Wednesday, May 22, 2024

ఎన్నికల ఖర్చుపై కమిషన్ వేద్దామా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ /హైదరాబాద్ : ఎన్నికల్లో ఖర్చుపై కమిషన్ వేయడానికి సిద్ధమా అంటూ ప్రధాని మోడీకి సిఎం రేవంత్ సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో పెడుతున్న బిజెపి ఖర్చును మన కళ్లారా చూస్తున్నామని ఆయన తెలిపారు. మన సన్నిహితుల్లో ఎవరో ఒకరు సాయం చేస్తేనే మనం ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. తాజ్‌కృష్ణాలో శుక్రవారం రాత్రి జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బిజెపి, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పెట్టిన ఖర్చుల మీద చర్చ పెడుతామన్నారు. ఈ ఎన్నికల్లో సాయం పొందకుండా ఎవరూ ఎన్నికల్లో పాల్గొనడం లేదన్నారు. ఎవరైనా తమ సొంత ఆస్తులు అమ్మి ఈ ఎన్నికల్లో పోటీ చేశామని ప్రమాణం చేస్తారా అని రేవంత్ ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ మీద అవినీతి ఆరోపణలు చేసిన ప్రధాని మోడీ, గాంధీ ఫ్యామిలీ మీద కరెప్షన్ ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. రాజు నీతి గురించి చెబితే బాగుండదని, ఆయన నీతిగా ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని, భిన్న సంస్కృతులను గౌరవించడం కాంగ్రెస్ పార్టీ విధానమని సిఎం రేవంత్ తెలిపారు.

రాజ్యాంగాన్ని మార్చుతామన్న బరితెగింపుతో..
2014, 2019లో ఎన్డీయే కూటమిలను ఏర్పాటు చేసుకొని రాజ్యాంగాన్ని మార్చుతామన్న బరితెగింపుతో బిజెపి ఎన్నికలకు దిగుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఎలాగైనా కాపాడలన్న లక్షంతో కాంగ్రెస్ బరిలోకి దిగిందన్నారు. మతాలను విభజించడం, వ్యక్తుల మీద విషం చిమ్మడం లాంటి పనులను బిజెపి చేస్తోందన్నారు. విశ్వనగరంగా మారడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఒకవేళ బిజెపి చేతిలోకి హైదరాబాద్ వెళితే ఈ సమాజం నిట్టనిలువుగా చీలుతుందన్నారు. మధ్య యుగాల చక్రవర్తి మాదిరిగా తెలంగాణ రాష్ట్రం మారిపోతుందని సిఎం రేవంత్ ఆరోపించారు.
ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్యే పోరు..
ప్రస్తుతం ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య జరుగుతున్నాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలు అభివృద్ధి, సంక్షేమం చుట్టూ నడిచాయని ఆయన పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం ఈ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం పక్కదోవ పట్టాయని ఆయన దుయ్యబట్టారు. భారత రాజ్యాగమే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని బలహీనవర్గాల అభ్యున్నతికి తోడ్పడేలా రాజ్యాంగం రచన జరిగిందన్నారు. అందులో కేంద్ర, రాష్ట్రల మధ్య అధికార విభజన స్పష్టంగా ఉందని రేవంత్ గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో కేంద్రంలో బిజెపి అన్ని సంస్థలను చెరబట్టిందని ఆయన ఆక్షేపించారు.

