Thursday, May 23, 2024

మోడీతోనే ఫైనల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ఫైనల్ అని, సెమీ ఫైనల్‌లో బిఆర్‌ఎస్‌ను ఓడించారని, ఫైనల్‌లో బిజెపిని చిత్తుగా ఓడించాలని ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సామాజిక మీడియా సమ్మేళనం సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను వారికి సిఎం వివరించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది బిజెపి విధానమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు బ్రిటీషర్లు సూరత్ చేరుకుని క్రమంగా దేశమంతా ఆక్రమించుకున్నారని, ఇప్పుడు కూడా సూరత్ వ్యాపారులు దేశాన్ని ఆక్రమిస్తున్నారని సిఎం రేవంత్ విమర్శించారు. బిజెపి అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని రేవంత్ ఎద్దేవా చేశారు. బ్రిటీష్ వాళ్ల వల్లే బిజెపి వాళ్లకు రిజర్వేషన్లు నచ్చవన్నారు. కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోందన్న ఆయన ఆరోపించారు. ఇప్పటికే రూ.60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను మోడీ అమ్మేశారని సిఎం రేవంత్‌పేర్కొన్నారు. 13 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే రెట్టింపు అప్పు మోడీ చేశారని రేనవంత్ దుయ్యబట్టారు.

కెసిఆర్, కెటిఆర్ కుట్రలను తిప్పికొట్టాలి
కడుపు కట్టుకునైనా రుణమాఫీ చేస్తానని సిఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలోనే తాను ఉంటే తమ కుట్రలు సాగవని కెసిఆర్, కెటిఆర్‌లు భావిస్తున్నారని, వారి కుట్రలను ఎంపి ఎన్నికల్లో మరోసారి తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సైనికులు మరోసారి అవిశ్రాంతంగా పోరాడాలని సిఎం రేవంత్ సూచించారు. కాళేశ్వరంలో కెసిఆర్ కుటంబం తిన్న రూ.లక్ష కోట్ల కంటే రుణమాఫీ సొమ్ము ఎక్కువేమీ కాదని, ఒక సంవత్సరం కడుపు కట్టుకొని అయినా రుణమాఫీ చేసి తీరుతామని సిఎం రేవంత్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియాదే కీ రోల్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో సోషల్ మీడియా కీ రోల్ పోషించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సెమీ ఫైనల్లో కెసిఆర్‌ను ఓడించామని, ఫైనల్లో బిజెపిని బొందపెట్టాలని సిఎం రేవంత్ సూచించారు. పార్టీలో కొత్త నాయకత్వం రావాల్సిందేనని సిఎం అన్నారు. తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆయన సూచించారు. శ్రీరాముడి పేరు మీద బిజెపి రాజకీయం చేస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. ఒకటే లెక్క, రాష్ట్రంలో14 సీట్లను పక్కాగా గెలుచుకోవాలని సిఎం రేవంత్ అన్నారు.
నాయకులకు, ప్రజలకు అనుసంధాన కర్తగా సామాజిక మీడియా
నాయకులకు, ప్రజలకు అనుసంధాన కర్తగా సామాజిక మీడియా వ్యవహారిస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై, రిజర్వేషన్లపై బిజెపి దాడులు చేస్తోందని సిఎం ఆరోపించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బిజెపిని సోషల్ మీడియా వారియర్స్ సమయస్పూర్తితో తిప్పి కొట్టాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో సామాజిక మీడియా ముందుందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత పెద్ద విషయమైనా ప్రజలకు చేర్చేదే సామాజిక మీడియా అని సిఎం అభివర్ణించారు.
మీడియాలోనూ మార్పులు వస్తున్నాయి….
ఈ సందర్భంగా క్రికెట్ ఆటలో ఏ విధంగా అయితే క్రమంగా మార్పు వచ్చిందో, ఇప్పుడు మీడియాలోనూ అలాంటి మార్పే వస్తోందన్నారు. ఇప్పుడున్న క్రికెట్ ఫార్మెట్ ముందు మాదిరి లేదని, అప్పట్లో సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్లు లాంటి పాతతరం వాళ్లు ఆడలేరన్నారు. న్యూస్ పేపర్ అంటే వార్తలను మరుసటి రోజు చదువుకునేదని, ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వచ్చినా ఉదయం నుంచి రెండు మూడు సార్లు మాత్రమే వార్తలు ప్రసారం అయ్యేవని సిఎం రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గంటకు వార్తలు ప్రసారం చేస్తున్నాయని, ఇలా రోజురోజుకూ మార్పులు వచ్చాయని ఆయన వివరించారు.
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం సామాజిక మీడియా ప్రతి సెకన్‌కు వార్తలను బయటకు తీసుకొస్తున్నాయని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా అంటూ మూడు మీడియాలు ఉన్నాయని సిఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సమాచారం అందరికీ చేరవేసేట్లు వ్యవహారించే విధానమే సామాజిక మీడియా అని సిఎం చెప్పారు. నాయకులు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఆ విషయాలను ప్రజలకు చేరవేయడమే ముఖ్యమని సిఎం రేవంత్ సూచించారు. నాయకులకు, ప్రజలకు అనుసంధాన కర్తగా సామాజిక మీడియా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి కితాబిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News