Saturday, May 11, 2024

చెన్నైకి చాలా కీలకం.. నేడు సన్‌రైజర్స్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలకంగా మారింది. ఈ సీజన్‌లో చెన్నై ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక పోతోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. హైదరాబాద్ మాత్రం 8 మ్యాచుల్లో ఐదు విజయాలను సొంతం చేసుకుంది. ఈ ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ అసాధారణ ఆటతో అలరిస్తోంది.

అయితే వరుస విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్‌కు కిందటి మ్యాచ్‌లో బెంగళూరు షాక్ ఇచ్చింది. దీంతో చెన్నైతో జరిగే మ్యాచ్ సన్‌రైజర్స్‌కు కీలకంగా తయారైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ చాలా బలంగా ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు.

వీరిద్దరూ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందిస్తున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. హెడ్, అభిషేక్‌లకు కట్టడి చేయడం చెన్నై బౌలర్లకు అంత తేలిక కాదనే చెప్పాలి. ఇక క్లాసెన్, మార్‌క్రమ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, సమద్ తదితరులతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కానీ కిందటి మ్యాచ్‌లో హెడ్, మార్‌క్రమ్, క్లాసెన్, నితీష్, సమద్ తదితరులు విఫలమయ్యారు. దీని ప్రభావం జట్టుపై బాగానే పడింది. దీంతో బెంగళూరు చేతిలో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. అయితే చెన్నైపై మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే లక్షంతో సన్‌రైజర్స్ సిద్ధమైంది.

సవాల్ వంటిదే..
ఇక హైదరాబాద్‌తో పోరు చెన్నైకి సవాల్ వంటిదేనని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సిఎస్‌కె సమతూకంగానే ఉన్నా కొన్ని మ్యాచుల నుంచి ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. చెన్నై తన చివరి రెండు మ్యాచుల్లో లక్నో చేతిలో పరాజయం పాలైంది. లక్నోతో పాటు సొంత మైదానంలోనూ చెన్నైకి ఓటమి తప్పలేదు. ఇలాంటి స్థితిలో సన్‌రైజర్స్‌తో పోరు చెన్నైకి సవాల్‌గా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. అప్పుడే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News