మంజీర రచయితల సంఘం ఏర్పడి దాదాపు 40 ఏళ్లు కావస్తోంది. సంఘం ఏర్పడిన నేపథ్యం గురించి, దాని ఆలోచ నలు, అవగాహన గురించి చెప్తారా? 1986 నాటికి ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు జిల్లాస్థాయి రచయిత ల సంఘాలు ఉండేవి. ఒకటి. మెదక్ జిల్లా రచయితల సంఘం. రెండోది. మెదక్ మండల సాహిత్య పరిషత్. రెండు సంస్థలు సంప్రదాయ సాహిత్య కేంద్రంగానే నడిచేవి. పద్య రచన, అవధానాలు, పండిత చర్చలు ప్రధానంగా సాగేవి. ఆధునిక సాహిత్యానికి జిల్లాలో వేదిక లేదు. ఎనభయ్యవ దశకములో ప్రజా చైతన్యం విస్తరిస్తున్నా, ఉద్యమాలు ఎగసిపడుతున్నా జిల్లా స్థాయి సాహిత్య సంస్థలు లేకపోవడం వెలితిగానే తోచింది.
సామాజిక సాహిత్య అవసరాలను దృష్టిలో వుంచుకొని విశాల ప్రాతిపదికన ప్రజాస్వామిక స్ఫూ ర్తితో రచయితల సం ఘాన్ని నిర్మించాలి అనుకున్నాం. నందిని సిధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, ఎయం.అయోధ్యారె డ్డి, కె.అంజయ్య, దారం మల్లారెడ్డి, అలా జ్ పూర్ కిషన్ పేర్లతో రచయితలను ఈ కృషిలో భాగస్వామ్యం పంచుకోవల్సినదిగా లేఖ రాసాం.
అన్ని రకాల ప్రక్రియలకు సంబందించిన రచయితలను, సాహిత్యకారుల్ని కలిసాం. విసృతంగా చర్చించాం. మంజీర రచయితల సంఘం పేరును నిర్ణయించాం. ఆనాడు నంది ని సిద్దారెడ్డి అధ్యక్షుడుగా, కె.అంజయ్య కార్యదర్శిగా కార్యవర్గం ఏర్పాటయింది.
ఆధునిక సాహిత్య భావోద్వేగాలు ప్రజా సమూహాలకు చేరువ చేయవలసిన కొత్త సందర్భమే ‘మంజీరా రచ యితల సంఘం’ ఏర్పాటు. జిల్లాలో చెల్లాచెదురుగా ఉన్న రచయితల్ని ఏకీకృతం చేయ డం, ఆధునిక సాహిత్యాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తేవడం, మానవ సంబంధాల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునేందుకు దోహదపడే సాహిత్యాన్ని సృజించడం ప్రధాన లక్ష్యాలుగా మంజీరా రచయితల సంఘం రూపుదిద్దుకున్నది.1986 జూలై 20న సిద్దిపేట కేంద్రంగా సంస్థ ప్రారంభమైంది. శీలా వీర్రాజు డిజైన్ చేసిన లోగోను డా. సి. నారాయణరెడ్డి ఆవిష్కరించగా మరసం ప్రారంభోత్సవ సభ వైభవంగా ప్రారంభించటం జరిగింది. ‘మానవత, భావుకత మా వస్తు శిల్పాలు, జీవితపు విలువలే మా అలంకారాలు, సరికొత్త భావాల చైతన్య వేదిక’మాది అని స్పష్టంగా ప్రకటించుకున్నాం. పాడుకున్నాం. విశాల ప్రాతిపదికన పని చేయడం అలవాటు చేసుకున్నాం. కొత్త భావాలకే కాదు కొత్త రచయితల వేదికగా మరసం కొనసాగుతున్నది.
ఈ సుదీర్ఘ సాహిత్య ప్రయాణంలో మీరు దాటి వచ్చిన మైలురాళ్లు అనేకం వుంటాయి. సాహిత్య రంగంలో మీ సంస్థ వేసిన ప్రత్యేక ముద్ర కూడా తప్పకుండా ఉంటుంది. ఆ విషయాల గురించి, అలాగే మీరు చేసిన కార్యక్రమాల గురించి చెప్తారా?
