Saturday, May 4, 2024

పాక్ ప్రధాని మళ్లీ నవాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

రికార్డ్ స్థాయిలో నాలుగవ సారి పదవి
ప్రధాని పదవికి నా అభ్యర్థి నవాజ్
మాజీ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్

లాహోర్ : పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) అధినేత నవాజ్ షరీఫ్ రికార్డ్ స్థాయిలో నాలుగవ సారి ప్రధాని అవుతారని పాకిస్తాన్ మాజీ ప్రధాని షెహ్‌భాజ్ షరీఫ్ మంగళవారం పునరుద్ఘాటించారు. షెహ్‌బాజ్ లాహోర్‌లో పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ‘నవాజ్ షరీఫ్ నాలుగవ పర్యాయం ప్రధాని కాగలరని నేను చెప్పాను. ఆయన నాలుగవ సారి ప్రధాని కానున్నారని ఇప్పుడు స్పష్టం చేస్తున్నాను’ అని తెలిపారు. ఆ పదవిని అధిష్ఠించేందుకు మీరు ఇక ఎంత మాత్రం ఫేవరైట్ కాదా అన్న ప్రశ్నకు ‘ప్రధాని పదవికి నా అభ్యర్థి నవాజ్ షరీఫ్’ అని షెహ్‌భాజ్ సమాధానం ఇచ్చారు. 74 ఏళ్ల నవాజ్ షరీఫ్ మొదటి సారి 1990లో ప్రధాని పదవి అధిఫ్ఠించారు.

కాని అవినీతి ఆరోపణలతో ఆయన మూడు సంవత్సరాల తరువాత నిష్క్రమించవలసి వచ్చింది. ఆయనను అవినీతి ఆరోపణలు వేధిస్తూనే ఉన్నాయి. ఆయన రెండవ సారి 1997లో తిరిగి అధికారంలోకి వచ్చారు. సైనిక దళాల ప్రధానాధికారి పర్వేజ్ ముషారఫ్‌ను తప్పించేందుకు కుట్ర పన్నిన తరువాత 1999లో సైనిక తిరుగుబాటులో పదవీ చ్యుతుడు అయ్యేంత వరకు షరీఫ్ ప్రధాని పదవిలో ఉన్నారు. పది సంవత్సరాలకు పైగా విరామం అనంతరం 2013లో షరీఫ్ మళ్లీ అధికారంలోకి వచ్చారు. కానీ, ఆఫ్‌షోర్ సంస్థలను నిర్వహిస్తున్నందుకు ఆయన పిల్లల పేర్లు 2016లో లీకైన పనామా పత్రాలలో బహిర్గతం అయినప్పుడు ఆయనపై తిరిగి అవినీతి ఆరోపణలు వచ్చాయి.

ఆ తరువాత వేర్వేరు అవినీతి ఆరోపణలపై ఆయనను దోషిగా నిర్ధారించడంతో జీవిత కాలం పదవికి అనర్హుడుగా ప్రకటించారు. షరీఫ్ తన పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవడం అది మూడవ సారి. కాగా, ఈ నెల 8న ముగిసిన ఎన్నికలలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల గురించి షరీఫ్ తమ్ముడు షెహ్‌భాజ్ మాట్లాడుతూ, పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్=ఎన్ (పిఎంఎల్=ఎన్) ప్రముఖులు ఓడిపోయారని, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారని చెప్పారు. ‘ఖైబర్ ఫఖ్తూన్‌క్వాలో అధిక సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అంటే అక్రమాల ద్వారానే వారు గెలిచారని దానికి అర్థమా ? సింధ్, బలూచిస్తాన్‌లలో స్వతంత్రుల జాడే లేదు’ అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News