నేటి నుంచి అంతర్వాహినికి
పుష్కరాలు 26 వరకు
కొనసాగనున్న పవిత్రస్నానాలు
కాళేశ్వరం వద్ద
అంతర్వాహినిగా ప్రవహిస్తున్న
సరస్వతీ నేడు సిఎం
రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా
పుష్కర ఘాట్లు ప్రారంభం
పవిత్ర స్నానం ఆచరించనున్న
ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్/కాళేశ్వరం /భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : నేటి నుం చి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పుష్కరాలకు సం బంధించి పలుమార్లు అధికారులతో సమీక్షలు, వీడి యో కాన్ఫరెన్స్‌లను అటవీ, దే వాదా య శాఖ మంత్రి కొండా సురేఖ, ఐ టీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు నిర్వహించారు. దీంతోపాటు అధికారులకు వారు సూచనలు, సలహా లు చేశారు. కాళేశ్వరం యాప్, వెబ్ పోర్టల్‌ను ప్రారంభించి, భక్తులు సాంకేతికంగా పొందే సేవలను సైతం అందులో పొందుపరిచారు. సదరు పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు సుమారు 50 వేలకు పైగా భ క్తులు వచ్చి పుష్కర స్నానం చేయడంతో పాటు పిండప్రదానం, దంపతీ స్నానం, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్లను దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు కొరకు నూతన ఘాట్ నిర్మాణం,
స్నానాల కొరకు షవర్లు ఏర్పాటు, టెంట్లు, చలువ పందిర్లు, లైటింగ్, త్రాగునీటి ఏర్పాటు, అదనపు కౌంటర్లు నిర్మాణం, సిమెంట్ రోడ్ల నిర్మాణం, పిండ ప్రధాన మండపం, కేశఖండన మండపం నిర్మాణం, శాశ్వత మారుగుదొడ్లు, స్నానం గదుల నిర్మాణం, పుష్కర ఘాట్ పైన సరస్వతీ అమ్మవారి రాతి విగ్రహం ఏర్పాటు, మేన్ ఘాట్ వద్ద స్వాగత తోరణం నిర్మాణం, హారతి ప్లాట్ ఫారం నిర్మాణం, గోదావరి నదిలో నీటివరకు తాత్కాలిక రోడ్డు ఏర్పాటు ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో మంత్రులిద్దరూ తమవంతు కృషి చేశారు. పనులు త్వరితగతిన పూర్తి కావడానికి మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. దీంతోపాటు దేవాలయం వద్ద ప్రత్యేక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరిగే పన్నెండు రోజులు సరస్వతి ఘాట్ పైన ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు కలిసి త్రివేణి సంగమంగా ప్రవహిస్తోంది. కాళేశ్వర క్షేత్రం వద్ద త్రివేణి సంగమ తీరంలో నేటి నుంచి ఈనెల 26వ తేదీ వరకు సుమారుగా 12 రోజుల పాటు సరస్వతీ నది పుష్కరాలు జరుగునున్నాయి. సరస్వతీ నది పుష్కరాలలో మాతృవంశం వారికి పిండ ప్రదానం చేయడం వలన పుణ్య ఫలం దక్కుతుందని చెబుతారు. అందుకే దాన్ని మాతృగయ అని కూడా అంటారు. గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తున్నందున కాళేశ్వరం కూడా త్రివేణి సంగమంగా ప్రఖ్యాతి చెందింది. అందువలన కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పవిత్ర సరస్వతీ పుష్కరస్నానం చేసిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.