మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఎస్సి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల హాస్టల్ లో కనీస వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొల్లు యాదగిరి మాట్లాడుతూ.. బాత్ రూంల లోనల్లాలు సరిగా లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ పరిస్థితులను చూసిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదుల్లో ప్యాన్లు లేకపోవడం స్విచ్ బోర్డులు పూర్తిగా కాలిపోయి పనిచేయడం లేదని తెలిపారు.
స్లాబ్ నుండి నీళ్లు కారుతున్నాయని రెండు రూమ్ లకు తలుపులు కూడ లేవని, కిటికీలకు రెక్కలు లేక దోమలతో పిల్లలు అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఒక పక్కన ప్రహరీ గోడ లేకపోవడం వల్ల పక్కనే పంటాపొలాలు ఉన్నందున పాములు వచ్చే అవకాశం ఉండటమే కాక పిల్లలకు రక్షణ లేదని అన్నారు. పై సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని బొల్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు పట్టణ కార్యదర్శి రాచకొండ రాములమ్మ, పిట్టల చంద్రయ్య, కందుకూరి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.