భారత్ దాడులపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు బుకాయించిన పాక్.. భారత్ దాడులు చేసిందని ఒప్పుకుంది. శుక్రవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ ప్రధాని షరీఫ్ ప్రసంగిస్తూ.. నూర్ ఖాన్‌తోపాటు పలు వైమానిక స్థావరాలపై భారత్ దాడులు జరిపిందని అంగీకరించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా తమ కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ ఖచ్చితమైన దాడులు జరిపినట్లు ధృవీకరించారు.
భారత ఆపరేషన్ ప్రారంభమైన కొన్ని క్షణాల తర్వాత, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తనను తెల్లవారుజామున 2.30 గంటలకు నిద్రలేపారని షరీఫ్ అన్నారు. “జనరల్ మునీర్.. నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి దాడుల గురించి తెలియజేశారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే క్షణం. ఆ సమయంలో మా వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించింది” అని షరీఫ్ చెప్పారు. కాగా, బిజెపి జాతీయ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా.. పాక్ ప్రధాని మాట్లాడిన వీడియో ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ఇది ఆపరేషన్ సిందూర్.. ధైర్యం, సామర్థ్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు.