Friday, July 4, 2025

సెక్యులర్, సోషలిస్టు పదాలపై రాద్ధాంతం

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ పీఠికలో సోషలిజం (సామ్యవాదం), సెక్యులరిజం (లౌకికవాదం) పదాలను చేర్చడం మరో సిద్ధాంతపరమైన సంఘర్షణకు తెరలేపింది. 1976 లో 42వ సవరణ సందర్భంగా ఈ రెండు పదాలు పీఠికలో చేర్చబడ్డాయి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రయోజనాల గురించి చర్చించడం విలువైనది కాగా, ఈ పరిశీలన సమయం, స్వరం గణతంత్ర రాజ్య ఆధారభూతమైన నైతిక విలువలను పునఃపరిశీలన చేయడానికి పెద్ద ప్రయత్నం జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం, సోషలిస్టు పదాలపై పునరాలోచించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే పిలుపునిచ్చారు. మొదట ఆమోదించిన రాజ్యాంగంలో ఈ పదాలు లేవని ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ ప్రోద్బలంతో ఇవి చేర్చారని ఆయన విమర్శించారు. వాస్తవానికి ఇందిరా గాంధీ రాజ్యాంగ పీఠికలో ఈ పదాలను చేర్చడం ద్వారా తన విశ్వసనీయతను చాటుకునే ప్రయత్నం చేశారు.

అయితే రాజ్యాంగ వ్యవస్థ మౌలిక ఉపదేశంలో లౌకికవాదం, సోషలిజాలకు సంబంధించిన వాటిని మార్చడానికి వీల్లేదని కేశవానంద భారతి కేరళ రాష్ట్రం మధ్య సాగిన వివాదంపై వచ్చిన తీర్పులో వివరించినట్టు సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ తరువాత 1994లో ఎస్.ఆర్ బొమ్మయ్ కేంద్ర ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదంలో కూడా లౌకికవాదం రాజ్యాంగ మౌలిక అంశమని, రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ దానిని మార్చటానికి వీల్లేకుండా చేసిందని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. రాజ్యాంగం అవతరించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిస్టు పదాలను తీసివేయాలని సుప్రీం కోర్టులో అనేక కేసులు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘకాలం విచారణ జరిగింది.

చివరకు 2024 నవంబరు 25న ఆ కేసులన్నీ కొట్టివేస్తూ సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ పదాలు రాజ్యాంగబద్ధమే అని స్పష్టం చేసింది. ఈ విధంగా తీర్పులు వచ్చినా ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్‌పరివార్ వర్గాలు సెక్యులరిజం, సోషలిజం పదాలపై అనవసర రాద్ధాంతాన్ని సాగిస్తున్నారు. ఈ పదాలపై సమీక్ష చేయాలని హోసబలే పిలుపునివ్వడం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను బేఖాతరు చేయడమే. అధికారం తమ చేతిలో ఉందికదా ఏదైనా చేయవచ్చునన్న ధీమా కమలనాథుల్లో పేరుకుపోయింది. చివరికి ఆ పదాలను తొలగించినా ఆశ్చర్యపోనక్కరలేదు. విభజన వాదాలతో పబ్బం గడుపుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రోజురోజుకీ అనేక సవాళ్లు పెరుగుతున్నాయి. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, మణిపూర్ వంటి తీవ్ర సంఘర్షణలను నివారించలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేక ఎత్తుగడలు పన్నుతున్నారు.

