Friday, November 1, 2024

త్వరలో కాసాని బస్సు యాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టి టిడిపి తెలంగాణలో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపి తమ పార్టీ ఇంకా తెలంగాణలో ఉందని ప్రజలకు తెలియచేయడానికి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఆయన బస్సుయాత్రపై దృష్టి పెట్టారు. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు నియోజక వర్గాలు, 119 అసెంబ్లీ స్థానాలు చుట్టి వచ్చేలా, సుమారు 5 వేల కిలోమీటర్లు టి టిడిపి బస్సు యాత్ర చేపట్టాలని ఆయన నిర్ణయించారు.

బస్సుయాత్రలో భాగంగా ఆయన టి టిడిపి అభ్యర్థులను కూడా ప్రకటించి వారిలో మనోధైర్యాన్ని నింపాలని వ్యూహాలను పన్నుతున్నారు. తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం తీసుకురావడానికి కాసాని ప్రయత్నం చేస్తున్నారని కార్యకర్తలు, నాయకులు పేర్కొంటున్నారు. 2018 ఎన్నికల్లో టిడిపి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రెండు సీట్లు సాధించింది. అయితే ఆ తరువాత గెలిచిన ఇద్దరూ అధికార పార్టీ బిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. శాసన సభ్యులు లేక పోవడంతో తెలంగాణలో టిడిపి బలహీనపడింది. ప్రస్తుత అధ్యక్షుడు కాసాని మాత్రం అన్ని జిల్లాల, నియోజకవర్గాల ఇన్‌చార్జీలను నియమించడంపై దృష్టి సారించారు. ముందుగా టిడిపి పార్లమెంటరీ అధ్యక్షులను ఆయా నియోజక వర్గాల వారీగా నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బస్సు యాత్రలో భాగంగా టిడిపి అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News