Friday, May 23, 2025

ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్… నేడు బెంగళూరుతో పోరు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH vs RCB) మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలవాలని భావిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించడం హైదరాబాద్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో దిగేందుకు ఈ గెలుపు దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెంగళూరు ఇప్పటికే నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. హైదరాబాద్‌పై కూడా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

అందరి కళ్లు అభిషేక్‌పైనే..

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై అందరి కళ్లు నిలిచాయి. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే సన్‌రైజర్స్‌కు ఎదురే ఉండదు. కిందటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఇది కూడా జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇషాన్, అభిషేక్‌లు చెలరేగితే హైదరాబాద్‌కు భారీ స్కోరు ఖాయం. హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, కెప్టెన్ కమిన్స్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది. లక్నో మ్యాచ్‌లో రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగిన ఆల్‌రౌండర్ కమింది మెండిస్ ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది చెప్పలేం. బౌలింగ్ కూడా హైదరాబాద్ బాగానే ఉంది. కిందటి మ్యాచ్‌లో ఇషాన్ మలింగ మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

గెలుపే లక్షంగా..

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB) ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, జితేశ్ శర్మ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్ తదితరులతో జట్టు బలంగా ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి రానున్న ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని బెంగళూరు భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News