అందులో భాగంగానే ఎమర్జెన్సీ 50 ఏళ్ల సంఘటనను సాకుగా పెట్టుకుని ఊరూవాడా సభలు, చర్చలు పెట్టి కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలపై విషం చిమ్మేలా ప్రచారం చేస్తున్నారు. అందులో రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్, సోషలిస్టు పదాలపై సమీక్ష జరగాలన్న వివాదాన్ని ప్రముఖంగా తెరపైకి తెస్తున్నారు. సెక్యులరిజం (సామ్యవాదం) అన్నది మన భారతీయ సంస్కృతిలో పాతుకుపోయింది. విధాన రూపకల్పనలోను, పరిపాలనలోను మార్గదర్శక సూత్రంగా పనిచేస్తోంది. ఈ మౌలిక సూత్రాలను ప్రశ్నించడమంటే భారతదేశాన్ని సమగ్రంగా కలిపి ఉంచే విభిన్న సామాజిక వస్త్రమనే సున్నితమైన సమతుల్యతను చెడగొట్టడమే. రాజ్యాంగ పీఠికలో సోషలిజం అనే పదాన్ని చేర్చడం సమస్యాత్మకమే. ఎందుకంటే సాంకేతికంగా సోషలిస్ట్ వ్యతిరేక పార్టీలను ఇది నిషేధిస్తుంది. కానీ అప్పుడు సోషలిస్టు వ్యతిరేక ఆర్థిక సరళీకరణ విధానాల రూపకల్పనకు కానీ, అమలుకు కానీ ఈ పీఠిక సెక్యులర్, సోషలిస్టు పదాలు ఎలాంటి సమస్యను తీసుకురాలేదు.

అందువల్ల ఈ రెండు పదాలపై సంఘ్ పరివార్ విరక్తి చెందడం అర్థం లేని విషయం. ఇటువంటి సైద్ధాంతిక ప్రయత్నాల ప్రమాదం దేశం నిత్యం ఎదుర్కొంటున్న వాస్తవమైన, ప్రత్యక్షమైన సమస్యలపై దృష్టిని కేంద్రీకరించనీయకుండా ఆటంకం కలిగిస్తుంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, ప్రజారోగ్య భద్రత లోపం, నాణ్యమైన చదువులు లేకపోవడం, పర్యావరణ క్షీణత, ఆర్థిక అసమానతలు పెరిగిపోవడం, తదితర ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం తగిన ప్రయత్నం చేయనీయదు. ఈ సమస్యలను పరిష్కరించడానికి బదులు రాజకీయ వ్యవహారమే ప్రాధాన్యంగా మారిపోయిప్రతీకాత్మకమైన, విభజనకరమైన చర్చలకు దారితీస్తుంది. దీనివల్ల ప్రజల దైనందిన జీవితాలకు అందవలసిన ప్రయోజనాలు సరిగ్గా అందకుండాపోతాయి. ఈ దూకుడు సైద్ధాంతిక ఎత్తుగడలు బిజెపి రాజకీయ ప్రయోజనాలను ఏ విధంగానూ నెరవేర్చలేవు. వాస్తవానికి అవి వ్యతిరేక పరిణామాలకు దారితీస్తాయి.

ఉదాహరణకు ఉప్పు, నిప్పులా భగ్గుమంటూ విడిపోయే బంధువులు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే ఈ పీఠిక పదాల తొలగింపు నిర్ణయానికి వ్యతిరేకంగా చేతులు కలపడం గమనించాల్సిన విషయం. ఈ సిద్ధాంతపరమైన విధానం బిజెపి క్యాడర్‌కు, సిద్ధాంతపరమైన ఎత్తుగడదారులకు సంతృప్తి కలిగించవచ్చు. కానీ ఆధునిక ఓటర్లను, ప్రాంతీయ పార్టీల పొత్తులను దూరం చేస్తుంది. విస్తృతమైన ఎన్నికల విజ్ఞప్తిని అణచివేస్తుంది. దేశంలో ఓటర్లు ముఖ్యంగా యువత తమకు ఆర్థికంగా ఎలాంటి ఎదుగుబొదుగు ఉండడం లేదని, ఉద్యోగాలు రావడం లేదని తదితర నిరాశా, నిట్టూర్పులతో సతమతమవుతున్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో సైద్ధాంతిక చర్చలు ఒక అంతర్భాగమైనప్పటికీ, కాషాయవాదుల వ్యత్యాసాలు, విభజన వాదాలు ముఖ్యమైన అబివృద్ధి అంశాలను పక్కదారి పట్టిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News