మన తెలంగాణ/కొల్లాపూర్ : గత ప్రభుత్వం నిర్లక్షం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, ఎల్లూరు గ్రామంలోని రేగుమాన్ గడ్డ వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఎ ల్లూరు పంప్‌హౌస్‌లో మోటార్‌ను మంగళవారం స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఎంజిఎల్‌ఐ ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీలు 28, 29, 30 కింద ఉన్న ఎల్లూరు, సింగోటం, జొన్నబొగుడ, గుడిపల్లిగట్టు జలాశయాలను నింపి ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా సాగునీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా నిర్లక్షం వహించారని ఆరోపించారు. కేవలం కాగితాలపై జిల్లాలో ఆయకట్టు విస్తీర్ణాన్ని 4.60 లక్షల ఎకరాలకు పెంచినట్లు చూపించి నీటి విడుదలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయలేదన్నారు. కాలువల నీటి ప్రవాహ సామర్థాన్ని పెంచలేదని, మోటార్ల మెయింటనెన్స్ భద్రంగా నిర్వహించలేదని ధ్వజమెత్తారు. 5 మోటర్లలో 2 మోటర్లు కాలిపోయినా పట్టించుకోలేదని ఆరోపించారు. తాము అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఎన్నిసార్లు సూచనలు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసరంగా నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతుల ప్రయోజనాల కోసం అన్నివిధాలుగా న్యాయం జరుగుతుందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి సిఇ విజయ భాస్కర్ రెడ్డి, ఎస్‌ఇ సత్యనారాయణ రెడ్డి, ఇఇలు శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ ప్రభు, చంద్రశేఖర్, మురళి తదితరులు పాల్గొన్నారు.