ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కొత్త నిర్మించిన హజ్ హౌస్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రారంభించాలని ఎఐఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు ఇంతియాజ్ జలీల్ డిమాండ్ చేశారు. బుధవారం ఔరంగాబాద్ డివిజనల్ కమిషనర్ సునీల్ కెంద్రేకర్‌ను కలుసుకున్న ఇంతియాజ్ జలిల్ ఈ మేరకు డిమాండ్ చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఔరంగాబాద్‌లో కొత్తగా నిర్మించిన హజ్ హౌస్‌ను ముఖ్యమంత్రి షిండే ప్రారంభించాలని అన్నారు. హజ్ హౌస్ సమీపంలోని అంఖాస్ మైదానంలో స్టేడియం నిర్మించాలన్నది తమ ప్రతిపాదనని, హజ్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి షిండే తమ ప్రతిపాదనకు ఆమోదం తెలియచేయాలని తాము కోరుకుంటున్నామని జలీల్ తెలిపారు.
హజ్ హౌస్ ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిపించేలా కోరాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి అబ్దుల్ సత్తార్‌ను కూడా కలసి కోరినట్లు ఆయన తెలిపారు. ఔరంగాబాద్‌లోని జాల్నా రోడ్డులో ఒక 400 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయడం గురించి డివిజనల్ కమిషనర్‌ను కూడా కోరినట్లు ఆయన తెలిపారు.