వెల్లువెత్తిన ప్రశంసలు
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ పుణ్యమా అని ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, రియాన్‌పరాగ్, అభిషేక్ శర్మ, జితేశ్ శర్మ, రింకూ సింగ్, ప్రియాంశ్ శర్మ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, శశాంక్ సింగ్ వంటి చిచ్చర పిడుగులు ఐపిఎల్‌లో రాణించడం ద్వారానే వెలుగులోకి వచ్చారు. దేశవాళీ క్రికెట్‌లో పెద్దగా రాణించక పోయినా వీరిలో చాలా మందికి టీమిండియాలో చోటు దక్కిందంటే దానికి ఐపిఎల్‌లో వీరు కనబరిచిన ప్రతిభే కారణమని చెప్పాలి. కిందటి సీజన్‌లో అభిషేక్ శర్మ, శశాంక్ సింగ్, రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, దేవ్‌దుత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్ తదితరులు విధ్వంసక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ రూపంలో మరో చిచ్చర పిడుగు అందుబాటులోకి వచ్చాడు.
బిహార్‌కు చెందిన 14 ఏళ్ల వైభవ్‌ను ఈసారి జరిగిన ఐపిఎల్ మెగా వేలం పాటలో రాజస్థాన్ రాయల్స్ రూ.1.18 కోట్లకు సొంతం చేసుకుంది. అండర్19 వరల్డ్ కప్‌లో సూర్యవంశీ అసాధారణ ఆటను కనబరచడంతో ఐపిఎల్ వేలం పాటలో అతన్ని సొంతం చేసుకునేందుకు ఆయా జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. 14 ఏళ్ల వయసులో వైభవ్ ఐపిఎల్‌లో ఆడుగు పెట్టాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలచి ఔరా అనిపించాడు. ఇక తన కెరీర్‌లో ఆడిన మూడో ఐపిఎల్ మ్యాచ్‌లోనే ఏకంగా సెంచరీ బాది పెను ప్రకంపనలు సృష్టించాడు. గుజరాత్ వంటి బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన టీమ్‌పై 35 బంతుల్లోనే శతకం నమోదు చేసి నయా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఐపిఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. క్రిస్ గేల్ తర్వాత ఐపిఎల్‌లో అతి తక్కువ బంతుల్లో శతకం నమోదు చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డును నమోదు చేశాడు. క్రిస్ గేల్ 30 బంతుల్లో శతకం సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
సూర్యవంశీ అతి చిన్న వయసులో సెంచరీ కొట్టి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతని బ్యాటింగ్ విన్యాసాలకు ప్రపంచం మొత్తం ఫిదా అయిందంటే అతిశయోక్తి లేదు. వైభవ్ బ్యాటింగ్‌ను చూసిన అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అతన్ని భవిష్యత్తు సచిన్ టెండూల్కర్‌గా అభివర్ణిస్తున్నారు. విండీస్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బిషప్ కూడా అతన్ని సచిన్‌తో పోల్చాడు. రానున్న రోజుల్లో వైభవ్ టీమిండియా కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఎదగడం ఖాయమని పలువురు మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు. ఇక చారిత్రక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న వైభవ్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్, సెహ్వాగ్, అజారుద్దీన్, యువరాజ్, రైనా, రవిశాస్త్రి, గవాస్కర్, హర్భజన్, గంగూలీ తదితరులు వైభవ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. రానున్న రోజుల్లో వైభవ్ టీమిండియా స్టార్ ఆటగాడిగా ఎదగడం తథ్యమని పేర్కొన్నారు.