Monday, May 5, 2025

కదంతొక్కిన బట్లర్… గుజరాత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో గుజరాత్ టైటాన్స్ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్‌కు ఈ సీజన్‌లో ఇది ఐదో విజయం కావడం గమనార్హం. ఈ గెలుపుతో టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన గుజరాత్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ శుమ్‌మన్ గిల్ (7) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

బట్లర్ జోరు..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను వికెట్ కీపర్ జోస్ బట్లర్ తనపై వేసుకున్నాడు. అతనికి మరో ఓపెనర్ సాయి సుదర్శన్ అండగా నిలిచాడు. ఇద్దరు ప్రత్యర్థి టీమ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ధాటిగా ఆడిన సాయి సుదర్శన్ 21 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 36 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సాయి ఔటైనా బట్లర్ జోరును కొనసాగించాడు. షెర్ఫానె రూథర్‌ఫోర్ట్ అండతో బట్లర్ జట్టును లక్షం దిశగా నడిపించాడు. బట్లర్ దూకుడును ప్రదర్శించనగా రూథర్‌ఫోర్ట్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు.

ఈ జోడీని విడగొట్టేందుకు ఢిల్లీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రూథర్‌ఫోర్ట్ 34 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 43 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్‌తో కలిసి మూడో వికెట్‌కు 119 పరుగులు జోడించాడు. మరోవైపు బట్లర్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. చెలరేగి ఆడిన బట్లర్ 54 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ తెవాటియా 3 బంతుల్లోనే ఒక ఫోర్, మరో సిక్స్‌తో అజేయంగా 11 పరుగులు చేయడంతో బట్లర్‌కు సెంచరీ చేసే ఛాన్స్ లేకుండా పోయింది. అతను శతకానికి మూడు పరుగుల దూరంలో నిలిచి పోయాడు.

ప్రసిద్ధ్ మ్యాజిక్..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 203 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 9 బంతుల్లోనే3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెఎల్ రా హుల్ 14 బంతుల్లో 28 పరుగులు చేశాడు. కెప్టె న్ అక్షర్ పటేల్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ధాటిగా ఆడిన అశుతోష్ శర్మ 19 బంతుల్లోనే 3 సిక్సర్లు, రెండు ఫోర్లతో 31 పరుగులు సాధించాడు. స్టబ్స్ 31 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. 41 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News