Saturday, July 27, 2024

బిజెపిది సంపన్నుల ఎజెండా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ ప్రతినిధి : బిజెపి అజెండాలో పేదలు, కార్మికులు ఉండరని, పెద్ద గద్దలు అంబానీలు, అదానీలు ఉంటారని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రోడ్‌షో నిర్వహించి, పాత బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అబ్‌కీ బార్ చార్ సౌ అంటున్న బిజెపి మళ్లీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.400 అవుతాయని వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ క్రూషియల్ టైమ్‌లోఉందని, కరీంనగర్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను గెలిపించి తెలంగాణ గౌరవం, గులాబీ జెండా గౌరవం కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు రంగంలో ఉన్నాయని, ఏయే పార్టీలు ఏమేం చేశాయో అందరికీ తెలిసిందే అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం అంటున్న ప్రధాని మోడీ వేములవాడకు వస్తే హిందూ హిందూ అంటున్న ఎంపి బండి సంజయ్ మోడీని వేములవాడ కోసం ఒక్క రూపాయి అడగలేదని, మోడీ ఇస్తానని అనలేదని ధ్వజమెత్తారు.

వేములవాడ ఆలయ పరిసరాలు ఇరుకుగా ఉన్నాయని తాను 35 ఎకరాల స్థలాన్ని ఇప్పించానన్నారు. సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నేపథ్యంలో వారి సంక్షేమం కోసం తాము బతుకమ్మ చీరల వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి కార్మికులకు నెలకు 15, 20 వేల రూపాయలు వచ్చేలా చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బతుకమ్మ చీరల పథకంతో సహా అన్ని రద్దు చేసిందని మండిపడ్డారు. సిరిసిల్ల నేతన్నలకు రావల్సిన 370 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని కోరితే కాంగ్రెస్ నాయకుడొకరు పాపడాలు, నిరోధ్‌లు అమ్ముకోమన్నాడని, దీనిపై తాను కోపం వచ్చి ఒక మాట అన్నందుకు తనపై ఇసి 48 గంటల నిషేధం విధించినట్లు అన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులపై జిఎస్‌టి విధించిన మొదటి ప్రధాని మోడీ అన్నారు. చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించే అనేక పథకాలు రద్దు చేశారన్నారు. బిజెపి పాలన అంతా గ్యాస్ ..ట్రాష్ అని, సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్, బేటీ పడావో, అమృత్‌కాల్, అచ్చేదిన్, పేదోళ్ల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తాం వంటి అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆచరణలో అమలు చేయలేదన్నారు.

డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లే బిజెపి పాలన అన్నారు. తెలంగాణలో అమలు చేసిన అనేక మంచి స్కీంలను బిజెపి అడ్డుకుందన్నారు. కాంగ్రెస్ కూడా అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. మహిళలకు 2500 రూపాయలు వేయలేదని, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేదని, కేవలం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమలు చేస్తే అక్కడ ఆడవాళ్లు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోందని, ఆటో రిక్షా కార్మికులు అన్నమో రామచంద్రా అంటున్నారని అన్నారు. రైతుబంధు లేదు, కరెంట్, నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. పవర్‌లూమ్‌లు మూలన పడ్డాయని, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకునే స్థితి వచ్చిందన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, ఆగమాగమౌ, వెర్రి ఆవేశంతో ఓటు వేయవద్దని హితవు పలికారు. కాంగ్రెస్ అందర్నీ మోసగించిందని అయినా కాంగ్రెస్ ఓటు వేస్తే ఏంచేయకపోయినా ఓటు వేశారని, మళ్లీ వారికి ఓటు వేస్తే అన్నీ బంద్ చేస్తారని అన్నారు. మోడీ గోదావరి జలాలను ఎత్తుకుపోవాలని చూస్తున్నారని, తాను గోదావరి జలాలలో సజీవ జలధారలు సృష్టించానని అన్నారు. గోదావరి జలాలు పోతే మన బతుకులు గాయి గత్తర అవుతాయని అన్నారు.

రైతుల ధాన్యం కళ్లాల్లో తడిసి పోతుంటే కొనేవారే కరువయ్యారన్నారు. సిరిసిల్ల జిల్లాను రద్దు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడని, సిరిసిల్ల ఉండాలంటే బిఆర్‌ఎస్ గెలవాలని, సిరిసిల్ల జిల్లా పోకుండా అవసరమైన ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్, కరీంనగర్ ఎంపి అభ్యర్థి బోయినపపెల్లి వినోద్‌కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జడ్‌పి సిపి అరుణ, మున్సిపల్ సిపి జిందం కళచక్రపాణి, మాజీ జడ్‌పి సిపి తుల ఉమ, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణితో పాటుగా వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News