హైదరాబాద్: థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ (Theaters Bundh) అవుతాయని వచ్చిన వార్తలపై ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ వెల్లడించారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదు అని ఆయన ప్రకటించారు. శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
‘‘అయితే థియేటర్ల బంద్ అనేది అవాస్తవమని.. జూన్ 1 నుంచి చర్చలు జరగకపోతే అలాంటి నిర్ణయం తీసుకుందామని అనుకున్నాం. దానికి అందరూ థియేటర్లు మూసి వేస్తారన్న సమాచారం నిజం కాదు. ప్రస్తుతం అలాంటిది ఏమీ లేదు. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకొని థియేటర్లు బంద్ (Theaters Bundh) చేస్తామనేది కరెక్ట్ కాదు’’ అని దామోదర ప్రసాద్ అన్నారు. కొన్ని వార్తలు బిజినెస్‌ని దెబ్బతీస్తాయని.. ఇప్పటికే సినీ పరిశ్రమలో చాలా ఇబ్బందులు ఉన్నాయని అయన పేర్కొన్నారు. థియేటర్ల బంద్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని తెలిపారు. తెలుగు ఫిలిమ్ ఛాంబర్ నుంచి వచ్చే సమాచారమే అధికారికమని స్పష్టం చేశారు.