Friday, November 1, 2024

అమెరికాలో భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: తొమ్మిదేళ్ల క్రితం భార్యను హత్య చేసి పరారైన భారతీయుడు భద్రేశ్ కుమార్ చేతన్ భాయ్ పటేల్‌ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. తాజాగా అతడి తలపై భారీ రివార్డు ప్రకటించింది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2,50,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లు పైమాటే) ఇస్తామని వెల్లడించింది. 2015 ఏప్రిల్ 12న మేరీల్యాండ్ లోని హానోవర్‌లో ఈ హత్య జరిగింది. భద్రేశ్ పటేల్, అతడి భార్య పాలక్ స్థానికంగా ఉండే ఓ డోనట్ దుకాణంలో పని చేసేవారు. హత్య జరిగిన రోజున వీరిద్దరూ నైట్ షిఫ్ట్‌లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఆ దుకాణం లోని కిచెన్ లో పనిచేస్తున్న పాలక్ దగ్గరకు అతడు వెళ్లి పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ అధికారులు నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. హత్య తరువాత తన అపార్ట్‌మెంట్‌కు వచ్చిన భద్రేశ్ కొన్ని వస్తువులను తీసుకుని న్యూజెర్సీ ఎయిర్ పోర్టుకు వెళ్లినట్టు సీసీటీవీ దృశ్యాల్లో కన్పించింది. ఆ తర్వాత అతడి జాడ లేదు. ఎఫ్‌బీఐ 2017లో అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. తాజాగా రివార్డు ప్రకటించింది. వీసా గడువు తీరడంతో పాలక్ భారత్ తిరిగి వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇది నచ్చని ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. నిందితుడు భద్రేశ్ కెనడా పారిపోయి ఉంటాడని లేదా భారత్‌కు తిరిగి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News