Tuesday, May 7, 2024

అది రాజీనామా లేఖా.. సీస పద్యమా?

- Advertisement -
- Advertisement -

హరీష్ రావు తెలివి మోకాళ్లలో కాదు, అరికాళ్లలోకి జారినట్టుందని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్‌రావు చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామ లేఖ అంటున్నారని, కానీ, స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని, హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తుందని, వారి మోసానికి ముసుగు అమరవీరుల స్థూపమన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చెబుతున్నా, నీ సవాల్‌ను కచ్చితంగా స్వీకరిస్తున్నా హరీష్‌రావు, పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని, నీ రాజీనామా రెడీగా పెట్టుకోమని హరీష్ రావుకు రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. హరీష్‌రావు రాజీనామాతో ఆగస్టు 15వ తేదీన సిద్దిపేటకు పట్టిన శని వదులుతుందని అన్నారు. రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.3,0-40 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సామాజిక మీడియా సమ్మేళనం సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి
మాజీ మంత్రి హరీష్ రావుపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ . సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరానని హరీష్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ను విమర్శించడం బిఆర్‌ఎస్ నేతలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల పేరుతో కెసిఆర్ మోసగించారన్నారు. ఉపాధి హామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కల్పించలేదన్నారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీష్ రావు భయపడుతన్నారన్నారు. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులకున్నానని కోమటిరెడ్డి గుర్తు చేశారు. మెదక్‌లో బిఆర్‌ఎస్ కనీసం డిపాజిట్ దక్కించుకోవాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ఫాంహౌజ్‌లో నుంచి బయటకు రాలేదని మంత్రి కోమటిరెడ్డిగుర్తు చేశారు. ఇప్పుడు కర్రపట్టుకుని కెసిఆర్ బయటకు వస్తున్నారన్నారు. సచివాలయానికి రేవంత్ రెడ్డి వచ్చిన దాంట్లో పది శాతం కూడా కెసిఆర్ రాలేదన్నారు.

కెసిఆర్ పాలనలో హోంమంత్రికి కూడా అపాయింట్‌మెంట్ లేదు
మూడు నెలల్లో రేవంత్ రెడ్డి 60 సార్లు సచివాలయానికి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అపాయింట్‌మెంట్లు లేకుండానే సిఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారని, కెసిఆర్ పాలనలో హోంమంత్రికి కూడా అపాయింట్‌మెంట్ లేదన్నారు. పార్టీ మూతపడే స్థితికి వచ్చినందున ఎక్కడికి వెళ్లాలో వారికి అర్థం కావడం లేదన్నారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు నాటకాలాడుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. రాజీనామా పత్రం ఒకటిన్నర లైన్ మాత్రమే ఉండాలని, హరీష్ రావు రాజీనామా పత్రాన్ని ఒకటిన్నర పేజీ రాశారని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తొలి సిఎం దళితుడని నాడు కెసిఆర్ చెప్పారని.. దళితుడిని సిఎం చేయకపోతే మెడపై తల ఉండదని గొప్పలు చెప్పారన్నారు. పరిపాలన అనుభవం ఉండాలని తొలిసారి కెసిఆర్ సిఎంగా ఉండాలన్నారని, రెండోసారి బిఆర్‌ఎస్ వచ్చినా దళితుడిని సిఎం చేయలేదన్నారు. ఇప్పటికి 40 కోట్ల మంది మహిళలు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం చేశారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.. మార్చి 1న జీరో విద్యుత్ బిల్లు వచ్చిందో లేదో తెలుసుకోవాలన్నారు. అధికారం పోగానే కెసిఆర్ పిచ్చినపట్టినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు.

అమరవీరుల స్థూపాన్ని హరీష్‌రావు మలినం చేశారు: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి మలినం చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. హరీష్ రావు అమరుల స్తూపాన్ని అపవిత్రం చేశారని ఆయన ఆరోపించారు. ఆగస్టు 15 లోగా రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని ఆయన అన్నారు. రుణమాఫీ అమలు చేస్తే బిఆర్‌ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని సవాల్ విసిరితే హరీష్ రావు తన రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీశారని బల్మూరి మండిపడ్డారు. రూ. 2లక్షల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆగస్టు 15వ తేదీ లోపు ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తామని ఆయన చెప్పారు. తాను బాధ్యత తీసుకొని హరీష్ రావు రాజీనామాను ఆమోదించేలా చూస్తానని బల్మూరి వెంకట్ తెలిపారు.

నక్కవేషాలు మానుకోండి: అద్దంకి దయాకర్
రైతులకు రైతుబంధు రాకుండా చేసిందే హారీష్ రావు అని, నువ్వు నీ పొలిటికల్ డ్రామాలు ఆపాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. హరీష్ రావు రాజీనామా లేఖను తీసుకొని అమరవీరుల స్థూపం వద్దకు రావడంపై ఆయన మండిపడ్డారు. హరీష్ రావుని తన మామ పట్టించుకోవడం లేదా? ఆయన బామ్మర్ధి పక్కన పెట్టారా? లేకపోతే ఆయన రాజకీయ అస్థిత్వమే ప్రమాదంలో పడిందా? తెలియడం లేదని, రైతులకు రైతుబంధు రాకుండా నిలవరించిన నువ్వు పొలిటికల్ డ్రామాలు ఆపాలని అద్దంకి హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచి, ఖజానా ఖాళీ చేసి నంగనాచి మాటలు మాట్లాడుతున్న హరీష్ రావుకు ప్రజలే బుద్ది చెబుతారని ఆయన మండిపడ్డారు. రైతులను జైళ్లలో పెట్టిన మీరా రైతుల గురించి మాట్లాడేది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతు రుణమాఫీ చేసింది, రైతులకు పంటనష్టం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఆగస్టు 15 లోపు రుణ మాఫీ కూడా చేస్తామని, మీ నక్కవేషాలు ఇకనైనా మానుకోవాలని అద్దంకి దయాకర్ హెచ్చరించారు.

ఎమ్మెల్యే కాకున్నా.. నిన్ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది{ కాంగ్రెస్ నేత బండి సుధాకర్ గౌడ్
నువ్వు ఎమ్మెల్యే కాకున్నా నిన్ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్న విషయం హరీష్ రావు గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ హితవు పలికారు. గతాన్ని అప్పుడే మరిచిపోయావా హరీశ్? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ యువతను రెచ్చగొట్టేందుకు మీద పెట్రోల్ పోసుకొని, అగ్గిపెట్టె మరిచిపోయిన చరిత్ర హరీశ్ రావుదని ఆయన దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ నాయకులు రెచ్చగొట్టడంతోనే 1200 మంది అమరులయ్యారని, అందులో కేవలం 400 మందిని మాత్రమే ఆదుకొని, మిగతా 800 మందిని విస్మరించిన చరిత్ర బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని బండి సుధాకర్ విమర్శించారు. అమరుల త్యాగాల పునాదుల మీద రాజ్యమేలి రాక్షసానందం పొందిన మీకు అమరవీరుల స్థూపం వద్ద రాజీనామా డ్రామాలాడే నైతిక హక్కు లేదని బండి హెచ్చరించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ 17 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పాటు చేస్తే, బంధుప్రీతితో కొత్త రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్పగా చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా? అని బండి సుధాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ఓర్వలేని బిఆర్‌ఎస్ నాయకులు రుణమాఫీ విషయంలో బద్నాం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ గెలవకపోతే మీ పార్టీని రద్దు చేసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News