నలభైఏళ్ల ప్రయాణం. మంజీరా ఎన్నో మైలురాళ్లు దాటింది. నది పేరు పెట్టుకున్న ఒరవడి. మంజీరా నదికి ఏడుపాయలు. రచయితల సంఘానికి ఏడు శాఖలు. అదొక ఉద్దేశం. నది పోటెత్తినట్టే మరసానిదొక ఉద్యమం. జిల్లా స్థాయి సంస్థే అయినా, తన ఆచరణతో రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చుకున్నది. ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ రచయితల భావోద్వేగాలు పంచుకున్నది. యువ రచయితలకు, సాహిత్య సంస్థలకు, ప్రేరణగా నిలిచింది. సంపూర్ణ మధ్యనిషేధ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నది. యాభై గ్రామాల్లో సాంస్కృతిక ప్రదర్శనలిచ్చి చైతన్యపరిచింది.
’గుట్కా’కు వ్యతిరేకంగా, అశ్లీల సంస్కృతికి వ్యతిరేకంగా, ఉన్మాదాలకు నిర్బంధాలకు వ్యతిరేకంగా, ప్రజారాశులని కూడగట్టింది. మహిళా చైతన్యానికి, దళిత చైతన్యానికి చేయూత అయింది. ప్రపంచీకరణ వ్యతిరేక కవితలతో ‘మొగులయింది‘తొలుతగా ప్రచురించింది. అంతేకాదు మైత్రి సమావేశాలు, ప్రముఖ కవులతో ఇంటర్వ్యూలు, కవి సాయంత్రాలు మొదలైనవి ఎన్నింటినో నిర్వహించింది.తెలంగాణ రాష్ట్రం కోసం తీర్మానించిన మొట్టమొదటి సాహిత్య సంస్థ మరసం. తెలంగాణ పాటలతో, ప్రసంగాలతో అది ఉద్యమం
నిర్మించింది. ముందుకొస్తున్న తెలంగాణ సందర్భాన్ని గుర్తించి, మంజీరా రచయితల సంఘం పదిహేనేళ్ల ఉత్సవాలలో ‘తెలంగాణ రచయితల వేదిక‘ను స్థాపించింది. కవుల్ని, రచయితల్ని, గాయకుల్ని, పత్రికా రచయితల్ని, వక్తల్ని, ఉద్యమ నేతల్ని తీర్చిదిద్దింది. విప్లవోద్యమం నుంచి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం దాకా నలభయ్యేళ్ళ తెలంగాణ సామాజిక, సాంస్కృతిక పరిణామాల్లో మరసం పాత్ర ప్రత్యేకమైంది. మంజీర రచయితల సంఘం పుస్తక ప్రచురణలు కూడా చేపట్టింది. ఎలాంటి పుస్తకాలు మీరు వేశారు?
40కి పైగా పుస్తకాలు ప్రచురించింది. కవితా సంపుటాలు, సంకలనాలు, కథా సంపుటాలు, సంకలనాలు, వ్యాస సంకలనాలు, పాటల సంకలనాలు, చరిత్ర – సంస్కృతి, భిన్న ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలు ప్రచురించింది. తెలుగులో ప్రపంచీకరణను నిరసిస్తూ మొదటి కవిత సంకలనం ‘మొగులైంది’. తెలంగాణ కవితా సంకలనం ‘ఎడపాయలు’. తెలంగాణ ఉద్యమంలో మొదటి పాటల సంపుటి ‘తెలంగాణ’ ప్రచురించటం విశేషం. మెదక్‌లో తొలితరం కథకుల నుంచి వర్తమాన తరం కథకుల దాకా సంకలనం చేసి యాభైరెండు కథలతో ‘మెతుకు కథలు’ ప్రచురించింది. వట్టికోట ఆళ్వారుస్వామిని మరిచిన నేపథ్యంలో జీవితాన్ని, సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ‘ప్రజల మనిషి వట్టికోట’ పరిశోధనా వ్యాసాలు ప్రకటించింది. కిరాతకుల చేతిలో బలైన గాయని బెల్లి లలిత యాదిలో ‘పాటల యాది’ సంకలనం, క్యాన్సర్ బారినపడి దూరమైన కవి పోగుల రాజన్న యాదిలో ‘సెలవింక’ సంకలనం వెలువరించింది.
