Sunday, April 28, 2024

లౌకికతత్వమా? మతరాజ్యమా!

- Advertisement -
- Advertisement -

‘భగవంతుడు నన్ను భారత ప్రజల ప్రతినిధిగా నియమించాడు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఈ నెల 12న దీక్ష చేపట్టిన సందర్భంగా అన్నారు. ‘భారత రాజకీయాలు ఆచరణలో వేదాంతమే తప్ప మరొకటి కాదు’ అని అంబేడ్కర్ 1928లో భారత చట్టబద్ధ కమిషన్‌లో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. ‘ప్రభుత్వం బలహీనపడినప్పుడు లౌకికత్వం రాజకీయాలకు దూరమవుతుంది. ఆచరణలో రాజకీయాలు వేదాంతమైనప్పుడు కూడా లౌకికత్వం బలహీనపడుతుంది. ఈ వేదాంతం నుంచి అణగారిని వర్గాలను కాపాడాలి’ అని అంబేడ్కర్ మహాశయుడు పిలుపినిచ్చారు. దేశంలో జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఒక సార్వభౌమాధికారం గల లౌకిక దేశంలో ఈ నెల 22న జరిగిన రామాలయ విగ్రహ ప్రతిష్టాపనలో ప్రధాని పాల్గొన్న సందర్భంగా ‘ఆచరణలో వేదాంతం’ అన్న అంబేడ్కర్ మాటలు దృశ్యమానమవుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితం అయోధ్యలో హిందుత్వవాదులు బాబ్రీ మసీదును కూలదోసిన సందర్భంగా జరిగిన మత ఘర్షణల్లో రెండు వేల మందికి పైగా మరణించారు. మసీదు కూగొట్టినచోటే రామమందిర నిర్మాణానికి అధికారిక అనుమతి లేదు. నిబంధనలు లేకపోయినా, విగ్రహ ప్రతిష్టాపన రోజు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అర్ధ రోజో, పూర్తి రోజే సెలవు ప్రకటించాయి.

‘లౌకికత్వం మతానికి వ్యతిరేకం కాదు. వ్యవస్థీకృత మత ఆధిపత్యానికి మాత్రమే వ్యతిరేకం’ అని రాజనీతి శాస్త్రవేత్త రాజీవ్ భార్గవ్ 2013లో రాసిన వ్యాసంలో స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం అన్ని మతాలపట్ల విమర్శనాత్మక గౌరవం, తాత్విక ప్రాపంచిక దృక్పథం, అందరిపట్ల ఒకే దృక్పథం అన్న విధానాన్ని అనుసరించినప్పుడే లౌకిక రాజ్యం సాధ్యమవుతుంది’ అని రాస్తారు. ప్రభుత్వానికి, మతానికి మధ్య ‘సూత్రబద్ధమైన దూరం’ అస్పష్టంగా ఉన్నప్పుడు, స్వతంత్ర భారత దేశంలో జనవరి 22 నాటి సంఘటన అపూర్వమెన సందర్భమా? ‘లౌకికత్వాన్ని దారుణంగా చిదిమేశారు’ అని భార్గవ్ ‘దవైర్’తో మాట్లాడుతూ అన్నారు. ‘ప్రస్తుత సందర్భంలో లౌకికత్వం రంగంలో లేదు. లౌకికత్వాన్ని వదిలేశారు. ఏరకమైన నిర్వహణకైనా ఈ సమయం సిద్ధంగా ఉంది. ఒక్కసారిగా లౌకికత్వాన్ని పక్కన పెట్టేస్తే, లౌకిక రాజ్యానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం దేనిని తీసుకురానుంది? ఇక్కడ మూడు అవకాశాలున్నాయి: మొదటిది దైవ పాలన. దైవపాలనలో సైద్ధాంతికంగా శంకరాచార్య ప్రధాన మంత్రి అవుతారు. ఇలా జరగడానికి అవకాశం లేదు. మత ప్రభుత్వానికి, మతవర్గ నాయకుడికి మధ్య సన్నిహిత సంబంధాలుండడమనేది రెండవ అవకాశం. ప్రభుత్వాన్ని నడపడంలో దేశాధినేతకు, మత నాయకుడికి సమాన భాగస్వామ్యం ఉంటుంది.

