Thursday, July 3, 2025

రహదారి భద్రతకు ‘ఎఐ’ సాయం

- Advertisement -
- Advertisement -

దేశంలో రోడ్డు ప్రమాదాలు రానురాను విపరీతంగా పెరుగుతున్నాయి. 2023 లో దాదాపు 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, 2024లో 4.8 లక్షల మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారు. అంటే 2023 కన్నా 4.2 శాతం ఎక్కువ. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు వంతున రోజుకు 474 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితుల్లో ఐదో వంతు మంది పాదచారులు కాగా, టూవీలర్లు నడిపేవారు, ముఖ్యంగా హెల్మెట్ ధరించని వారు 44 శాతం వరకు ఉన్నారు. ఎక్కువగా మనుషులను చంపుతున్నది ఓవర్ స్పీడే. మరణాల్లో రెండింట మూడొంతులు ఓవర్‌స్పీడ్ వల్లనే జరుగుతున్నాయి. ఇది మేలుకోవలసిన హెచ్చరిక. ఈ ధోరణిని అరికట్టడానికి కృత్రిమ మేధ (ఎఐ) వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలు ఉపయోగపడతాయని అధ్యయనాల్లో తేలింది.

పుణె వంటి నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలు స్మార్ట్ కెమెరాలను వినియోగించడం ప్రారంభించాయి. డ్రైవర్లు మగతగా ఉన్నారా? పరధ్యానంలో ఉన్నారా? సిగ్నల్స్‌ను దాటుకుని స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇలాంటి అపసవ్య విధానాలను ఈ స్మార్ట్ కెమెరాలు పట్టేస్తాయి. కెమెరాల నుంచి, స్టీరింగ్ నమూనాల నుంచి బ్రేకుల ఒత్తిడినుంచి డేటా సేకరిస్తారు. అలాగే డ్రైవర్ ఎన్నిసార్లు కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉన్నాడో, తరచుగా వాహనం ఎన్నిసార్లు అదుపు తప్పిందో, రెడ్‌లైట్ సిగ్నల్ వద్ద డ్రైవర్ ఎలా ప్రమాదకరంగా ప్రవరిస్తున్నాడో తెలిసిపోతుంది. అలాంటి సమయాల్లో హెచ్చరికలు వస్తాయి. కొన్ని సార్లు కీచుమని శబ్దం రూపంలోనూ, మరికొన్ని సార్లు స్టీరింగ్ వీల్ ప్రకంపించడం ద్వారాను హెచ్చరికలు వస్తుంటాయి. డ్రైవర్ల జీవితం ఎక్కువగా రోడ్లపైనే సాగుతుంది. ఎఐ వ్యవస్థ డ్రైవింగ్ అవర్స్‌ను ట్రాక్ చేయడమే కాదు, వారు స్మార్ట్‌గా డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది. ఎప్పుడు కళ్లు మత్తుతో పడినా లేదా సిగ్నల్స్‌కు స్పందించే సమయం జారిపోయినా విపత్తును పసిగట్టి తక్షణం విశ్రాంతి తీసుకోవాలని డ్రైవర్‌లకు హెచ్చరిస్తుంది.

ఓవర్ స్పీడ్‌తో వాహనం వెళ్తున్నప్పుడు స్వయం చాలకంగా నియంత్రించడం, ముందున్న వాహనానికి ఈ వాహనానికి మధ్య దూరాన్ని గమనించి అవసరాన్ని బట్టి వేగాన్ని తగ్గించడం లేదా పెంచడం చేస్తుంది. డ్రైవర్లు ఒత్తిడికి గురికాకుండా సౌకర్యవంతంగా ఉండే వరకు ఏకాగ్రతను పెంచుతుంది. అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎఐ ఆధారిత డ్రైవింగ్ వ్యవస్థ విఫలమైతే ఎవరు బాధ్యత వహిస్తారు? డ్రైవర్లా లేక సాంకేతిక గణాంకాలా? ఈ ఆటోమేషన్‌పై ఆధారపడడం పెరిగితే డ్రైవర్లకు అవగాహన, సహజమైన ప్రతిస్పందన సామర్థం తగ్గిపోతాయా? ఇవన్నీ మున్ముందు జాగ్రత్తగా క్రమాంకనం చేయవలసి ఉంది. కృత్రిమ మేధ వ్యవస్థలకు వాతావరణ మార్పులు, నిలకడ లేని మానవ ప్రవర్తన, అస్థిరమైన మౌలిక సదుపాయాలు వంటి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి నమూనాలు నియంత్రిత అమరికల్లో బాగానే పనిచేస్తాయి.

