‘దేవుని ముందు అందరూ మనుషులే. అందరూ సమానులే. కుల ప్రాతిపదికన ఎవరినీ వివక్షకు గురిచేయరాదు’ అంటూ చెన్నై హైకోర్టు న్యాయమూర్తి భరత చక్రవర్తి ఒక కేసులో రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. గత ఏప్రిల్‌లోనే మతపరమైన ఒక కేసు విషయంలో తీర్పు వెలువరిస్తూ, కులం మతంలో ఎటువంటి భాగం కాలేదని, ఏ కులం కూడా హిందూ దేవాలయాల మీద యాజమాన్యానికి ప్రత్యేకమైన హక్కులు లేవని, న్యాయమూర్తి భరత చక్రవర్తి స్పష్టం చేశారు. చెన్నైలోని కర్ణీశ్వరర్ తిరుకోయిల్ దేవాలయం ట్రస్ట్ సభ్యులను ఒకే కులం వాళ్లను నియమించాలని, అందుకు భిన్నంగా ప్రభుత్వం అన్ని కూలాలకు అవకాశం కల్పించడానికి బహిరంగ ప్రకటన చేసిందని దాఖలు చేసిన పిటిషన్‌పైన విచారణ జరిపిన న్యాయమూర్తి కులం ప్రాతిపదికన అర్హతలను నిర్ణయించరాదని, ఆ మతానికి చెందిన ఎవరినైనా ఆ బాధ్యతల్లో నియమించవచ్చునని న్యాయమూర్తి చాలా స్పష్టంగా పేర్కొన్నారు.
ఇందుకు గాను, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వివేకానంద, ప్రముఖ తమిళ కవి భారతి దాసన్, అదే విధంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యాఖ్యలను ఉదహరించారు. ఆత్మకు కులం, స్త్రీ, పురుష భేదం లేదని వివేకానంద సూక్తిని తన తీర్పులో ఉదహరించారు. అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ ‘కులం మానసిక రుగ్మత మాత్రమేనని, దీనికి ఎటువంటి భౌతికపరమైన రూపం లేదని అన్న మాటలను ఇక్కడ పేర్కొన్నారు. అదే విధంగా మరొక కేసులో కూడా భరత చక్రవర్తి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం అందించిన శక్తివంతమైన స్ఫూర్తిని జస్టిస్ చక్రవర్తి చాలా బలంగా వినిపించారు. తమిళనాడులోని కుంద్రత్తూర్‌లోని అరుల్‌మిగ్ కామాచ్చి అమ్మన్ దేవాలయం నిర్వహన కోసం ఒక భక్తుడు విరాళం ఇవ్వడానికి ముందుకు వస్తే, ఆ దేవాలయం నిర్వాహకులు ఆయన అంటరాని కులానికి చెందిన వాడనే కారణంతో తీసుకోవడానికి నిరాకరించారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. కానీ ఇది నిజం. ఇది కోర్టు వరకు చేరింది.
ఈ విషయం హైకోర్టు జస్టిస్ భరత్ చక్రవర్తి స్పందిస్తూ ‘ఈ దేశంలో వివిధ రూపాల్లో అంటరాని తనం కొనసాగుతున్నది. ఒక నిమ్న కులానికి చెందిన వ్యక్తి నుంచి విరాళం తీసుకోవడానికి నిరాకరించడమంటే ఇది కూడా అంటరాని తనాన్ని పాటించడమే. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 17ను ఉల్లంఘించడమే’ అంటూ రాజ్యాంగ విశిష్టతను, సర్వమానవ సమానతను జస్టిస్ చక్రవర్తి చాటి చెప్పారు.ఈ రెండు తీర్పులు ఈ దేశంలో హిందూ మతంలో ఉన్న అమానవీయ ధోరణులను బయటపెడుతున్నాయి. దేశంలోని చాలా చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. గతంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఒక గ్రామంలో ఎస్‌సి కులానికి చెందిన ఒక వ్యక్తి అందరితోపాటు గ్రామంలోని దేవాలయం నిర్మాణం కోసం కృషి చేశారు. అయితే ఆ దేవాలయం ప్రారంభోత్సవ సమయంలో ఆయనను దేవాలయంలోనికి రానివ్వలేదు. అదే విధంగా ప్రారంభోత్సవ శిలా ఫలకంలో ఆయన పేరును తొలగించారు.
