పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ని వెండితెరపై చూసి చాలాకాలమే అయింది. రాజకీయాల్లో ఆయన బిజీగా ఉన్న కారణంగా సినిమాలకు ఆయన బ్రేక్ ఇచ్చారు. అయితే ఎపికి డిప్యూటీ సిఎంగా పని చేస్తూనే.. మళ్లీ సినిమాపై దృష్టి పెట్టారు పవన్. ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఒకటి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించింది.
జూలై 3వ తేదీ ఉదయం 11.10 గంటలకు హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ట్రైలర్‌ని పవన్‌కళ్యాణ్ చూసి.. చాలా ఆనందించారని పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పవన్ ఈ ట్రైలర్‌ని వీక్షించారు. ట్రైలర్ చూసిన పవన్ దర్శకుడిని అభినందించారు. ‘చాలా కష్టపడ్డావ్’ అంటూ హత్తుకున్నారు. ఇక ఈ సినిమాకి కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వం చేశారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి ఈ సినిమాకు బాణీలు సమకూర్చారు. జూలై 24వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.