ఏడుస్తూ ఎట్లైనా తల్లిదండ్రులు లేని పిల్లగాడిని బతికించుకోవాలని నాయనమ్మ పడ్డ కష్టాన్ని పొందుపరిచిన విధం పాఠకుల గుండెలు బరువేక్కించక మానదు. అంతేకాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ ఖర్చులకు రాఘవయ్య సార్ చేసిన సహాయం తో బతికి, పై చదువులు చదివి, పెద్ద ఆఫీసర్ అవ్వడం, ఆ తరువాత రాముడు రాఘవయ్య సార్ ను కలవడానికి వచ్చినప్పుడు ఆ రోజే సార్ చనిపోవడం సార్ చేసిన త్యాగాలను తలుచుకుంటూ, సార్ రాసిన డైరీ తిరగేస్తుంటే రాముడికి ఆయన నడిచిన త్యాగపు గుర్తుల అడుగుజాడలు గోచరమవుతాయి.

రాఘవయ్య కర్తవ్యాన్ని రాముడే కాదు మనమందరం సెల్యూట్ చేయాల్సిందే అనే విధంగా ఈ కథలో గురుశిష్యుల అనుబందాన్ని చాలా బాగా విశ్లేషించారు.‘లొట్టపీసు పూలు‘ కథలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను తెలంగాణ ఆడపడుచులు పల్లెలలో సంబరంగా జరుపుకునే విధానాన్ని, వారి బంధాలు, అనుబంధాలను ప్రతిబింబించేలా చాలా బాగా విశ్లేషించారు. ఈ కథలో ఊరి పెద్దమనిషి ఎల్లయ్య పంతులు తడుకలు అల్లే శివుడు భార్య అడివమ్మ ఇద్దరిమధ్య పంచాయితిని పరిష్కరించి పండుగ పూట ఊరి చెరువులో శవమై తేలిండు. ఎల్లయ్య పంతులిని శివుడు చంపాడని ఊరి ప్రజలు ఎలా అనుమానించారో శీలం భద్రయ్య చాలా చమత్కారంగా వ్రాసారు ‘నరంలేని నాలుక ఎటైనా మల్తది‘ అని ఆసక్తికరమైన చమత్కారాలు ఉన్నాయి. బతుకమ్మ పేర్చడానికి పనికి రాని లొట్టపీసు పూలు ఎల్లయ్య పంతుల్ని ఎవ్వరు చంపినారో పట్టించాయి. అన్యం పుణ్యం ఎరుగని శివుడిని కాపాడినాయి. బతుకుదెరువు కోసం లొట్టపీసు చెట్లతో తడికలు అల్లుకునే శివుడు లొట్టపీసు చెట్లే గండం నుంచి గట్టెక్కిచ్చాయని దండంపెట్టుకుండు.

‘వేగుచుక్క‘ కథలో తండ్రి దేశభక్తిని చూసి కొడుకు సైనికుడు అవ్వడం. మేజర్ కిరణ్ చేసిన సాహసాలను వివరిస్తూ శత్రువులను ఓడించిన తీరుని ఎంతో విపులంగా వివరించారు. తెలంగాణ బిడ్డ తెగువ తెలివి ముందు శత్రువులు నిలవలేకపోయారని ఈ కథలో మేజర్ కిరణ్ ధీరత్వం మరియు కిరణ్ తండ్రి వెంకట్రామిరెడ్డి పటేల్ చేసిన సేవలను అక్షర బద్దం చేయగలిగారు.
ఒక కథ పాఠకుడిని మెప్పించాలంటే రచయిత ఎంచుకున్న వస్తువు, ఆ కథ ఎత్తుగడ, రచన శైలి, అసాధారణమైన ముగింపు, చమత్కారమైన పద విన్యాసం ఉంటేనే పాఠకుడు ఆ కథను చివరిదాకా చదివి ఆనందించడంతో పాటు మధురానుభూతి చెందుతాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News