డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ ఎం. మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో.. మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘కన్నప్ప సినిమాని ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశాము. నా బిడ్డ ఎంత కష్టపడ్డాడు. ఎలా ఈ సినిమా తీసాడు అనేది నేను చెప్పదలచుకోలేదు.
సినిమానే మాట్లాడుతుంది. నా కంటే చిన్నవాడు, నా భావ ప్రభాస్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. జూన్ 27న రాబోతోన్న ‘కన్నప్ప’ను ఆశీర్వదించండి’ అని అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘ప్రభుదేవా ఒక కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, డైరెక్టర్‌గా సక్సెస్ (Success director) చూసారు. ఆయన పనులన్నీ మానుకొని కన్నప్ప సినిమాకి మూడు పాటలు చేయాల్సిన అవసరం లేదు. అయినా మా కోసం చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. ముఖేష్ రిషి, శివ బాలాజీ, రఘుబాబు.. ప్రతీ ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్స్. డైరెక్టర్ ముఖేష్ సింగ్ భాష రాకపోయినా ‘కన్నప్ప’ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారు. సినిమా ఎప్పుడు చేస్తామో తెలియకుండానే 2017లోనే ఈ ప్రాజెక్ట్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకున్నారు. ఇది శివాజ్ఞ. ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది.
నా మిత్రుడు ప్రభాస్‌కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అతను కన్నప్ప సినిమా చేయడానికి కారణం.. నాన్న మీద ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం. నాన్న కోసం ప్రభాస్ ఈ సినిమా చేశారు. దాదాపు 50 ఏళ్ళ తర్వాత కన్నప్ప కథను చిత్రీకరించాం. యాభై ఏళ్ల తర్వాత కన్నప్ప కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను భావిస్తున్నా. కన్నప్పను ఎన్నో సంవత్సరాలుగా ఒక బిడ్డగా చూసుకున్నాం. జూన్ 27న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఈ కార్యక్రమం లో బ్రహ్మానందం, రఘు బాబు, శివ బాలాజీ, కౌశల్ పాల్గొన్నారు.