కానీ అస్తవ్యస్తమైన ట్రాఫిక్ జామ్‌లోకి ప్రవేశించినా లేదా గ్రామీణ రహదారుల్లో వెలుతురు సరిగ్గా లేకపోయినా వాటి పనితీరు సరిగ్గా ఉండదు. అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో ఎఐ డేటా ఆధారిత పర్యవేక్షక వ్యవస్థలను ప్రయోగాత్మకంగా వాణిజ్య నౌకల్లో వినియోగించగా, నౌకలు ఢీకొనే ప్రమాదాలు 30 శాతం వరకు తగ్గాయని తేలింది. అదే విధంగా భారత దేశంలో బస్సుల్లో డ్రైవర్లకు సహాయక హెచ్చరికల పైలట్ ప్రణాళికలను కొన్ని చోట్ల అమలు చేయగా, ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని తేలింది. రవాణా వ్యవస్థలో కృత్రిమ మేధ సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఏమంత కష్టం కాదు. ఇదిలా ఉండగా కృత్రిమమేధ సాయంతో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఢిల్లీ గురుగ్రామ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేపై అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తీసుకు రావడం చెప్పుకోదగిన విశేషం.

దీంతో దేశంలోనే మొట్టమొదటి ఎఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఈ రహదారి గుర్తింపుపొందింది. ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం, ప్రమాదాలను గుర్తించి హెచ్చరించడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ఈ రహదారిపై సీటు బెల్టు ధరించకుండా ప్రయాణిస్తే అత్యాధునిక కెమెరాలు టక్కున పట్టేస్తాయి. ఒకే టూవీలర్‌పై ముగ్గురు ప్రయాణించడం, ఓవర్ స్పీడ్ తదితర 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను ఈ ఎటిఎంఎస్ వ్యవస్థ పట్టుకుంటుంది. దీనికి ఎన్‌ఐసి ఇ చలానా పోర్టల్‌ను కూడా అనుసంధానం చేశారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులకు సమాచారం వెంటనే అందుతుంది. ఈ ఎటిఎంఎస్‌లో ఐదు రకాల వ్యవస్థలు ఉంటాయి.

ట్రాఫిక్ మోనిటరింగ్, ప్రమాదాల వీడియో చిత్రీకరణ, వాహన వేగం, వివిధ సందేశాలతో కూడిన సైన్‌బోర్డులు, సెంట్రల్ కంట్రోల్ రూమ్ వంటివి ఇందులో ఇమిడి ఉంటాయి. ఇందులోని కమాండ్ సెంటర్ అనేది డిజిటల్ బ్రెయిన్‌గా వ్యవహరిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్థానిక , జాతీయ రహదారి సిబ్బందికి సమాచారం అందిస్తుంది. దట్టమైన పొగమంచు ఏర్పడినా, రహదారిపై అడ్డంకులు ఉన్నా, రహదారుల్లోకి జంతువులు ప్రవేశించి స్వైరవిహారం చేసినా, సంబంధిత సిబ్బందిని ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై అమలు చేయడానికి కేంద్రం మోచిస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే రహదారులపై ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే రహదార్లు ఆధునిక సాంకేతికతను సంతరించుకుంటాయి.

కె. యాదగిరి రెడ్డి
98667 89511

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News