Sunday, May 19, 2024

రెండో దశలో 61% ఓటింగ్

- Advertisement -
- Advertisement -

రెండవ దశ లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్‌సభ స్థానాలలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించడం, బోగస్ ఓటింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు అందాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర, రాజస్థాన్‌లోని బన్సారా, మహారాష్ట్రలోని పర్భనిలో కొన్ని చోట్ల ప్రజలు వివిధ సమస్యలపై పోలింగ్‌ను బహిస్కరించగా ఓటు హక్కు వినియోగించు కోవాలంటూ అధికారులు వారిని ప్రాదేయపడ్డారు. ఏడు దశల ఎన్నికలకు చెందిన రెండవ దశ పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అనేక రాష్ట్రాలలో వడగాడ్పులు వీస్తుండడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త్రిపురలో అత్యధికంగా 77.53 శాతం పోలింగ్ నమోదు కాగా ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యల్పంగా 52.74 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

కేరళలోని మొత్తం 20 లోక్‌సభ సీల్లు, కర్నాటకలోని మొత్తం 28 సీట్లలో 14 స్థానాలు, రాజస్థాన్‌లోని 13, మహారాష్ట్రలోని 8, ఉత్తర్ ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, అస్సాం, బీహార్‌లో ఐదేసి స్థానాలు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లోని మూడేసి స్థానాలు, మణిపూర్‌లో, త్రిపుర, జమ్మూ కశ్మీరులోని ఒక్కో స్థానం చొప్పున పోలింగ్ జరిగింది. రెండవ దశ ఎన్నికలలో అభ్యర్థులుగా తలపడుతున్న ప్రముఖులలో కాగ్రెస్ నాయకుడు శశి థరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు అరుణ్ గోవిల్, కర్నాటక డిప్యుటీ ముఖ్యమంత్రి డికె శివకుమార్ సోదరుడు డికె సురేష్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి(జెడిఎస్) ఉన్నారు. బిజెపికి చెందిన హేమ మాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ ఆయా నియోజకవర్గాలలో హ్యాట్రిక్ విజయాన్ని ఆశిస్తున్నారు. కేరళలో 63.97 శాతం ఓటింగ్ నమోదైంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన పోలింగ్‌లో కొన్ని చోట్ల బోగస్ ఓటింగ్, ఇవిఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయ.

పాలక్కాడ్, అళప్పుళ, మలప్పురంలో ఓటు వేసిన అనంతరం ముగ్గురు వ్యక్తులు మరణించగా కోజిక్కోడ్‌లో పోలింగ్ బూత్‌లోనే ఒక ఏజెంట్ కుప్పకూలిపోయి మరణించాడు. త్రిపుర తూర్పు నియోజకవర్గంలో 77.53 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఫిర్యాదు రాగా వెంటనే వాటిని పరిష్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ నియోజకవర్గ పరిధిలోని గరియాబండ్ వద్ద ఒక ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ విధి నిర్వహణలో ఉన్న మధ్యప్రదేశ్ స్పెషల్ ఆర్డ్ ఫోర్స్‌కు చెందిన జవాను ఒకరు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నియోజవకర్గంలో 72.13 శాతం ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లా(కంకేర్ స్థానంవి షివ్నీ గ్రామంలో పెళ్లి మండపం తీరులో పోలింగ్ కేంద్రాన్ని అలంకరించారు. సాంప్రదాయ పెళ్లి దుస్తులు ధరించి పలువురు వధూవరులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా..పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లో 54.83 శాతం ఓటింగ్ జరిగింది.

అస్సాంలోని ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలలో 70.66 శాతం ఓటింగ్ జరిగింది. సంక్షుభిత మణిపూర్‌లో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన పోలింగ్ 76.06 శాతంగా నమోదైంది. కర్నాటకలో దాదాపు 64 శాతం ఓటింగ్ జరిగినట్లు సమాచారం. ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు బెంగళూరులోని అనేక హోటళ్లు రాయితీ ధరలకు దోస, లడ్డు, కాఫీ తదితర ఆహార పదార్థాలను ఉచితంగాను రాయితీ ధరలకు అందచేశాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలిక సహాయంతో 41 మంది ఇన్‌పేషెంట్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఏర్పాట్లు చేసింది. ఈ పేషెంట్ల కోసం అంబులెన్సులకు దారి కల్పించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. కర్నాటకలోని చామరాజనగర జిల్లాలోని ఇండిగనత గ్రామంలో ఓటు వేయాలా వద్ద అన్న విషయమై రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి ఒక పోలింగ్ కేంద్రంలోని ఇవిఎంలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని, నివేదిక అందిన తర్వాత దీనిపై ఇసి చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలోని 8 లోక్‌సభ నియోజకవర్గాలలో సాయంత్రం 3 గంటల వరకు 53.51 శాతం ఓటింగ్ నమోదైంది. రాజస్థాన్‌లో 59.19 శాతం ఓటింగ్ నమోదైంది. బార్మర్ జైసల్మేర్ స్థానంలోని కొన్ని ప్రదేశాలలో పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుదారుల మధ్య ఘర్షణ చెలరేగింది. కొన్ని చోట జరిగిన ఫేక్ ఓటింగ్‌పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని 8 పార్లమెంటరీ నియోజకవర్గాలలో సాయంత్రం 3 గంటల వరకు 52.74 శాతం పోలింగ్ జరిగింది. గౌతమ్ బుద్ధ నగర్ నియోజకవర్గంలోని నాయిడాలో ఓటింగ ప్రారంభించిన వెంటనే పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు అక్కడకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కాలనీ సంఘాలు ఎలెక్ట్రిక్ వాహనాల ద్వార ఓటర్లను పోలింంగ్ కేంద్రాలకు ఉచితంగా తరలించాయి. బీహార్‌లో 53.03 శాతం పోలింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్‌లో 71.84 శాతం, జమ్మూ కశ్మీరులో 67.90 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఆగస్టు 5న 370వ అధికరణను రద్దు, చేసి రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ఎన్నికలు జరిగాయి.

పశ్చిమ బెంగాల్‌లో ప్రధానంగా ఇవిఎంల మొరాయింపునకు సంబంధించి దాదాపు 300 పిర్యాదులను ఎనినకల కమిషన్ నమోదు చేసింది. రెండవ దశ పోలింగ్‌తో కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ పోలింగ్‌తో తమిళనాడు(39), ఉత్తరాఖండ్(5), అరుణాచల్ ప్రదేశ్(2), మేఘాలయ(2), అండమాన్ నికోబార్ దీవులు(1), మిజోరం(1), నాగాల్యాండ్(1), పుదుద్చేరి(1), సిక్కిం(1), లక్షద్వీప్(1)లో ఎన్నికలు పూర్తయిపోయాయి. మే 7న మూడవ దశ ఎన్నికలు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 94 స్థానాలకు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News