ఈ రెండు పద్ధతులు ఇక్కడ జరగబోవడం లేదు. మరిక్కడ ఏం జరగబోతోంది? ఇక్కడ మూడవ విధానం ప్రకారం తన నిబంధనలననుసరించి ప్రభుత్వం మతంతో కలిసిపోతుంది’. ‘భారత ప్రజల ప్రతినిధిగా భగవంతుడు నన్ను నియమించాడు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అనడం ‘రాజుకు కల్పించిన దైవదత్త అధికారమన్న విషయాన్ని గుర్తు చేస్తోంది’ అని భార్గవ్ అంటారు. ‘ఎవరో ఒకరు దేవుడి లాగా వ్యవహరిస్తూ తన ద్వారా దైవసందేశం వెలువడుతోందని, భగవంతుడి చేత ఎంపికై, దైవస్వరంతో ఈ ప్రాణప్రతిష్ఠను చేస్తున్నట్టు ప్రకటిస్తారు. రాజకీయాల ద్వారా మతాన్ని తనలో ఇముడ్చుకోవడం అంటే ఇదే. మతానికి, రాజకీయాలకు మధ్య ఉన్న రేఖ చెరిగిపోయింది. ప్రభుత్వ చొరవతో మత కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో మతాన్ని శాసించేలా ఉంది’. మతానికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సరిహద్దు రేఖను చెరిపేస్తున్నారని బిజెపి నాయకుడు, కేంద్రమాజీ మంత్రి రివి శంకర్‌ప్రసాద్‌ను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

‘ఈ మహా ఉత్సవానికి సదుపాయాలను సమకూరిస్తే, దాన్ని నిర్వహిస్తే సరిహద్దురేఖను చెరిపేయడం కాదు. రాముడి నిజమైన భక్తుడిగా ప్రధాన మంత్రి అక్కడికి వెళుతున్నారు. అవసరమైన క్రమశిక్షణను పాటిస్తున్నారు’ అని రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ నైతికత అనేది చాలా కీలకంగా మారిందని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలప్‌మెంట్ సొసైటీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ హిలాల్ అహ్మద్ అన్నారు. ‘ఈ కార్యక్రమాన్ని రెండు భిన్నమైన దృక్పథాల నుంచి చూడవచ్చు. ఇదొక సాంస్కృతిక కార్యక్రమమని కొందరు వాదిస్తారు. ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా హాజరవడమే కాదు, ఆమోదించిన చట్టపరమైన సాంకేతిక అంశంగా వివరణ ఇస్తున్నారు. చాలా మంది బిజెపి నాయకులు ఈ విధమైన వాదనలను తీసుకొస్తున్నారు.

భారతీయ సందర్భంలో గుడికి కానీ, మసీదుకు కానీ, మతపరమైన కార్యక్రమాలకు కానీ డబ్బులు ఇవ్వడమనేది ఆమోదయోగ్యమవుతోంది. దీన్ని మరొక దృష్టికోణం నుంచి కూడా చూడవచ్చు.దీనికి సంబంధించి రాజ్యాంగ నైతికత అనే ఆలోచన కీలకం కానుంది. మత విషయాల నుంచి ప్రభుత్వం సూత్రబద్ధమైన దూరాన్ని పాటిస్తుందని అంచనా వేస్తున్నాం. ఇక్కడ రెండు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆలయ ప్రారంభ కార్యక్రమానికి మత శక్తులను దూరంగా అట్టిపెట్టడం సాధ్యమా? అసలిది మత కార్యక్రమమా, కాదా?రెండవ అంశం ఈ ఉత్సవంలో అన్ని మతాల ప్రజలు పాల్గొనేటట్టు చేస్తున్నారా, లేదా? ఈ దృష్టితో చూసినట్టయితే, భారతీయ దృష్టి నుంచి విలక్షణమైన లౌకికత్వం నుంచి, రాజ్యాంగ నైతికత నుంచి పక్కకు జరిగినట్టవుతుంది.

అయోధ్య కార్యక్రమానికి దూరంగా ఉండాలని ‘ఇండియా’ కూటమి నిర్ణయించుకుంది. తమ హిందూ గుర్తింపు కోసం వేరే వేదిక కోసం అన్వేషిస్తోంది. ఇది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం కనుక హాజరుకాకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా అస్సాంలోని ఒక గుడిని సందర్శించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని కాళికాలయాన్ని దర్శించాక కోల్‌కతాలో మత సామరస్య ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీని పాలిస్తున్న ఆవ్‌ుఆద్మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజధానిలో మూడు రోజుల రావ్‌ులీలాను నిర్వహించనుండగా, ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన నాసిక్‌లోని కలారాం గుడిలో ప్రార్థనలు చేయాలని చూస్తున్నారు. రాజకీయాలన్నీ బిజెపి కేంద్రంగా తిరుగుతుండగా, ఇతర రాజకీయ పార్టీలు అదే దారిని చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అహ్మద్ అంటారు.