అయితే కొంత మంది హిందూ ధర్మ పరిరక్షకులు మాత్రం అందరూ సమామేనని, హిందువులందరూ బంధువులేనని నినాదాలు మాత్రం ఇంకా చెబుతూనే ఉన్నారు. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంటరానితనం మీద చాలా చోట్ల తన వ్యతిరేకతను తెలియజేశారు. తాగే నీటికి, దేవాలయ ప్రవేశానికి, శ్మశానంలో ఖననం, దహనం కోసం ఎటువంటి అంటరానితనం పాటించకూడదని స్పష్టం చేశారు. కానీ ఆచరణలో ఆయన మాటలను ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. ఆయన సంఘంలోని కింది స్థాయి నాయకులు కూడా ఆయన మాటలను పట్టించుకొన్నట్టు లేదు. ఇది ఒక దురదృష్టకరమైన అనుభవం. అయితే వివేకానంద, బాబా సాహెబ్ అంబేద్కర్ కొన్ని సార్లు గాంధీ లాంటి వాళ్లు అంటరానితనాన్ని తీవ్రంగా నిరసించారు. ముఖ్యంగా దేవాలయ పూజారులు కేవలం ఒకే కులానికి చెందిన వారు ఉండడం హిందూ మతానికి తీవ్రమైన నష్టం కాగలదని కూడా ప్రత్యేకించి బాబా సాహెబ్ అంబేద్కర్ స్పష్టం చేశారు.
హిందూ మతానికి ఒక ప్రామాణిక గ్రంథం లేకపోవడం, ఎవరికి తోచిన విధంగా వాళ్ల మతాన్ని నిర్వచించడం, కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఒక ఐక్యత బంధం లేకుండా పోయిందని, అందువల్ల హిందూ మతాన్ని అంగీకరించి, దానిని అనుసరించి, అమలు చేసే వ్యక్తులను ఎంపిక చేసి, అందుకనుగుణంగా మత సాంప్రదాయాలను, సంస్కృతినివారికి బోధించి, దాని ప్రాతిపదిక మీద పూజారులను ఎంపిక చేయడం వల్ల అందరికీ హిందూ మతం మీద హక్కు ఏర్పడుతుందని బాబా సాహెబ్ అంబేద్కర్ తన కుల నిర్మూలన గ్రంథంలో పేర్కొన్నారు. అసలు కులం ఏర్పడడానికి, అది బలంగావేళ్లూనుకోవడానికి ఒకే కులాన్ని పూజారి హక్కులను కల్పించడమని, అందువల్ల ఆ కులం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఇతర ప్రజలను వివిధ రూపాల్లో వేర్వేరుగా నిర్వచించి ఒక సమూహంగా ఉండకుండా చేస్తుందని, అంబేద్కర్ చాలా స్పష్టంగా తన గ్రంథంలో పేర్కొన్నారు. చెడును కాదు, మంచిని కూడా మనం మననం చేసుకుందాం. హిందూ ధర్మ పెద్దలు ఆ మంచిని కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిద్దాం.
దక్షిణాసియా దేశాల్లో భారత దేశం తర్వాత ప్రముఖమైన దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఈ దేశంలో 90 శాతం జనాభా ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నారు. 15వ శతాబ్దం వరకు ఆ దేశం కూడా హిందూ, బౌద్ధ సాంప్రదాయాలనే అనుసరించింది. ఆ తర్వాత ముస్లిం ఆక్రమణల తర్వాత ముస్లిం దేశంగా మారిపోయింది. అటువంటి మెజారిటీ ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో ఒకే ఒక రాష్ట్రం బాలిమాబాం హిందూ రాష్ట్రంగా మిగిలిపోయింది. మన దేశం నుంచి చాలా మంది ప్రతి సంవత్సరం బాలికి వెళ్లి వస్తుంటారు. అందమైన ప్రదేశాలు, మంచి వాతావరణం, ప్రజల ఆదరణ మనల్ని కట్టిపడేస్తుంటాయి. అయితే అంతకన్న ముఖ్యమైనది మరొకటుంది. మన దేశం నేర్చుకోవాల్సింది అక్కడే ఉంది. అదే బాలి హిందూ సాంప్రదాయం. బాలిలోని ప్రజలందరూ హిందూ దేవుల్లనే పూజిస్తారు. ముఖ్యంగా బ్రహ్మ, విష్ణు, శివున్ని ఆరాధిస్తారు. కాని అక్కడ మన దేశంలో ఉన్నట్టు కులాధిపత్యం లేదు.
