Friday, November 1, 2024

ముందుంది అసలు సినిమా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో/ముషీరాబాద్ : ఇప్పటివరకు ప్రతిపక్షాలు కేవలం ట్రైలర్ మాత్రమే చూశాయని అసలు సి నిమా త్వరలో చూపించబోతున్నమని పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. హైదరాబాద్ దశా దిశను మార్చిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ను సొంతం చేసుకోబోతుందని కెటిఆర్ ధీ మా వ్యక్తం చేశారు. రూ.450 కోట్ల వ్యయంతో ఇందిరాపార్క్ నుంచి విఎస్‌టి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి (ఎలివేటెడ్ కారిడార్‌ను) తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి ఫ్ల్లైఓవర్‌ను శనివారం మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు సెంట్రల్ హైదరాబాద్ నగరాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో నూతన సచివాలయం, అమరవీరుల స్తూపం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జి వంటి అనేక కార్యక్రమాలతో సెంట్రల్ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాక ముందు పద్మవ్యూహాం లాంటి ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకున్న హైదరాబాద్ మహానగరంలో సిగ్నల్ రహిత ప్రయాణమే లక్షంగా ఎస్‌ఆర్‌డిపిని ఏర్పాటు చేసి తద్వారా మొదటి దశ కింద 48 ప్రాజెక్టులను చేపట్టామని ఇందులో ఇప్పటికే 36 పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అందులో భాగమే ఇందిరాపార్క్, విఎస్‌టి స్టీల్ బ్రిడ్జి 20ఫ్లై ఓవర్ రూపంలో ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. 2001 నుంచి నాయిని నరసింహరెడ్డి కెసిఆర్‌తో కలిసే ఉన్నారని, రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి హోంశాఖ మంత్రిగా పనిచేశారన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంతో వీడదీయలేని బంధం ఉన్న మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి అనుబంధానికి గుర్తుగా ఆయన ఇక్కడి ప్రజలకు కార్మికులకు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరును పెట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వారికి కాలం చెల్లింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అనుగుణంగా తమ ప్రభుత్వం గడిచిన 9 ఏళ్ల కాలంలో గట్టి పునాదిని వేసిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తూ అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలను కెసిఆర్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. గతంలో మాదిరి మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే దుస్థితి ఈరోజు లేదని. 10 ఏళ్ల కెసిఆర్ ప్రభుత్వం హయాంలో మత కల్లోలాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నందని తెలిపారు. ఇప్పుడు కులాలు, మతాలకు చిచ్చుపెట్టే వారికి కాలం చెల్లిందని, ఇలాంటి సందర్భంలో మతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గుల చిల్లర పార్టీల వారి మోసాలకు గురైతే మరో వందేళ్లు ఈ నగరం వెనక్కి పోతుందన్నారు.

60 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయని పార్టీల మోసపు మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కెటిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోనుందన్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ దాకా దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. గతంలో తాము కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సినిమాలు చూసేందుకు వచ్చినప్పడల్లా ట్రాఫిక్‌లో చిక్కుకునే వాళ్లమంటూ మంత్రి గత స్మతులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ వాణి సురభి దేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్ మాగంటి గోపినాధ్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎం.ఎస్. శ్రీనివాసరావు, వి.శ్రీనివాస్‌రెడ్డి, యువజన విభాగం నాయకులు ముఠా జైసింహ, మ్చుకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News