గుజరాత్‌కు సవాల్, ముంబైకి పరీక్ష, నేడు ఎలిమినేటర్ సమరం
ముల్లాన్‌పూర్(చండీగఢ్): ఐపిఎల్ సీజన్ 2025లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ (GT vs MI) పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడే జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తోంది. గెలిచే టీమ్ క్వాలిఫయర్ 2కు అర్హత సాధిస్తోంది. తొలి క్వాలిఫయర్‌లో ఓడిన టీమ్‌తో ఇందులో గెలిచే జట్టు తలపడుతుంది. ఇందులో విజయం సాధించే టీమ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. ఇక చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరిగే పోరుకు ఇరు జట్లు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యాయి.
లీగ్ దశ ఆరంభంలో గుజరాత్ మెరుగైన ఆటను కనబరచగా, చివరి దశలో ముంబై ఇండియన్స్ వరుస (GT vs MI) విజయాలతో ప్రకంపనలు సృష్టించింది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇటు గుజరాత్ అటు ముంబై దాదాపు సమవుజ్జీలుగా ఉన్నాయనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు ఇరు జట్లలోనూ కొదవలేదు. హార్దిక్ పాండ్య ముంబైని, శుభ్‌మన్ గిల్ గుజరాత్‌ను ముందుండి నడిపిస్తున్నారు. ఎలిమినేటర్ పోరులోనూ తమ తమ జట్లను గెలిపించాలనే పట్టుదలతో వీరిద్దరూ ఉన్నారు. ఇందులో ఎవరూ పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.
ఓపెనర్లే కీలకం..
గుజరాత్ విజయాల్లో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలి మ్యాచ్ నుంచే ఇద్దరు అసాధారణ బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ సునామీ ఇన్నింగ్స్‌లతో జట్టుకు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందిస్తున్నారు. కీలకమైన ఎలిమినేటర్ సమరంలోనూ చెలరేగేందుకు సిద్ధమయ్యారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరిద్దరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక కుశాల్ మెండిస్, రూథర్‌ఫోర్ట్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా తదితరులతో గుజరాత్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక సాయి కిశోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్‌లతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్నగుజరాత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
ఆత్మవిశ్వాసంతో..
మరోవైపు ముంబై ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. రోహిత్ శర్మ, బెయిర్‌స్టో, అసలంక, సూ ర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, తిలక్‌వర్మ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. రోహిత్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బౌలింగ్‌లో కూడా ముంబై బలంగానే ఉంది. బుమ్రా, బౌల్ట్, సాం ట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, హార్దిక్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. రెండు విభాగాల్లో బలంగా ఉన్న ముంబైకి కూడా గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయని చెప్పాలి.