న్యూఢిల్లీ: ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 30న మహిళల వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. BCCI(భారత క్రికెట్ నియంత్రణ బోర్డు), PCB (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) అంగీకారంతో హైబ్రిడ్ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ తమ టోర్నమెంట్ మ్యాచ్‌లను కొలంబోలో ఆడుతుంది. ఈ పోటీలోని మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 30న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత- శ్రీలంక జట్లు తలపడతాయి. ఇక, అక్టోబర్ 5న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మధ్య హై-ఆక్టేన్ పోరు జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ లో అక్టోబర్ 1న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో న్యూజిలాండ్ ను ఢీకొట్టనుంది. అలాగే, అక్టోబర్ 8న కొలంబోలో పాకిస్తాన్‌తో.. అక్టోబర్ 22న ఇండోర్‌లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.
28 లీగ్ మ్యాచ్‌లు
ఈ మెగా టోర్నమెంట్ లో మొత్తం 28 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ దశ తర్వాత మూడు నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు బెంగళూరు, ఇండోర్, గౌహతి, విశాఖపట్నం, కొలంబోలో జరగనున్నాయి.ఇక, మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 29న గౌహతి లేదా కొలంబోలో జరుగుతుంది. పాకిస్తాన్ నాకౌట్ దశలకు అర్హత సాధిస్తేనే ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. రెండవ సెమీ-ఫైనల్ అక్టోబర్ 30న.. చివరి మ్యాచ్ నవంబర్ 2న బెంగళూరు లేదా కొలంబోలో జరగనుంది.
2013 తర్వాత తొలిసారిగా
2013 తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్‌ను భారత్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక, భారత్ తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక వంటి జట్లు పోటీకి ప్రత్యక్ష అర్హత సాధించాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్వాలిఫయర్స్ ద్వారా తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి.