గత పాలకులు పదేళ్లపాటు ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండల కేంద్రంలో బుధవారం 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద చేసిన ఖర్చు వివరాలను లెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన లబ్ధి వివరాలను తయారుచేసి వివరాలు కూడా వెల్లడిస్తామని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం ఇలా ప్రతి ఇంటికీ వేలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆ వివరాలను పూర్తిగా త్వరలో బహిర్గతం చేస్తామని అన్నారు.
ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేళ్లు పాలించిన వారు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు.ఆదాయం లేకపోయినా, అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఐదేళ్ళలో రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. అటవీ హక్కు చట్టం ద్వారా పట్టా పొందిన రైతులందరికీ ఇందిరా గిరి జలవికాసం ద్వారా ఉచితంగా బోర్లు, పంప్ సెట్లు, సోలార్ విద్యుత్, పామాయిల్, అవకాడో మొక్కలు ఉచితంగా అందజేస్తామని అన్నారు. జూన్ 2న రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 34 మంది కళ్యాణలక్ష్మి పథక లబ్ధిదారులకు రూ. 34,03,944 విలువ గల చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్,
వైరా ఎంఎల్‌ఎ మాలోతు రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఇ శ్రీనివాసాచారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. కళావతిబాయి, డిసిహెచ్‌ఎస్ డా. రాజశేఖర్, ఆర్‌డిఒ జి. నర్సింహారావు, డిసిసి అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, పిఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, ఏడిఏ విజయ్ చందర్, తహశీల్దార్లు ఉషా శారద, పున్నం చందర్, ఎంపిడిఒలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.