ముల్లాన్‌పుర్‌లో క్వాలిఫయర్ 1,
ఎలిమినేటర్
హైదరాబాద్, కోల్‌కతాలకు షాక్
ఐపిఎల్ ప్లే ఆఫ్ వేదికల ఖరారు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2025 (IPL 2025 final) ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. జూన్ 3న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నమెంట్‌కు తెరపడనుంది. నిజానికి ఐపిఎల్ సమరం మే 25న ముగియాల్సి ఉంది. కానీ భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఐపిఎల్‌ను కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేయక తప్పలేదు. ఐపిఎల్ రెండో దశ పోటీలకు మే 17న తెరలేచింది. ఇప్పటికే లీగ్ దశ వేదికలను ప్రకటించారు. మ్యాచ్‌లు కూడా జరుగుతున్నాయి. తాజాగా ప్లేఆఫ్‌కు ఆతిథ్యం ఇచ్చే వేదికలను కూడా బిసిసిఐ మంగళవారం ప్రకటించింది.
ముందు నిర్ణయించిన ప్రకారం ఫైనల్‌తో పాటు క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు కోల్‌కతా నగరం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్‌లో క్వాలిఫయర్ 1తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించాల్సి ఉండేది. కానీ ఐపిఎల్ వాయిదా పడడంతో వేదికలను కూడా మార్చారు. జూన్ 3న జరిగే ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. క్వాలిఫయర్ 2కు ఇక్కడే జరుగనుంది. ఇక క్వాలిఫయర్ 1తో (IPL 2025 final) పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌కు చండీగఢ్ సమీపంలో కొత్తగా నిర్మించిన ముల్లాన్‌పుర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌లను ఈ రెండు స్టేడియాల్లో నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది.
అంతేగాక వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బెంగళూరులో జరగాల్సిన రెండు మ్యాచ్‌లను లక్నోకు మార్చారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారత దేశంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లను ఉత్తర భారత దేశానికి మార్చారు. ఇదిలావుంటే హైదరాబాద్ ఆతిథ్య ఇవ్వాల్సిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఇతర చోటికి తరలి వెళ్లడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. లీగ్ దశ మ్యాచ్‌ను కూడా హైదరాబాద్‌కు బదులు జైపూర్‌కు తరలించారు. తాజాగా ప్లేఆఫ్ వేదికలను కూడా ఉప్పల్ నుంచి వేరే చోటికి మార్చడంతో అభిమానులు నిరాశలో కూరుకు పోయారు.