‘కొన్ని చట్టపరమైన సాంకేతిక అంశాలపై ఆధారపడి అయోధ్య పైన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. హిందుత్వవాదులు వాదిస్తున్నట్టు వారికేమీ కట్టబెట్టలేదు. అయోధ్య తీర్పును మీరు చదివినట్టయితే, న్యాయస్థానం లౌకిక, చట్టపరమైన నియమాలను లేవనెత్తింది. రావ్‌ులల్లా విరాజ్‌మాన్ ప్రతినిధికి భూమినిచ్చింది. బాబ్రీ మసీదును కూలగొట్టడాన్ని నేరంగా పరిగణించింది. నూతన మసీదును నిర్మించడానికి అయిదు ఎకరాలు కేటాయించాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వివరాల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. హిందుత్వవాదులు ఏదైతే తమదని వాదిస్తున్నారో దాన్ని న్యాయస్థానం అంగీకరించినట్టు భావించడమే కాకుండా, హిందుత్వ రాజకీయాలు అజేయమనే భావనను ఈ రాజకీయాలు కలిగిస్తున్నాయి. బిజెపికున్న రామాలయం, హిందుత్వ గుత్తాధిపత్యాన్ని ప్రతిపక్షాలు బద్దలు కొట్టాలనుకుంటున్నాయి’. ‘ఈ సంఘటన ఇతర రాజకీయ పార్టీలను సందిగ్ధంలో పడేశాయి’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు చెందిన రాహుల్ వర్మ అంటారు.

‘వాళ్ళక్కడికి వెళితే ఒక సమస్య, వెళ్ళకపోతే ఒక సమస్య. ఇది అడకత్తెరలో పోకలా తయారైంది. దీనికి తేలికైన సమాధానం లేదు. ఇదేమీ వారికి ఉపయోగపడేది కాదు. దీనిపైన వారు ఆలోచించాలి. ప్రస్తుతం ఉన్నపరిస్థితిపైన స్పందిస్తున్నారేతప్ప ఇప్పుడు జరుగుతున్న దానిపైన వారి రాజకీయాలేమిటో ఆలోచించడం లేదు. తమ ప్రత్యర్థులు సందిగ్ధంలో ఉంటే, అది బిజెపికి లాభిస్తుంది. అది ఓట్లను రాలుస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. దీనిపైన అనుమానమే లేదు, ఈ ప్రశ్నపైన ప్రతిపక్షాలు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది’. ‘లౌకిక రాజకీయాలపైన రాజకీయవర్గాలకు శ్రద్ధపోయింది’ అని 2014 లో అహ్మద్ అంటారు. ‘అంటే లౌకికత్వం అసందర్భమైపోయిందనడానికి వీలులేదు. ప్రజలు వివిధ మార్గాల్లో లౌకితత్వానికి కట్టుబడి ఉన్నారు. రాజకీయంగా చెప్పాలంటే బిజెపి 2024 ఎన్నికల కోసం అయోధ్యను వాడుకుంటోంది. రాజకీయాలకు వచ్చేసరికి రామాలయానికి పరిమితులున్నాయన్న విషయం దానికి తెలియక కాదు.

హిందూ ఓట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. హిందు నమ్మకాన్ని ఉపయోగించుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ భావిస్తోంది. రాజకీయ ప్రయోజనాలకోసం బిజెపి మాత్రమే హిందుత్వాన్ని ఉపయోగించుకోవడం లేదు’ అని అహ్మద్ అంటారు. ‘జనవరి 22 అనేది స్వాతంత్య్రానంతర భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన రోజు’ అని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగపు మాజీ ప్రొఫెసర్ మృదులా ముఖర్జీ అంటారు. ‘ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధానిది ముఖ్యమైన పాత్ర. ఆయన మత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాణప్రతిష్ఠను నిర్వహించడం కంటే గుడిని ప్రారంభించడం భిన్నమైనది. నాకు తెలిసినంతలో భారత రాజ్యాంగం పరిధిలో దీన్ని అనుమతించదగింది కాదు’ గుడిని నిర్మించడమనేది మత కార్యక్రమాల్లో భాగం. కానీ ‘కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దీన్ని నిర్వహించారు’ అని ముఖర్జీ అంటారు.రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడం అంటే హిందు మతమైనా, క్రైస్తవం అయినా, ఇస్లాం అయినా అది మతోన్మాదమే అవుతుంది.

మూలం స్రావస్తి దాస్ గుప్త
అనువాదం
రాఘవశర్మ
9493226180
(‘ద వైర్’ సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News