ఇన్ని వందల కులాలు లేవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే తేడాలున్నాయి. అయితే మన దేశంలో ఉన్నంత దొంతర అంతరాలు కానరావు.ఈ విషయంపైన చాలా మంది సామాజిక వేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. దేవాలయాల ప్రవేశం మీద ఆంక్షలు, ఒక కులం మీద మరొక కులం కుట్రలు, వివక్షలు లేవు. అన్నింటి కన్న ముఖ్యమైన అంశం ఈ దేశంలో అంటరానితనం లేదు. ఒకరిని ముట్టుకుంటే మైలపడిపోతామనే కుల రోగం అక్కడ లేదు. అంతకన్న ముఖ్యమైన అంశం పూజారి వ్యవస్థ. ఇక్కడ కేవలం బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఉండరు. హిందూ ధర్మ సాంప్రదాయాలు తెలిసిన ఎవరినైన ప్రజలు తమ పూజారిగా నిర్ణయిస్తారు. ఒక్క కులం గుత్తాధిపత్యం మతం మీద లేదు. అంతేకాకుండా ఏ పూజారి అయినా సాంప్రదాయాలను ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారు. ప్రజలందరికీ ఆ పూజారి మార్గదర్శకుడుగా, ఆదర్శనీయుడుగా ఉండాలి.
ఇది బాలి ఒక రాష్ట్రాన్ని ఎటువంటి విభేదాలు లేకుండా ఒక సమూహంగా ఉండ గలుగుతుంది. అందువల్లనే మొత్తం దేశం ముస్లిం దేశమైనప్పటికీ బాలి కేవలం పది శాతం జనాభా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నది. ఇది ఇలా ఉండడానికి, బాలి దీవి ప్రజలు గతంలో అనుసరించిన బౌద్ధం నుంచి స్థానిక ప్రాచీన మత సాంప్రదాయాల నుంచి ఎన్నో విషయాలను తర్వాతి తరాలు ఇముడ్చుకున్నారు. ఆ విధంగా హిందూ మతాన్ని అక్కడ సంస్కరించుకున్నారు. అదే విధంగా 1960 ప్రాంతంలో అక్కడ కమ్యూనిస్టు పార్టీ జరిపిన రాజకీయ పోరాటం కూడా హిందూ మతాన్ని మరింత మెరుగుపరుచుకున్నది. విషయాలన్నీ అక్కడి ప్రజల ఆచార, సాంప్రదాయాల్లో ఉన్నాయి. ఎంతో మంది సామాజిక నిపుణులు జరిపిన పరిశోధనల్లో ఉన్నాయి. బాలిలో ఉన్నది హిందూ మతం. భారతదేశంలో ఉన్నది హిందూ మతమే. రెండింటి మధ్య ఎంతకింత తేడా దీనికి కారణం ఒక్కటే, బాలి హిందూ ధర్మరక్షకులు తమను తాము సంస్కరించుకున్నారు. మనం మాత్రం ఇంకా అయిదు వేల కింది అంతరాలను ప్రవచించి ధర్మశాస్త్రాలను వల్లె వేసి మన చాందసవాదాన్ని మరింత పెంచుకుంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హిందూవులందరూ బంధువులే అని భావిస్తున్న వాళ్లందరూ ఎవరికి వారు అవలోకనం చేసుకొని ఆధునిక సమాజాన్ని నిర్మించుకోవడానికి ముందుకు వస్తే మంచిది.
-మల్లేపల్లి లక్ష్మయ్య, దర్పణం