Thursday, September 18, 2025

నిర్ధేశించిన గడువులోగా భూసమస్యల పరిష్కారం

- Advertisement -
- Advertisement -

పదేళ్లలో పడ్డ గోసను రెవెన్యూ సదస్సుల్లో ఆవేదనతో రైతులు చెప్పుకుంటున్నారు
ఇప్పటివరకు 7,578 రెవెన్యూ సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తుల స్వీకరణ
ఐదు నక్షా గ్రామాల్లో శరవేగంగా భూముల సర్వే
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : రెవెన్యూ సదస్సుల్లో భూములపై రైతులు చేసుకున్న దరఖాస్తులను నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులనుఆదేశించారు. భూ సమస్యల పరిష్కారమే లక్షంగా ఈనెల 3వ తేదీ నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 561 మండలాల్లో 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సదస్సులు ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.

వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మానవతా ధృక్పధంతో వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అధికారులతో ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీనాటికి అన్ని భూ సమస్యలను పరిష్కరించాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని, ప్రభుత్వ లక్షానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం పని చేయాలని కోరారు. గత పదేళ్ల కాలంలో భూ సమస్యలకు సంబంధించి రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, ధరణి చట్టం వచ్చాక తమ ప్రమేయం లేకుండానే రైతులు భూ సమస్యల్లో చిక్కుకున్నారని, సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం ధరణి కారణంగా ఉత్సవ విగ్రహాల్లో మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి దానికి కోర్టు మెట్లు ఎక్కడమే తప్ప రైతుకు మరోదారి లేకుండా పోయిందని, దాదాపు గత రెండు నెలలుగా భూభారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 50 ప్రాంతాల్లో తాను స్వయంగా పాల్గొనడం జరిగిందని, ఆ సదస్సుల్లో రైతులు తమ గోసను ఆవేదనతో చెప్పుకోవడం తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చామని, ఈ చట్టాన్ని క్షేత్ర స్థాయిలో పకడ్భందీగా రైతులకు మేలు చేసేలా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.

శరవేగంగా భూ సర్వే : రాష్ట్రంలో తరతరాలుగా సర్వే చేయని, సర్వే రికార్డులు లేని ఐదు నక్షా గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూసర్వే శరవేగంగా సాగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో నక్షా గ్రామాలను గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్షంతో సర్వే చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 413 నక్షా గ్రామాలకు గాను ఐదు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా గత నెల మూడవ వారం నుంచి సర్వేను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ గ్రామాలుగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్‌లో 422 ఎకరాలకు గాను 337 ఎకరాల్లో సర్వే పూర్తయిందని చెప్పారు.

జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండడం కొమ్మనాపల్లి ( కొత్తది) గ్రామంలో 626 ఎకరాలకు గాను 269 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండడం ములుగు మండలం లోని 845 ఎకరాలకుగాను 445 ఎకరాలు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురులో 502 ఎకరాలకు గాను 232 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాహిద్ నగర్ లో 593 ఎకరాలకు గాను 308 ఎకరాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు.

మొత్తం ఐదు గ్రామాల్లో 2,988 ఎకరాలకు గాను ఇప్పటివరకు 1591 ఎకరాల్లో సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. మరో వారం, పది రోజుల్లో సర్వే ప్రక్రియను మొత్తం పూర్తిచేయాని అధికారులను ఆదేశించారు. చిన్న వివాదాలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే క్షేత్ర స్థాయిలో భౌతికంగా ఈ సర్వే జరుగుతోందని మంత్రి వివరించారు. ఈ నూతన విధానాల వల్ల భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజమాన్యంలో స్పందన ఉందని, ఫలితంగా రైతులు, గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News