అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో గుజరాత్ టైటాన్స్ పోరాటం ఎలిమినేటర్ దశలోనే ముగిసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో గుజరాత్ ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో టైటిల్ సాధిస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్న గుజరాత్ ఈసారి టైటిల్ సాధించడం ఖాయమని అభిమానులు, విశ్లేషకులు అంచనా వేశారు. అయితే గుజరాత్ మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్‌కు (final) చేరకుండానే టోర్నమెంట్ నుంచి వైదొలిగింది.
ఇది నిజంగా బాధకు గురి చేసే అంశం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా పటిష్టంగా ఉన్న గుజరాత్ సీజన్ ఆరంభంలో అసాధారణ ఆటతో ఆకట్టుకుంది. వరుస విజయాలతో చాలా రోజుల పాటు టాప్2లో కొనసాగింది. గుజరాత్ ఆటను చూసిన ప్రతి ఒక్కరు ఈసారి ట్రోఫీ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. శుభ్‌మన్ గిల్ అద్భుత సారథ్యంలో గుజరాత్‌ను విజయపథంలో నడిపించాడు. కానీ లీగ్ దశ చివర్లో గుజరాత్ ఆట గాడి తప్పింది. వరుస ఓటములు జట్టును వెంటాడాయి. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగడంలో విఫలమైంది. కీలక సమయంలో తడబడిన గుజరాత్ టోర్నమెంట్ నుంచి అనూహ్యంగా వైదొలగాల్సి వచ్చింది. గుజరాత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.