పదేళ్లలో కెసిఆర్ వందేళ్ల విధ్వంసం
రాజ్యాంగాన్ని మారుస్తామని మోడీ అంటున్నారు, అలాంటి ప్రజల స్వేచ్ఛను హరించే పనిని అడ్డుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోందని సిఎం రేవంత్ తెలిపారు. ఈ క్రమంలో మతాలు, భాషలు, వ్యక్తుల మధ్య బిజెపి విషాన్ని చిమ్ముతోందని ఆయన ఆరోపించారు. దేశంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. పదేళ్ల పాలనలో కెసిఆర్ వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారని ఆయన ఆరోపించారు.
అసత్య ఆరోపణలు చేయడంలో మోడీకి ఎవరూ సాటిలేరు
అసత్య ఆరోపణలు చేయడంలో మోడీకి ఎవరూ సాటిలేరని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రధానిమోడీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై అస్యత ఆరోపణలు చేశారన్నారు. పాకిస్థాన్‌తో కలిసి మనోహ్మన్ సింగ్ ప్రధాని మోడీని చంపాలని సుఫారీ ఇచ్చారని మోడీ ఆరోపణలు చేశారన్నారు. దేశం ఏమైనా ఫర్వాలేదని ప్రధాని మోడీ ఆరోపణలు చేస్తున్నారన్నారు. హిందువుల మెడలోని మంగళసూత్రాలను గుంజుకొని ముస్లింలకు పంచుతారని రాహుల్‌పై ప్రధాని అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోడీ ప్రజల మనుషుల్లో శాశ్వతంగా వైషమ్యాలను నింపుతున్నారన్నారు. దీనివల్ల పలు రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందన్నారు. ఢిల్లీకి అతి దగ్గరగా ఉన్న యూపీలో అక్కడి ప్రభుత్వానికి పాలన చేతకాకపోవడంతో ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు అనుకూలంగా మారిందన్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఒకే మంత్రి పదవి
ఈ పదేళ్లలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో సరైన మంత్రి పదవి ఇవ్వలేదని సిఎం రేవంత్ ఆరోపించారు. కీలకమైన శాఖలన్నీ గుజరాత్‌లకే కేటాయించారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్, రాజ్యసభ స భ్యులు కలిపి 60 మంది ప్రజాప్రతినిధులు ఉంటే, ఒక కేంద్ర మంత్రి పదవి మాత్రమే మోడీ ఇచ్చార ని, తెలుగు రాష్ట్రాలంటే ఆయనకు అంత చిన్నచూ పు అని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కేం ద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రమంత్రి పదవులకు సంబంధించి సౌత్‌కు నాలుగు ఇస్తే నార్త్‌కు ఆరు శాఖలను ఇచ్చేవారన్నారు. రాష్ట్రపతి పదవి సౌత్‌కు ఇస్తే నార్త్‌కు ఉప రాష్ట్రపతి ఇచ్చేవారని రేవంత్ తెలిపారు. ప్రస్తుతం 10 ఏళ్లుగా ప్రధాని మోడీ తీసుకున్న విధానంతో దేశానికి నష్టం వస్తుందన్నారు. ఈ పదేళ్లలో క్రమక్రమంగా బిజెపి అన్ని సంస్థలను చెరబట్టిందన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ కార్యాచరణ అమలుకు బిజెపి ఏర్పాటు
1925లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభించినప్పుడు హిందువుల కోసం కోట్లాడడానికి దీనిని ప్రారంభించామని చెప్పారు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తోందని, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి బిజెపి పార్టీని పెట్టుకున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. మిలిటెంట్ కోసం భజరంగ్‌దళ్‌ను పెట్టుకున్నారన్నారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలను కూల్చివేసి బిజెపి పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందని, ఒక ఐడియాలజీతో బిజెపి ముందుకెళుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రిజర్వేషన్‌లను రద్దు చేస్తాం, రాజ్యాంగాన్ని మార్చుతామని ప్రధాని మోడీ పేర్కొంటున్నారన్నారు.

ప్రజాస్వామిక ప్రేమికులంతా చైతన్యం కలిగి ఉండాలి
ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ప్రజాస్వామిక ప్రేమికులంతా చైతన్యం కలిగి ఉండాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు మన మనుగడనే ప్రశ్నించేలా ఉన్నాయన్నారు. అందుకే ఈసారి సెలవులకు కుటుంబంతో టూర్‌లకు వెళ్లకుండా కచ్చితంగా ఓటు వేయాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఫోర్త్ ఎస్టేట్ కూడా వ్యవస్థ, సమాజం కోసం ఒక అడుగు ముందుకు వేయాలన్నారు. మహామహులు తెలంగాణ కోసం కలం విప్పారని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రధాని మోడీని గద్దె దించేలా మన సామాజిక బాధ్యతను తీసుకోవాలన్నారు.
బిఆర్‌ఎస్, బిజెపి కుట్రలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ యత్నం
తెలంగాణ ప్రజల త్యాగాల పునాదుల మీద ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని సిఎం రేవంత్ ఆరోపించారు. గత డిసెంబర్‌లో ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణ సమాజాన్ని నిట్టనిలువుగా చీల్చి బిజెపికి తెలంగాణను అప్పగించాలని చూస్తోందన్నారు. ఈ కుట్రలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News