Tuesday, April 30, 2024

అదే జరిగితే మాపై యుద్ధం ప్రకటించినట్లే

- Advertisement -
- Advertisement -

మరోసారి అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరికలు

ప్యాంగ్యాంగ్ ( ఉత్తర కొరియా): ఉత్తర కొరియా మరోసారి అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. దానిని తమపై యుద్ధంగా భావిస్తామని పేర్కొంది. అమెరికాదక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాలను ప్యాంగ్యాంగ్ తప్పుబట్టింది. ఈమేరకు ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ సోదరి, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసినట్టు కెసిఎన్‌ఎ వార్తా సంస్థ వెల్లడించింది.

ప్యాంగ్యాంగ్ వ్యూహాత్మక పరీక్షలకు వ్యతిరేకంగా అమెరికా సైన్యం చేపట్టే చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తామని పేర్కొంది. తాము అవసరమైతే పసిఫిక్ మహా సముద్రం లోకి మరిన్ని క్షిపణులను ప్రయోగించగలమని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు. మరో వైపు ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మీడియా విభాగం కూడా అమెరికాపై ఆరోపణలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. బి52 బాంబర్లతో అమెరికా నిర్వహించే యుద్ధ విన్యాసాలు పరిస్థితిని మరింత ఎగదోస్తున్నాయని పేర్కొంది. అమెరికా దక్షిణ కొరియా దేశాలు క్షేత్రస్థాయిలో కూడా యుద్ధ విన్యాసాలకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. పసిఫిక్ సముద్రం జపాన్ లేదా అమెరికా సొత్తు కాదని ఉత్తర కొరియా పేర్కొంది.

వాస్తవానికి ఇప్పటివరకు అమెరికా మిత్ర దేశాలు ఏనాడూ ఉత్తర కొరియా క్షిపణిని కూల్చివేయలేదు. కాకపోతే ఇటీవల కాలంలో జపాన్ సముద్రం పైకి తరచూ ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించడం ఆందోళనకరంగా మారింది. దీంతో ఈ వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు ఉత్తర కొరియా తన హెచ్చరికలను నిజం చేస్తూ పసిఫిక్ మహా సముద్రాన్ని ఫైరింగ్ రేంజిగా మార్చే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా బి52 బాంబర్లు దక్షిణ కొరియా విమానాలతో కలిసి పలుమార్లు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. దీంతోపాటు వచ్చేవారం నుంచి ఫ్రీడమ్ షీల్డ్ పేరిట 10 రోజులు యుద్ధ విన్యాసాలు నిర్వహించేందుకు ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News