ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 29వ తేదీ నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లాయి. దీంతో ఏ జట్లు ఫైనల్స్‌కి వెళ్తాయో.. ఏ జట్టు ట్రోఫీని ముద్దాడుతుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఫ్లేఆఫ్స్‌కి ముందు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ యువజేంద్ర చాహల్(Yuzvendra Chahal) గాయపడ్డాడు. గాయం కారణంగా చాహల్ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా పాల్గొనలేదు.
చాహల్‌కు గాయమైన విషయాన్ని అసిస్టెంట్ కోచ్ సునీల్ జోషి ధృవీకరించారు. అయితే అతను ఏ గాయంతో బాధపడుతున్నాడనే విషయాన్ని బయటపెట్టలేదు. ‘‘చాహల్(Yuzvendra Chahal) చిన్న గాయంతో బాధపడుతున్నాడు.. అందుకే అతనికి మేము విశ్రాంతిని ఇచ్చాం. అతను మా తదుపరి మ్యాచులకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం’’ అని సునీల్ జోషి అన్నారు. ఒక వేళ చాహల్ గాయం కారణంగా పంజాబ్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమైతే.. అది ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో చాహల్‌కి బదులు జట్టులోకి వచ్చి ప్రవీణ్ దూబే 1 వికెట్ మాత్రమే తీసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. చాహల్ ఈ సీజన్‌లో 12 మ్యాచులు ఆడి.. 9.56 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. ఇక లీగ్ దశలో పంజాబ్ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో మే 26న తలపడనుంది.