Wednesday, July 2, 2025

కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసే లక్షంతో కలెక్టర్లు పనిచేయాలి

- Advertisement -
- Advertisement -

ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం నవంబర్ లోపు పూర్తి కావాలి
తెలంగాణ రైజింగ్ 2047 సాకారం కావాలంటే మహిళా సంఘాలను బలోపేతం చేయాలి
ఇందిరా మహిళా శక్తి ముఖ్యమంత్రి ప్లాగ్ షిప్ కార్యక్రమం
: జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసే లక్షంతో కలెక్టర్లు పనిచేయాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క ఆదేశించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ సాకారం కావాలంటే మహిళా సంఘాలు మరింత బలోపేతం చేయాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లాగ్ షిప్ కార్యక్రమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఇందిరా మహిళా శక్తి కార్యకలాపాలపై ఆదివారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలచే సోలార్ ప్లాంట్లు, పెట్రెల్ బంకులు ఏర్పాటు చేయించేలా కలెక్టర్లు కృషి చేయాలని, వాటికి అవసరమైన స్థలాలను తక్షణం గుర్తించి పనులు ప్రారంభించాలని సూచించారు. అక్టోబర్ 2న సోలర్ ప్లాంట్లు ప్రారంభించే లక్ష్యంతో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా సోలార్ ఇనస్టాలేషన్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని, వారితో సమన్వయం చేసుకుని సోలార్ ప్లాంట్ల పనులు ప్రారంభించాలని చెప్పారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులను నవంబర్ లోపు పూర్తి చేయాలని, ఇందుకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు.

అంగన్వాడీలు, ప్రభుత్వ బడులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పేద పిల్లలు వస్తారని, అంగన్వాడీలు, ప్రభుత్వ బడులు బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని మంత్రి సీతక్క అన్నారు. వాటి ప్రాముఖ్యతను గుర్తించి కలెక్టర్లు పనిచేయాలని కోరారు. అంగన్వాడీలు, ప్రభుత్వ బడులపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్దులకు యునిఫాంలను మహిళా సంఘాలచే కుట్టిస్తున్నామని తెలిపారు.

ఈ విద్యా సంవ్సరానికి సంబంధించి 90 శాతం యునిఫాం కుట్టు పనులు పూర్తయ్యాయని వివరించారు. పాఠశాల తెరిచే రోజు విద్యార్దులందరికి యునిఫాంలు పంపిణి చేస్తామని స్పష్టం చేశారు. గతంలో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఆరు నెలలకు గాని యునిఫాంలు అందేవి కాదని అన్నారు. కానీ ఇప్పుడు మహిళా సంఘాలకు యునిఫాం బాద్యతలు అప్పచెప్పి పనులు చేయిస్తున్నామని తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాలు ఈ నెల 11న పునః ప్రారంభం కాబోతున్నాయని, అప్పటిలోపు కలెక్టర్లంతా వాటి నిర్వహణ ఎలా ఉందో తనిఖీ చేయాలని ఆదేశించారు. మొదటి సారి అంగన్వాడీలకు సెలవులు ఇచ్చినందున, అంగన్వాడీ భవనాలను క్షేత్ర స్థాయి సిబ్బందితో పరిశీలింప చేయాలని సూచించారు. ప్రైవేటు ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలని కోరారు.

‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ విజయవంతం చేయాలి

ఈ నెల 11 నుంచి చేపట్టే ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ కార్యక్రయాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను కోరారు. కొత్తగా వేయి అంగన్వాడీ భవనాలు నిర్మించబోతున్నామని, వాటికి కావాల్సిన స్థలాలను సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. శిధిలావస్తలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని సూచించారు.

బాల భరోసా పేరుతో కొత్త స్కీంను తీసుకొస్తున్నామని, ఐదేండ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే అవసరమైన సర్జరీలు కూడా ఉచితంగా చేయిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్జెండర్ పర్సన్ సాధికార శాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News