Saturday, July 27, 2024

సహనమే ప్రశాంత వైవాహిక జీవితానికి పునాది

- Advertisement -
- Advertisement -
చిన్న చిన్న వాదనలను అతి చేయరాదు
వరకట్నం వేధింపుల కేసు విచారణలో సుప్రీం కోర్టు
భర్తపై మహిళ కేసు కొట్టివేత

న్యూఢిల్లీ : సహనం, సర్దుబాటు, గౌరవం ప్రశాంత వైవాహిక జీవితానికి పునాదులు అని, చిన్న చిన్న వాదనలు, అల్పమైన విభేదాలు ప్రాపంచిక వ్యవహారాలు అని, వివాహాన్ని దెబ్బ తీసేలా వాటిని అతి చేయరాదని సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఒక మహిళ తన భర్తపై దాఖలు చేసిన వరకట్నం వేధింపుల కేసును కోర్టు కొట్టివేస్తూ ఆ వ్యాఖ్యలు చేసింది. చాలా సార్లు ఒక వివాహిత తల్లిదండ్రులు, సన్నిహిత బంధువులు చిన్న సమస్యను సంక్లిష్టంగా మారుస్తుంటారని, పరిస్థితిని సరిదిద్ది, వివాహాన్ని కాపాడే బదులు వారి చర్య అల్ప సమస్యలపై వైవాహిక బంధాలను పూర్తిగా ధ్వంసం చేస్తుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.

పోలీసులతోనే అన్ని చెడుగులకు విరుగుడు లభిస్తుందన్నది మహిళ, ఆమె తల్లిదండ్రులు, బంధువులకు ముందుగా కలిగే భావన అని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జెబి పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ఆ వ్యవహారం పోలీసుల వద్దకు చేరగానే భార్యాభర్తల మధ్య రాజీకి ఏమాత్రమైనా ఉన్న అవకాశాలు వీగిపోతాయని బెంచ్ వ్యాఖ్యానించింది. వైవాహిక వివాదాల్లో ప్రధానంగా ఇబ్బంది పడేది పిల్లలే అని కోర్టు అన్నది. ‘భార్యాభర్తలు అంతరాంతరాల్లో ఎంత ద్వేషంతో పోరాడతారంటే వైవాహిక బంధం తెగినప్పుడు అది తమ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతుందనేది ఒక్క క్షణం కూడా ఆలోచించరు.

పిల్లల పెంపకానికి సంబంధించినంత వరకు విడాకులు చాలా వికృత పాత్ర పోషిస్తాయి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. వైవాహిక వివాదాల్లో అంతిమ మార్గంగానే పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలని కోర్టు సూచించింది. పంజాబ్, హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చుతూ ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనపై దాఖలైన ఒక క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ ఒక భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News