‘భైరాన్‌పల్లి పోరాట చరిత్ర’, ‘తెలంగాణలో శాతవాహనులు’ వంటి చరిత్ర పుస్తకాలు. ‘ఆధునిక వ్యవసాయానికి ఆవలి వైపు’ వంటి సామాజిక విశ్లేషణలు ప్రచురించింది. ఇవేగాక మారుతున్న మాధ్యమాల్ని స్వీకరించింది. కె.శివారెడ్డి కంఠస్వరంతో ‘శివారెడ్డి కవిత’ ప్రముఖ కవుల కంఠస్వరాలతో ‘జలపాతాలు’, దేశపతి శ్రీనివాస్ గానంతో ‘నాగేటి చాల్లల్ల‘’ ఆడియో క్యాసెట్లు, ప్రముఖ కవుల దృశ్శీకరణతో ‘కవిదృశ్యం’ వీడియో రూపొందించాం. ఒకటే దేశం ఒకటే భాషన్న నినాదాన్ని నిరసిస్తూ మంజీర కవులు వేసిన నిరసన కవిత గానం ‘జోటపాటలు’.
మీరు ఈ సంస్థను ప్రారంభించిన కాలానికీ, నేటి పరి స్థితులకు మధ్య చాలా తేడా ఉంది. అనేక రకాల ప్రసార మాధ్యమాలు పాఠకుడికి, రచయితకి మధ్యనున్న దూరాన్ని చెరిపేస్తున్నాయి. స్థానిక సాహిత్యం నుండి అంతర్జాతీయ సాహిత్యం దాకా ఇవాళ్ళ అందుబాటులోకి వచ్చింది అంద రికీ. ఇలాంటి స్థితిలో ఒక సాహిత్య సంస్థ అవసరం ఉందని అనుకుంటున్నారా?
నిజమే, మరసం ప్రారంభించిన ఎనభయ్యో దశకానికీ, ఈ ఇరవయ్యో దశకానికీ చాలా మార్పులు సంభవించాయి. పరిస్థితులు పోల్చలేనంతగా మారిపోయాయి. మాధ్యమాలు, మనస్తత్వాలు, అభిరుచులు అన్ని విధాల మారినాయి. పాఠకుడికి రచయితకూ, ప్రజలకూ నడుమ తీవ్రమైన అంతరం ఏర్పడింది. అయితే- మంజీరా రచయితల సంఘం యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైన మాధ్యమాలలోను ప్రవేశించింది. ఈ అన్ని దశల్లో మంజీరా ప్రయాణిస్తూనే ఉన్నది గనుక కలుపుకుంటూనే కలిసిపోతూనే ప్రవహిస్తున్నది. ప్రపం చం దగ్గరైంది. గ్రామం దూరమైంది.
రెండింటి నడుమ మనుషు లు తండ్లాడుతున్నారు. ఆరాటపడుతున్నారు. శ్రోత పాఠకుడ యి, పాఠకుడు శ్రోతయి, కొత్తగా వీక్షకుడు అయి ఉండవచ్చు. అయినా, తడి ఆరలేదు. తపన తీరలేదు. రచయితల పని, సంస్థల పని మరింత పెరిగింది. వ్యవస్థతో పోరాట దశ అప్పుడు. వ్యక్తిగత పోరాట దశ ఇప్పుడు. మనిషి ఇంకా శిథిలమైపోయాడు. రాజకీయాలు శిథిలమైపోయాయి. రచయితలు, కవులే ప్రాణం తట్టాలి. మనిషిని ప్రతిష్టించాలి. ఆ ప్రయత్నంలో మరసం ఆపసోపాలు పడుతున్నది. ప్రాణం రేకెత్తించడానికి ప్రయాణం ఉన్న సంస్థలైనా ఏర్పడుతున్న సంస్థలైనా కొంచెం కొంచెంగానైనా కదలాలి! కదిలించాలి! విశాల ప్రాతిపదిక, విశ్వాసంతో నడక మంజీరా రచయితల సంఘం నమ్ముకున్నది. నడుస్తున్నది.
భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు?
రానున్న కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టనుంది మరసం. ఒక కథా సంకలనం, కవితా సంకలనం, వ్యాస సంకలనం వెలువరించాలని మరసం సంకల్పించుకున్నది. ఇంకా కథా కార్యశాల, కవిత్వ కార్యశాల నిర్వహిస్తూ కొత్త కథకులకు, కవులకు ఆలంబనగా నిలవాలని ఆశిస్తున్నది. ప్రజా ఉద్యమాల్లో మమేకమవుతూ సాగాలని నిశ్చయించుకున్నది. తెలుగు పై జరుగుతున్న దాడిని ఎప్పటికప్పుడు నిరసిస్తూనే తెలుగు భాషాభివృద్ధికి చేయూతనివ్వాలని కంకణబద్ధురాలై ఉన్నది.