మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League Season) ఐపిఎల్ సీజన్ 2025 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ టీమ్‌లు నాకౌట్ బెర్త్‌లను దక్కించుకున్నాయి. టోర్నమెంట్ ఫేవరెట్‌లుగా భావించిన డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా, రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్, మాజీ విజేత చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తదితర జట్లు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. ఇక ఈ సీజన్‌లో అదరగొట్టడం ఖాయమని భావించిన సన్‌రైజర్స్ అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది.
ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దు కాగా ఇతర మ్యాచుల్లో ఓటమి తప్పలేదు. కిందటి సీజన్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్, హైదరాబాద్ కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి తదితరులు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. కానీ ఈ సీజన్‌లో వీరు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యారు. ఇక భారీ ఆశలు పెట్టుకున్న ఇషాన్ కిషన్, మహ్మద్ షమిలు కూడా పూర్తిగా నిరాశ పరిచారు. వీరిద్దరూ ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్‌కు వరుస ఓటములు తప్పలేదు. ముఖ్యంగా ఓపెన్లు అభిషేక్, హెడ్‌ల వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపించింది.
ఓపెనర్లలు రాణించిన దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ హైదరాబాద్ జయకేతనం ఎగుర వేసింది. వీరు విఫలమైన పోటీల్లో జట్టుకు ఓటమి తప్పలేదు. ఇషాన్ కిషన్ పేలవమైన బ్యాటింగ్ కూడా హైదరాబాద్ దుస్థితికి ప్రధాన కారణంగా చెప్పాలి. ఇక చెన్నైది కూడా ఇలాంటి పరిస్థితే. ప్రపంచ స్టాయి ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల అర్ధాంతరంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్య బాధ్యతలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. కీలక ఆటగాళ్ల వైఫల్యం చెన్నైకి శాపంగా మారింది. రచిన్ రవీంద్ర ఆరంభంలో బాగానే ఆడినా తర్వాత పూర్తిగా చేతులెత్తేశాడు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబె, విజయ్ శంకర్, షేక్ రషీద్, రవిచంద్రన్ అశ్విన్, శామ్ కరన్, జడేజా వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది.
ఐపిఎల్‌లో (Indian Premier League Season) అత్యంత మెరుగైన రికార్డు కలిగిన చెన్నై ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మెయిర్, వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చర్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు రాజస్థాన్‌లో ఉన్నారు. అయినా రాజస్థాన్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. రియాన్ పరాగ్, సంజు శాంసన్‌ల వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. నితీశ్ రాణా, శుభమ్ దూబె తదితరులు కూడా నిరాశ పరిచారు. లక్నో సూపర్‌జెయింట్స్ కూడా పేలవమైన ఆటతో తేలిపోయింది.
కెప్టెన్ రిషబ్ పంత్ వైఫల్యం జట్టును వెంటాడింది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. జట్టును ముందుండి నడిపించలేక పోయాడు. ఓపెనర్లు మార్‌క్రమ్, మిఛెల్ మార్షల్‌లు బాగానే ఆడినా ఫలితం కనిపించలేదు. కీలక మ్యాచుల్లో స్టార్ ఆటగాళ్లు విఫలం కావడంతో లక్నో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. కిందటి ఛాంపియన్ కోల్‌కతా కూడా పేలవమైన ప్రదర్శనతో నిరాశే మిగిల్చింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన కోల్‌కతా స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయింది. వరుస ఓటములతో కనీసం ప్లేఆఫ్‌కు కూడా చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది.
అనూహ్యంగా ముందుకు..
మరోవైపు గుజరాత్, పంజాబ్, బెంగళూరు జట్లు అనూహ్యంగా ప్లేఆఫ్ బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి. బెంగళూరు, పంజాబ్‌లు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసాధారణ ఆటతో ఆకట్టుకున్నాయి. రజత్ పటిదార్, శ్రేయస్ అయ్య ర్, శుభ్‌మన్ గిల్ అద్భుత కెప్టెన్సీతో తమతమ జట్లను ఫ్లేఆఫ్‌కు చేర్చారు. బ్యాట్‌తోనూ వీరు సత్తా చాటారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని మెరుగైన ఫలితాను ఈ త్రయం తమ జట్ల ను టాప్3లో నిలిపాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూ డా ఈ సీజన్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్‌లు తమ జట్లను ముందుండి నడిపిస్తున్నారు. ఆరంభ మ్యాచుల్లో నిరాశ పరిచిన ముంబై ఆ తర్వాత వరుస విజయాలతో ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ఢిల్లీ కూడా మెరుగైన ఆటతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుం ది. ఈ సీజన్‌లో ఫేవరెట్‌లుగా భావించిన జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించగా, ఏమాత్రం అంచనాలు లేని టీమ్‌లు ముందంజ వేయడం విశేషం.