Monday, July 7, 2025

నువు నిద్రపోవాలనే కదా అనుకున్నావ్..

- Advertisement -
- Advertisement -

కవయిత్రి స్వేచ్ఛకి నివాళి : ప్రముఖ టీవీ జర్నలిస్ట్, కవయిత్రి, స్వేచ్ఛ జూన్ 27వ తేదీన బలవన్మరణానికి బలి అయింది.
మట్టి పూలు కవితా సంకలనాన్ని వెలువరించడంతో పాటు, అనేక అద్భుతమైన కవితలను ఆమె రాసింది. ఈ విషాదకర, ఆకస్మిక నిష్క్రమణ ఎంతో విచారకరం. ‘మెహఫిల్ ’ బాధాతప్త హృదయంతో స్వేచ్ఛకు నివాళి అర్పిస్తోంది. మెహఫిల్ పాఠకుల కోసం స్వేచ్ఛ కవితల్ని కొన్ని అందిస్తున్నాం.

అడవి: చీకటిలో నడుచుకుంటూ
వెళ్తున్నప్పుడు ఆకాశంలో
నల్లటి నీడలు దగ్గరికొస్టున్న కొద్దీ
తెలిసిన ఆకారాలు..
ఎండు కొమ్మల మీద
తీగ నీడలు.. వాటి వెనక
ఈ నీడలను పుట్టించిన చంద్రుడు
కాలం తెలుస్తున్నంతసేపు
కదలిపోమన్నాడు..
చలనం, నడక, పరుగు, ప్రవాహం
ఇవే జీవితమంతా నిండినప్పుడు
నేనుండాల్సిన అడవి తెలుస్తుంది
నేను అడవిలోనే ఉండిపోవాలని
తెలిసొస్తుంది..

మిగిలిందేంటి?

శిథిలాలు తీసేకొద్దీ మృతదేహాలు..
అది భూకంపం, ప్రకృతి విలయం
జరగకూడని ఘోరం

మరి మానవ విలయం?
విలువల పునాదులు కదిలిపోయి
మనిషితనం శిథిలమై పోయినాక
మానవ సమూహాల్లో మిగిలేది
మృతదేహాలే..
ఇక శిథిలాలు తొలగించే దెవరు?
కాపాడాల్సిన ప్రాణాలు ఎవరివి?
ఇప్పుడింకా మిగిలిందేంటి?
ఆఖరితనమా?
అనివార్య అంతమా?

కడుపులోంచి బయటపడి
చేతుల్లోకి తీసుకొని
గుండెలకద్దుకున్నప్పుడు
చిన్ని ప్రాణం.. చిన్ని మొఖం..
ఎంత చిన్నగా ఉంది
నా చేతుల్లో అనుకున్నా..
రాత్రంతా మేలుకొనే ఉండి
చూస్తూనే ఉన్నా
ఈ చిన్ని ముఖం నా చేతుల్లో
ఎప్పుడు నిండుతుందా అని
నా బిడ్డ నవ్వు ముఖంలో..
ఇప్పుడు దోసిలి నిండా

సముద్రన్ని చూడాలనిపిస్తుంది

వెంటనే పరిగెత్తుకుంటూ
వస్తున్న అలలు
నురగలని వెంటాడుతూ
ఒడ్డు వైపు ఆశగా చూస్తున్నాయి
ఎప్పటి నుంచో దాచుకున్న
సముద్రపు మాటలన్నీ
హోరులా వినిపిస్తున్నాయి
నేనిప్పుడు తీరాన్నా
ఎగసిన అలల ప్రాణాన్నా
కడలి నిగూఢ అంతరంగాన్నా
చీకట్లో పుట్టిన మబ్బులు
ఆలోచనల్ని చీల్చుకొని
కదిలిపోతున్నాయి
సూర్యుడు కప్పుకున్న దుప్పటిని
ఈ రోజుకి గుంజేస్తున్నాఅతని నవ్వు ముఖం చూద్దామని..

ఒక యుద్ధపు సమరం

చుట్టూ మనుషులున్నట్టు ఉంటుంది
బెడ్ మీద నిద్రపోతున్న నీకు
మనుషుల అలికిడి తెలుస్తుంటుంది
బెడ్ రూమ్‌లో ఏదో వస్తువుల కోసం
దూరంగా అడుగుల చప్పుడు
హాల్‌లో టీవీ చూస్తూ ఇద్దరు ముగ్గురు
మాట్లాడుకుంటున్నట్టు
డోర్ బయట పిల్లలు ఆడుకుంటున్నట్టు
అప్పుడప్పుడు నువ్ నిద్రలో ఉన్నప్పుడు
ఇంటి చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు
పెద్ద పెద్ద శబ్దాలు నీకు దగ్గరైతున్నట్టు
అయినా నువు నిద్రపోవాలనే
కదా అనుకున్నావ్
కంటి నిండా కలలు కందామనే
కదా నిర్ణయించుకున్నావ్
ఏదేమైనా హాయిగా నిదురపో
నీతో నీకు యుద్ధం లేనప్పుడు
ఏ హోరూ నీకు వినిపించదు
ఇక ప్రశాంతంగా నిదురపో…

ఒక  జీవితం
యుద్ధంలో సూర్యుడు ఓడిపోతాడు
పగళ్లు నిషేధించబడతాయి
వెన్నెళ్లు రాజ్యమేలుతాయి
ఆకాశంలో చందమామ
ఎప్పటికీ ఉండిపోతుంది
ఎండ వేడికి ఇంకే పిచ్చుకా చచ్చిపోవద్దని
తలుపు లేని పంజరమొకటి
మిణుగురులతో వెలిగిపోతుంటుంది..

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు..
నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే

తలవంచుకు వెళ్లిపోయావా, నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి..
తలపోసిన వేవీ కొనసాగకపోగా
అటు చూస్తే ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వు, చేయూతా ఇవ్వక
మురికితనం, కరకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే
తలవంచుకు వెళ్లిపోయావా, నేస్తం
శ్రీశ్రీ

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News