Saturday, July 12, 2025

మహిళల కోటాలో బీహార్ ఆదర్శం

- Advertisement -
- Advertisement -

మహిళలు విద్యావంతులైనప్పుడు మాత్రమే జనాభా పెరుగుదల అదుపు లోకి వస్తుంది. మహిళలు నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల అణిచివేతకు గురౌతూ జనాభా నియంత్రణను కట్టడి చేయలేకపోతున్నారు. వారు విద్యావంతులైతేనే జనాభా నియంత్రణ సాధ్యమవుతుంది’ అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2023 జనవరిలో బీహార్ రాష్ట్రంలో సమాధాన్ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సమయంలో వ్యాఖ్యానించడం మహిళల సాధికారతపై ఆయనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. తాజాగా బీహార్‌లోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ (Bihar women reservation) కల్పిస్తామని నితీశ్ కుమార్ నిర్ణయించడం మహిళల కోటా విషయంలో ఆదర్శబాటలో ముందడుగు వేసినట్టు స్పష్టమవుతోంది.

అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నందున మహిళల ఓట్లను గుత్తగోలుగా కొల్లగొట్టడానికి ఈ ఎత్తుగడ అని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా ఈ నిర్ణయం మహిళల జీవితాల్లో ప్రగతిదాయకమైన మార్పు తీసుకు వస్తుందని చెప్పవచ్చు. మద్యపాన నిషేధం, కులగణన వంటి బృహత్తర ప్రణాళికలను అమలులోకి తెచ్చి దేశం మొత్తం మీద ప్రత్యేకతను సాధించుకున్న బీహార్ రాష్ట్రం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. బీహార్‌లో శాశ్వత నివాసితులుగా ఉన్న స్థానిక మహిళలకే కులాలకు అతీతంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో (Bihar women reservation) అన్ని విభాగాల పోస్టులకు ఈ ప్రత్యేక రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. స్థానికత అంటే కనీసం మూడేళ్ల నుంచైనా బీహార్‌లో ఉంటున్నట్టు ఆధారాలు చూపించాలి. స్వంతగా ఇల్లు లేదా భూమి ఉండాలి. మహిళలకైతే రాష్ట్రానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగి ఉండాలి. ఈ నిర్ణయం బీహార్ రాష్ర్టేతర మహిళా ఉద్యోగులపై ఎలాంటి నష్టం కలిగించదు. ఎందుకంటే ఇదివరకే వీరు 35 శాతం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు నిబంధన ప్రకారం బీహార్ నివాసులు కాని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అర్హత ఉండదు.

2016 లో కూడా నితీశ్ ప్రభుత్వం మహిళలకు (Bihar women reservation) 35 శాతం రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పుడు ఆర్‌జెడి, కాంగ్రెస్ మిత్రపక్షాలతో జెడి(యు) అధికార కూటమికి కూడా ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఉండేవారు. అప్పుడు మహిళలకు 35 శాతం రిజర్వేషన్ ముఖ్యంగా పోలీస్ రిక్రూట్‌మెంట్, కో ఆపరేటివ్ సొసైటీలు తదితర కొన్ని రంగాలకే ఈ రిజర్వేషన్ అమలు చేశారు. అంతకు ముందు 2013లో పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ అమలుకాగా, కోఆపరేటివ్ సొసైటీల్లో 50 శాతం వరకు మహిళలకు రిజర్వేషన్ కల్పించి మహిళా పక్షపాతిగా నితీశ్ పేరు తెచ్చుకున్నారు. బాలికల విద్యకు సంబంధించి ముఖ్యమంత్రి బాలికా సైకిల్ యోజన (నగదు పంపిణీ), ముఖ్యమంత్రి కన్యా ఉద్ధవ్ యోజన (విద్యార్థినులైన బాలికలకు ఆర్థిక సాయం) అమలు చేశారు.

2016 లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌లో ‘స్థానికులు’ అన్న పరిమితి విధించకపోవడం విమర్శలకు దారి తీసింది. కానీ ఇప్పుడు ‘స్థానికత’ తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలోని మహిళలకే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం లభించింది. దేశంలోనే మూడవ అత్యధిక జనాభా కలిగిన బీహార్‌లో 2001లో 8.3 కోట్ల మంది ఉండగా, 2011 నాటికి 10.41 కోట్ల మంది ఉన్నారు. వీరిలో పురుషులు 5,42.78,157 కాగా, మహిళలు 4,98,21, 295 మంది వరకు ఉన్నారు. ఈ దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల 28.43 శాతం వరకు కనిపించింది. జనాభా వేగంగా పెరుగుతుండడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. నిరుద్యోగం, ఆర్థిక అసమానత, పరిమిత వనరులు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, విద్యావకాశాలు ఇవన్నీ సవాలుగా నిలిచాయి. 2023 కులగణన ప్రకారం బీహార్‌లో అక్షరాస్యత 79.8 శాతం వరకు పెరిగింది. 2011లో 61.18 శాతం మాత్రమే ఉండేది. అంటే 18 శాతం దశాబ్ద కాలంలోపెరిగింది.

రాష్ట్ర జనాభాలో 1.57 శాతం కన్నా తక్కువ మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. గత నెల వరకు పోలీస్ శాఖలో 36 వేల మంది మహిళలు పని చేస్తున్నారు. 2007 నుంచి 2.5 లక్షల కన్నా ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మహిళా సాధికారతే ప్రధాన లక్షంగా నితీశ్ ప్రభుత్వం పాలనా సంస్థల్లో కూడా మహిళలకు పట్టం కట్టింది. పంచాయతీల్లో గత కొన్నేళ్లుగా మహిళలకు 50 శాతం కోటా కల్పించింది. మహిళా స్వయం సహాయక సంఘాలు కూడా 10 లక్షల కన్నా ఎక్కువే ఉన్నాయి.

ఇక వివిధ రాష్ట్రాల్లో మహిళల ఉద్యోగ కోటాను పరిశీలిస్తే 2006లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా అభ్యర్థులకు 30% సమాంతర రిజర్వేషన్ కల్పించింది. ఆ రాష్ట్రంలో నివసించే స్థానిక మహిళలకే వర్తింపచేసింది. 2022 లో కర్ణాటక ప్రభుత్వం అన్ని విభాగాల్లో అవుట్ సోర్స్ మహిళా ఉద్యోగులకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది, ఇతర గ్రూప్‌డి ఉద్యోగులు, డ్రైవర్లను అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించింది. స్వయం ప్రతిపత్తి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రిజర్వేషన్ వర్తించేలా చర్యలు తీసుకుంది. 2022లో మహిళా దినోత్సవం సందర్భంగా త్రిపుర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో , ఉన్నత విద్యాసంస్థల్లో మహిళలందరికీ 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయించింది. 2020 లో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్ సివిల్ సర్వీస్, బోర్డులు, కార్పొరేషన్లకు ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఆమోదించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News