పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్, పిఒకెలోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత విరుచుకుపడింది. 100 కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై మెరుపుదాడులు చేయడంపై పహల్గాం బాధితులే కాదు, యావత్ భారత దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. దాయాది శత్రువును ఏమార్చి, అత్యంత పకడ్బందీగా దాడులు చేయడంలో ప్రధాని మోడీ వ్యూహం కీలకంగా పనిచేసింది. మోడీ వ్యూహాన్ని ఎవరూ ముఖ్యంగా పాకిస్థాన్ అంచనా వేయలేకపోయింది. దాడులు ప్రారంభమయ్యే క్షణం వరకూ మోడీ ఎక్కడా తన హావభావాలు వ్యక్తం చేయలేదు. ఎంతో ప్రశాంతతతో గంభీరంగానే వ్యవహరించారు.
అంతవరకు అన్ని కార్యక్రమాలు యధావిధిగా నిర్వహించారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయించి పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేయించారు. బాలాకోట్ దాడులకు ముందుకూడా మోడీ ఈ విధంగానే ప్రశాంతంగా వ్యవహరించారు. పాక్ దృష్టి మరల్చి పెద్ద పులిలా పంజా విసిరి దెబ్బకొట్టడంలో ప్రధాని మోడీ మరోసారి పైచేయి సాధించారు. ఏమరపాటుగా పాకిస్థాన్ ఉన్నవేళ అదను చూసి పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోడీ ఎప్పటిలాగానే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు.
ఈసారి కూడా మంగళవారం రాత్రి ఎబిపి నెట్‌వర్క్ నిర్వహించిన ‘ఇండియా ఎట్ 2047’ సదస్సులో మోడీ మాట్లాడుతూ సింధు జలాలు మన దేశానివే అని, ఇకనుంచి వాటిని దేశం దాటనివ్వబోమని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని స్పష్టం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో, ప్రధాని మోడీ ముఖంలో ఎక్కడా ఆపరేషన్ సిందూర్ ఛాయలు కనిపించకపోవడం విశేషం. దేశవ్యాప్తంగా బుధవారం నాడు మాక్ డ్రిల్స్‌కు పిలుపు ఇవ్వడం యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారనే సంకేతాలు వచ్చాయి తప్ప మెరుపుదాడుల ఆలోచనలు దాయాది పాకిస్థాన్ ఊహకు రాలేదు. ఈ నిశ్శబ్ద నిశీధి సమయ వ్యూహాన్ని నెరవేర్చడంలో మోడీ చాతుర్యత ప్రశంసలను పొందుతోంది. భారత్ గతంలో జరిపిన మెరుపుదాడుల కంటే ఇప్పుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పూర్తిగా భిన్నమైంది. 2016లో ఉరి సంఘటన తరువాత నిర్వహించిన మెరుపుదాడులు, 2019లో బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ సహా గతంలో ఎన్నడూ ఇటువంటి దాడులు చేపట్టలేదు.
సాంకేతికపరంగా ఈ ఆపరేషన్ అత్యంత బలమైనది. ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అంతేకాదు ఉగ్రవాదం విషయంలో గతంలో అనుసరించిన వైఖరి పూర్తిగా మారిపోయిందనే బలమైన సంకేతం పాక్‌కు వెళ్లింది. ఉగ్రవాద మూలాలను పెకలించడంలో భారత్ ఎలాంటి వ్యూహమైనా రూపొందించి లక్షాన్సి సాధించగలదన్న వాస్తవాన్ని పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల నెట్‌వర్కకు హెచ్చరించినట్టయింది. ఆపరేషన్ సిందూర్‌పై పహల్గాం బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మన కుమార్తె సిందూరమే ఆపరేషన్ సిందూర్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ ప్లాన్ అమలు చేసిన మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. పది రోజుల్లోనే భారత్ ఈ విధంగా ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తుందని, పహల్గాం దాడిలో అమరులైన వారికి ఈ విధంగా ఆత్మశాంతి అందజేస్తుందని ఊహించలేకపోయామని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశమంతా ఆపరేషన్ సిందూర్‌కు జేజేలు పలుకుతూ పార్టీలకు, మతాలకు అతీతంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
దాడికి బలైన సంతోష్ జగ్‌దలే భార్య ప్రగతి జగ్‌దలే ఈ ఆపరేషన్ పేరు వినగానే తన కళ్లల్లో నీళ్లుతిరిగాయి. మన కుమార్తెల సిందూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం అని స్పందించారు. సంతోష్ జగ్‌దలే కుమార్తె అశ్విరి స్పందిస్తూ ఉగ్రవాదుల వల్ల సోదరీమణులు తమ సిందూరం కోల్పోయారని, దానికి గుర్తుగా ఈ దాడులకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడం హృదయాన్ని కదిలించిందని భావోద్వేగానికి గురయ్యారు. ఇంత బాధలోనూ ఈ ఆపరేషన్ వల్ల ఆనందపడుతున్నామన్నారు. ప్రతీకారం తీర్చుకోడానికి తెగువ చూపించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ ఈ ఆపరేషన్ సిందూర్ దేశానికి గర్వకారణంగా అభివర్ణించారు.
పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులు గురించి ఇతర దేశాలకు భారత్ వెల్లడించింది. ఈ దాడులపై ప్రపంచ దేశాల నేతలు తమ స్పందన తెలియజేశారు. ప్రపంచానికి శాంతి కావాలి తప్ప ఘర్షణలు వద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇరుగుపొరుగు దేశాలైన భారత్, పాక్ సంయమనం పాటించాలని చైనా సూచించింది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం పిలుపుపై బుధవారం సాయంత్రం 4 గంటలకు దేశవ్యాప్తంగా 224 జిల్లాల్లోని 259 ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ ప్రారంభమైంది. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయరక్షణతోపాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పిస్తున్నారు.