Tuesday, April 30, 2024

నవాజ్‌కు ‘నో’ చెప్పిన బిలావల్

- Advertisement -
- Advertisement -

అధికారం పంపకం సూత్రానికి నిరాకరణ
ప్రధాని పదవిపై నవాజ్ పార్టీ ప్రతిపాదన
ప్రజల తీర్పును మన్నిస్తామన్న పిపిపి నేత‚

కరాచీ : పాకిస్తాన్‌లో అధికారం పంచుకోవడానికి సంబంధించి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ (పిఎంఎల్ ఎన్) చేసిన ప్రతిపాదనకు తాను ‘నో’ చెప్పినట్లు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ వెల్లడించారు. ప్రధాని పదవిని పిపిపి, పిఎంఎల్ (ఎన్) పంచుకోవాలనే సూత్రాన్ని తాను నిరాకరించానని, ప్రజల తీర్పు లేకుండా అత్యున్నత పదవిని చేపట్టాలని తాను కోరుకోవడం లేదని బిలావల్ స్పష్టం చేశారు. 35 ఏళ్ల పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ పిపిపి ప్రధాని అభ్యర్థి.

అయితే, ఈ నెల 8 నాటి ఎన్నికలలో ఆయన పార్టీ జాతీయ అసెంబ్లీలో54 సీట్లతో మూడవ స్థానంలో వచ్చింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు, నవాజ్ షరీఫ్‌కు చెందిన పిఎంఎల్ (ఎన్) గెలుచుకున్న సీట్ల కన్నా 90కి పైగా సీట్లకు పిపిపి వెనుకబడి ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా పోటీ జరిగిన 265 సీట్లలో 133 సీట్లు లభించాలి. 266 స్థానాలు ఉన్న జాతీయ అసెంబ్లీలో ఎన్నికలు 265 స్థానాలకు మాత్రమే జరిగాయి. ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకున్న పిపిపి, పిఎంఎల్ (ఎన్) అగ్ర నాయకత్వాల మధ్య పలు దఫాలు సమావేశాలు జరిగినా అధికారం పంపకం సూత్రంపై రెండు పార్టీలూ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.

సింధు రాష్ట్రంలో పిపిపి ఎన్నికల విజయం సందర్భంగా థట్టాలో ‘యౌమ్ ఇ తషాకర్’ (ధన్యవాదాల రోజు) ర్యాలీలో బిలావల్ ప్రసంగిస్తూ, ‘తమ (పిఎంఎల్ ఎన్)ను మూడు సంవత్సరాల పాటు ప్రధాని పదవిలో ఉండనివ్వాలని, తక్కిన రెండు సంవత్సరాలకు మీరు ప్రధాని పదవి స్వీకరించవచ్చునని ఆ పార్టీ నాతో చెప్పింది’ అని తెలియజేశారు. ఇందుకు తాను ‘నో’ చెప్పానని, ఈ విధంగా ప్రధానిని కావాలని తాను కోరుకోవడం లేదన్నానని, తాను ప్రధాని కావాలంటే పాకిస్తాన్ ప్రజలు ఎన్నుకున్న తరువాతేనని స్పష్టం చేశానని బిలావల్ తెలిపారు.

తమ వోట్ల కోసం అడిగిన వారితో కలసి ముందుకు సాగాలని, ఎటువంటి మంత్రిత్వశాఖలూ కోరరాదని తన పార్టీ నిశ్చయించిందని బిలావల్ ఎవరిపేర్లూ వెల్లడించకుండా చెప్పారు. తన తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్ష పదవికి పిపిపి అభ్యర్థి అని కూడా బిలావల్ తెలిపారు. పాకిస్తాన్‌లో రాజకీయ ఉద్రిక్తత తగ్గింపునకు మాజీ అధ్యక్షుడు తన వంతు పాత్ర పోషిస్తారని బిలావల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News